ఏపీ రాజ‌కీయాల్లో ఇక వీరికి నో ఎంట్రీ అట

రాజ‌కీయాలు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండ‌వు. ఉత్థాన ప‌త‌నాలు, గెలుపు ఓట‌ములు స‌హ‌జం. ఇది ఏ నాయ‌కుడికైనా, నాయ‌కురాలికైనా వ‌ర్తించే సూత్రం. అయితే, వీటిని త‌ట్టుకుని [more]

Update: 2020-04-05 08:00 GMT

రాజ‌కీయాలు ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉండ‌వు. ఉత్థాన ప‌త‌నాలు, గెలుపు ఓట‌ములు స‌హ‌జం. ఇది ఏ నాయ‌కుడికైనా, నాయ‌కురాలికైనా వ‌ర్తించే సూత్రం. అయితే, వీటిని త‌ట్టుకుని నిల‌బ‌డిగ‌లిగిన నాయ‌కులు మాత్రమే రాజ‌కీయాల్లో చ‌రిత్రను సొంతం చేసుకుంటారు. లేని వారు రాజ‌కీయ చ‌రిత్రలో ఓ పుట‌గా మిగిలిపోవ‌డ‌మో.. ఓలైన్‌గా క‌లిసి పోవ‌డ‌మో చేస్తారు. మొత్తంగా చూస్తే.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా.. త‌ట్టుకుని నిల‌బ‌డ‌గ‌లిగిన నాయ‌కులు మాత్రమే రాజ‌కీయాల్లో మ‌న‌గ‌లిగార‌నేది నిష్టుర స‌త్యం. ఇక‌, ప్రస్తుత తాజా అంశానికి వ‌స్తే.. ఏపీకి చెందిన మ‌హిళా నాయ‌కులు కొంద‌రు క‌నుమ‌రుగు అవుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌రిద్దరికి రాజ‌కీయాలు క‌లిసిరాక పోవ‌డం, మ‌రికొంద‌రికి స్వయంకృత అప‌రాధాలు వంటివి వారిని రాజ‌కీయాల‌కు దూరం చేస్తున్నాయ‌ని అంటున్నారు.

స్వయంకృతమే ఎక్కువ….

ఇలా రాజ‌కీయంగా పెద్దగా సంచ‌ల‌నం సృష్టించి, ఒకానొక ద‌శ‌లో రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు పొందిన నాయ‌కురాళ్లు, నియోజ‌క‌వర్గాల్లోనూ, ప్రభుత్వంలోనూ కీల‌కంగా వ్యవ‌హ‌రించిన వారు కూడా ఇప్పుడు ఈ జాబితాలో చోటు పొంద‌డం గ‌మ‌నార్హం. వీరిలో కొత్తప‌ల్లి గీత‌, వంత‌ల రాజేశ్వరి, గిడ్డి ఈశ్వరి, న‌న్నప‌నేని సుధ‌, గుండా ల‌క్ష్మీదేవి వంటి నాయ‌కురాళ్లు క‌నిపిస్తున్నారు. వీరంతా పార్టీల్లో చురుగ్గా ఉన్నవారే. ప‌లు పార్టీల్లో త‌మకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పాటు చేసుకున్న వారే. అయితే, మారిన ప‌రిస్థితుల‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోలేక పోవ‌డం, స్వయంకృతం వారిని రాజ‌కీయాల‌కు దూరం చేస్తున్నాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. వీరిలో ఒక్కొక్కరిది ఒక్కో చ‌రిత్ర. ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రస్థానం.

పార్టీలు మారడంతో….

కొత్తప‌ల్లి గీత 2014 ఎన్నిక‌ల్లో వైసీపీ త‌ర‌ఫున అర‌కు ఎంపీగా గెలిచిన మాజీ డిప్యూటీ క‌లెక్టర్‌. ఎస్టీ వ‌ర్గానికి చెందిన ఆమె త‌ర్వాత జ‌గ‌న్‌తో విభేదించి చంద్రబాబుకు చేరువ కావాల‌ని భావించారు. అయితే, ఈ విష‌యంలో ఆమె స‌క్సెస్ కాలేక‌పోయి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో త‌న సొంత పార్టీ పైనే పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం బీజేపీలో ఉన్నప్పటికీ ఎలాంటి గుర్తింపు లేకుండా పోవ‌డం, ఆమెపుంజుకోక‌పోవ‌డం కూడా ఇక‌, ఆమె రాజ‌కీయాల‌కు దూరం అవుతున్నార‌నే వ్యాఖ్యలకు బ‌లం చేకూరుస్తున్నాయి. వంత‌ల రాజేశ్వరి విశాఖ జిల్లా రంపచోడ‌వ‌రం నుంచి 2014లో వైసీపీ జెండా పై గెలిచారు. ఇక‌, గిడ్డి ఈశ్వరి కూడా 2014లో వైసీపీ త‌ర‌ఫున పాడేరు నుంచి విజ‌యం సాధించారు. అయితే, త‌ర్వాత ఈ ఇద్దరు కూడా టీడీపీ పంచ‌న చేరిపోయారు.

దారులు మూసుకుపోయి…..

అయితే, ఇక్కడ వారు ఆశించిన మేర‌కు గుర్తింపు ల‌భించ‌లేదు. స‌రిక‌దా. గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఘోరంగా ఓడిపోయారు. ఇప్పుడు టీడీపీలో గుర్తింపు లేక‌పోవ‌డం స‌హా వైసీపీలోకి వ‌ద్దామ‌న్నా దారులు మూసుకుపోయాయి. పైగా వీరి నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ వీరిని ప్రజ‌లు ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. దీంతో వీరు కూడా రాజ‌కీయాల‌కు శెల‌వు ప్రక‌టిస్తార‌ని అంటున్నారు. న‌న్నప‌నేని సుధ. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు న‌న్నప‌నేని రాజ‌కుమారి కుమార్తెగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చినా.. వైసీపీ త‌ర‌ఫున వినుకొండ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ త‌ర్వాత పూర్తిగా త‌న వృత్తి వైద్యానికే ప‌రిమిత‌మ‌య్యారు. దీంతో ఆమె కూడా రాజ‌కీయంగా క‌నుమ‌రుగైనట్టేన‌ని చెబుతున్నారు.

ఓటమి దెబ్బకు…..

ఇక‌ శ్రీకాకుళం నియోజ‌క‌వ‌ర్గం నుంచి టీడీపీ త‌రఫున 2014లో విజ‌యం సాధించిన సుదీర్ఘ రాజ‌కీయ ప్రస్థానం ఉన్న గుండా ల‌క్ష్మీదేవి వ‌యో వృద్ధురాలు కావ‌డంతో ఇప్పుడు రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. ఇక‌, ఆమెగ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఓడిపోవ‌డం కూడా ఓ మేజ‌ర్ కార‌ణం. ఇక ఇప్పటికే గ‌త ఎన్నికల‌కు ముందే గుమ్మడి కుతూహ‌ల‌మ్మ, శోభా హైమావ‌తి లాంటి వాళ్లు ప్రత్యక్ష రాజ‌కీయాల‌కు దూర‌మైన ప‌రిస్థితి. టీడీపీకి చెందిన మ‌రో సీనియ‌ర్ నేత న‌న్నపునేని రాజ‌కుమారితో పాటు గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన డీకే స‌త్యప్రభ‌, మున్నూరు సుగుణ‌మ్మ లాంటి వాళ్లు ఇక రాజ‌కీయాల‌కు పూర్తిగా దూర‌మైన ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయి.

Tags:    

Similar News