ఇద్దరూ ఒక ఊరి వారే..? అందుకే అప్పగించారా?

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకోవ‌చ్చో కూడా ఊహించే ప‌రిస్థితి ఉండ‌దు. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు పార్లమెంట‌రీ [more]

Update: 2020-10-06 00:30 GMT

రాజ‌కీయాల్లో ఏమైనా జ‌ర‌గొచ్చు. ఎప్పుడు ఎలాంటి ప‌రిణామాలు చోటు చేసుకోవ‌చ్చో కూడా ఊహించే ప‌రిస్థితి ఉండ‌దు. ఇప్పుడు ఇలాంటి ప‌రిణామ‌మే ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఏలూరు పార్లమెంట‌రీ జిల్లాలోనూ చోటు చేసుకుంది. రాష్ట్రంలో ప్రధాన ప్రత్యర్థులుగా ఉన్న వైసీపీ, టీడీపీలు వ్యూహాత్మకంగా ఇక్కడ చ‌క్రం తిప్పేలా తెర‌దీశాయి. తాజాగా టీడీపీ పార్లమెంట‌రీ క‌మిటీలు ఏర్పాటు చేసిన చంద్రబాబు .. ఏలూరు పార్లమెంటును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ ప‌ద‌వి కోసం ఎంతో మంది పోటీ ప‌డినా ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గ‌న్ని వీరాంజ‌నేయులుకు ఈ ప‌ద‌వి క‌ట్టబెట్టారు.

అందరినీ సమన్వయం చేసుకుంటూ…..

వాస్తవానికి ఈ పార్లమెంట‌రీ నియోజకవర్గంలో పార్టీ అనేక స‌మ‌స్యలు ఎదుర్కొంటోంది. ఏలూరు మాజీ ఎమ్మెల్యే బ‌డేటి బుజ్జి హ‌ఠాన్మర‌ణం, ఏలూరు ఎంపీ మాగంటి బాబు అచేత‌నం కావ‌డం వంటి ప‌రిణామాల‌తో పార్టీ ఇబ్బందుల్లో ఉంది. ఇక రిజ‌ర్వ్‌డ్ నియోజ‌క‌వ‌ర్గాలు అయిన పోల‌వ‌రం, చింత‌ల‌పూడిలో పార్టీ గంద‌ర‌గోళంగా ఉంది. ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని ట్రాక్ ఎక్కించేందుకు గ‌న్ని వీరాంజనేయులు గ‌త నాలుగైదు నెల‌లుగా ఈ నియోజ‌క‌వ‌ర్గాల నేత‌ల‌ను స‌మ‌న్వయం చేస్తూనే ఉన్నారు. ఇక సామాజిక స‌మీక‌ర‌ణ‌ాల ప‌రంగా కూడా న‌ర‌సాపురం కాపు, రాజ‌మండ్రి ఎస్సీల‌కు ఇవ్వడంతో ఏలూరును క‌మ్మ వ‌ర్గానికి చెందిన గ‌న్నికి ఇచ్చిన‌ట్టు స్పష్టమ‌వుతోంది.

ఏడు చోట్లా వైసీపీ ఎమ్మెల్యేలే…..

మ‌రోప‌క్క, ఇక్క‌డ వైసీపీ త‌ర‌ఫున పార్ల‌మెంటు చీఫ్‌గా అదే ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఉన్నారు. ఈ పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో ఉన్న ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో వైసీపీ ఎమ్మెల్యేలే ఉండ‌డంతో పార్టీ దూకుడుగా ఉంది. ఈయ‌న కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. ఇక గ‌న్ని వీరాంజనేయులు వ‌ర్సెస్ వాసుబ‌ాబు గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ త‌ల‌ప‌డి చెరోసారి విజ‌యం సాధించారు. ఇప్పుడు వీరిద్దరు నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా పార్లమెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోనూ పార్టీ బాధ్యత‌లు చేప‌ట్టడం ఆసక్తిగా మారింది. మొత్తానికి ఉంగుటూరు నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన నేత‌లే ఏలూరు పార్లమెంట‌రీ జిల్లాకు అటు వైసీపీకి, ఇటు టీడీపీకి కూడా ఇంచార్జులుగా ఉండ‌డంతో ఏలూరు పార్లమెంట‌రీ జిల్లా రాజ‌కీయాల‌తో పాటు.. ఉంగుటూరు రాజ‌కీయాలు కూడా వేడెక్కడం ఖాయమే.

Tags:    

Similar News