పోటుగాళ్లనుకుంటే పత్తాలేరే?

రాజ‌కీయాల్లో వ్యూహాలు కామ‌న్‌. ప్రత్యర్ధి పార్టీని చిత్తు చేసేందుకు ఏ పార్టీ అయినా వ్యూహ ప్రతివ్యూహాల‌తో ముందుకు సాగుతుంది. అయితే, ఈ వ్యూహాలు ఒక‌రిద్దరి విష‌యంలో విక‌టిస్తే.. [more]

Update: 2020-02-02 14:30 GMT

రాజ‌కీయాల్లో వ్యూహాలు కామ‌న్‌. ప్రత్యర్ధి పార్టీని చిత్తు చేసేందుకు ఏ పార్టీ అయినా వ్యూహ ప్రతివ్యూహాల‌తో ముందుకు సాగుతుంది. అయితే, ఈ వ్యూహాలు ఒక‌రిద్దరి విష‌యంలో విక‌టిస్తే.. ఫ‌ర్వాలేదు. కానీ, ఏకంగా ఐదుగురి విష‌యంలో అందునా పార్టీలో కీల‌క‌మైన నాయ‌కుల విష‌యంలో విక‌టిస్తే.. ఏమ‌వుతుంది? ఇప్పుడు అదే ప‌రిణామాన్ని, ప‌ర్యవ‌సానాన్ని కూడా చంద్రబాబు పార్టీ టీడీపీ ఎదుర్కొంటోంది. గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ పార్టీ వైసీపీని అధికారంలోకి రాకుండా చేసేందుకు ఆయ‌న వ్యూహాలు వేశారు. ఈ క్రమంలోనే కొంద‌రు నాయ‌కుల‌ను ఆయ‌న త‌ప్పించి వారికి ఎంపీలుగా అవ‌కాశం ఇచ్చారు. అయితే, ఈ ప‌ర్యవ‌సానం విక‌టించింది. ఇప్పుడు ఇలా ఓడిపోయిన వారంతా కూడా త‌ల‌లు ప‌ట్టుకుని పార్టీకి దూర‌మ‌య్యే ప‌రిస్థితి వ‌చ్చింది.

శివ‌రామ‌రాజు:

టీడీపీ సీనియ‌ర్ నేత‌. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఉండి నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా విజ‌యాలు సొంతం చేసుకున్న నాయ‌కుడు. అంతేకాదు, చాలా యాక్టివ్‌గా రాజ‌కీయాలు న‌డిపిన యువ నేతగా కూడా ఆయ‌న గుర్తింపు పొందారు. క్షత్రియ సామాజిక‌వ‌ర్గానికి చెందిన ఆయ‌న‌కు మంత్రి ప‌ద‌వి వ‌స్తుంద‌నుకున్నా చంద్రబాబు ఇవ్వలేదు. అయితే, గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆయ‌న‌ను ఉండి నుంచి త‌ప్పించి న‌ర‌సాపురం ఎంపీగా పోటీ కి పెట్టారు. అయితే, తాను ఎంపీగా ఓడిపోతాన‌ని చెప్పినా.. చంద్రబాబు విన‌లేదు. ఉండి స్థానాన్ని శివ‌రామ‌రాజు ఫ్రెండ్‌కు ఇచ్చి.. న‌ర‌సాపురం నుంచి ఆయ‌నను పోటీకి దింపారు. ఎన్నిక‌ల్లో ఆయ‌న ఘోరంగా ఓడిపోయారు. ట్విస్ట్ ఏంటంటే ఉండిలో శివ అనుచ‌రుడు క‌లువ‌పూడి రాంబాబు విజ‌యం సాధించారు.

సిద్ధా రాఘ‌వ‌రావు:

ప్రకాశం జిల్లా ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేసిన సిద్దా 2014లో ఇక్కడ నుంచి విజ‌యం సాధించారు. త‌న సొంత నిధుల‌తో కూడా నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీని బ‌లోపేతం చేశారు. మంత్రిగా ప‌నిచేసి అవినీతి మ‌ర‌క‌లు ప‌డ‌కుండా చూసుకున్నారు. పార్టీ కోసం కుటుంబాన్ని కూడా రంగంలోకి దింపారు.అ యితే ఆయ‌న‌ను గ‌త ఎన్నిక‌ల్లో ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చంద్రబాబు నిల‌బెట్టారు. వాస్తవానికి త‌న‌కు ఎంపీగా పోటీ చేయ‌డం ఇష్టం లేద‌ని ఆయ‌న చెప్పారు. త‌న ద‌ర్శి నియోజ‌క‌వ‌ర్గం టికెట్ ఇవ్వాల‌ని కోరారు. ఇక్కడి ప్ర‌జ‌లు కూడా సిద్దానే కోరుకున్నారు. అయినా చంద్రబాబు విన‌లేదు. ఫ‌లితంగా రెండు ల‌క్షల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక ఇప్పుడు సిద్ధా తిరిగి ద‌ర్శిలో రాజ‌కీయం చేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్పడింది.

ఆదినారాయ‌ణ‌రెడ్డి:

వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసిన జ‌మ్మల‌మ‌డుగు ఎమ్మెల్యే ఆదిని కూడా చంద్రబాబు గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో క‌డ‌ప నుంచి ఎంపీగా పోటీకి దింపారు. ఆయ‌న కూడా ఓడిపోతాన‌ని తెలిసి కూడా పోటీకి సిద్ధమ‌య్యారు. ఈ ప‌రిణామంతో టీడీపీ తీవ్రంగా దెబ్బతిన్నది. ఇక‌, ఎన్నిక‌ల్లో ఓట‌మి అనంత‌రం ఆది.. పార్టీ నుంచి దూర‌మై.. బీజేపీలోకి చేరిపోయారు.

డీకే స‌త్యప్రభ:

చిత్తూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించిన డీకే స‌త్యప్రభ‌ను కూడా చంద్రబాబు గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో త‌న‌కు పెద్దగా సంబంధం లేని రాజంపేట నియోజ‌క‌వ‌ర్గం ఎంపీగా బ‌రిలోకి దింపారు. వాస్తవానికి ఆమె కూడా త‌న‌కు ఎంపీగా పోటీ చేసే స‌త్తాలేద‌ని చంద్రబాబుకు ప‌లుమార్లు చెప్పుకొంది. అయినా చంద్రబాబు వినిపించుకోకుండా ఆమెను రాజంపేట‌కు పంపారు. ఆమె కూడా గ‌త ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు పార్టీలోనూ పెద్ద‌గా క‌నిపించ‌డం లేదు. స‌త్య‌ప్ర‌భ కుటుంబం రాజ‌కీయాల‌కు దూరం కావ‌డ‌మో లేదా వైసీపీ వైపు చూడ‌డ‌మో చేయ‌నుంద‌ని టాక్‌..?

బీద మస్తాన్‌రావు :

నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. కావ‌లి మాజీ ఎమ్మెల్యే. ఈయ‌న కూడా గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఎమ్మెల్యే టికెట్ కావాల‌ని చంద్రబాబుకు మొర‌పెట్టుకున్నారు. అయినా కూడా ప‌ట్టుబ‌ట్టి ఆయ‌న‌ను నెల్లూరు ఎంపీ స్థానం నుంచి నిల‌బెట్టారు. వాస్తవానికి గతంలో ఆయ‌న కావ‌లి ఎమ్మెల్యేగా గెలిచిన అనుభ‌వం ఉండ‌డంతో ఆయ‌న‌కు ఇష్టం లేక‌పోయినా చంద్రబాబు ఆయ‌న్ను ఎంపీగా పోటీ చేయించారు. బీద‌కు ఇష్టం లేక‌పోయినా చంద్రబాబు బ‌ల‌వంతంగా ఆయ‌న‌ను నిలబెట్టారు. కానీ, ఎన్నిక‌ల్లో ఆయ‌న ఓట‌మి పాల‌య్యారు. ఇటీవ‌ల ఆయ‌న టీడీపీకి దూర‌మై.. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. సో.. చంద్రబాబు ఎమ్మెల్యేలుగా కాద‌ని ఎంపీలుగా పోటీ చేయించిన‌ వ్యూహం ఇలా విక‌టించింద‌న్న మాట‌!

Tags:    

Similar News