తమ్ముడు అలిగాడా..?

బీజేపీ రాజకీయం తలపండిన చంద్రబాబుకే ఇప్పటికీ అర్ధం కావడంలేదు. ఇక రాజకీయాల్లో కొత్త పూజారి అయిన జనసేనాని పవన్ కల్యాణ్ ఎలా అర్ధం చేసుకోగలరు, తెల్లనివి అన్నీ [more]

Update: 2020-11-24 15:30 GMT

బీజేపీ రాజకీయం తలపండిన చంద్రబాబుకే ఇప్పటికీ అర్ధం కావడంలేదు. ఇక రాజకీయాల్లో కొత్త పూజారి అయిన జనసేనాని పవన్ కల్యాణ్ ఎలా అర్ధం చేసుకోగలరు, తెల్లనివి అన్నీ పాలు, నల్లనివి నీళ్ళు అనుకునే సగటు ఓటరు మనస్తత్వం కలిగిన పవన్ రాజకీయాల్లో అందుకే సరిగ్గా రాణించలేకపోతున్నారు. పైగా ఇక్కడ ఎప్పటికపుడు స్టాండ్ మార్చుకోవాలి. విధేయతలు, మర్యాదలు ఏ రోజుకు ఆ రోజుకు మారిపోతుంటాయి. ఎప్పటి లెక్కలు అపుడే సరిచూసుకోవాలి.

భ్రమలు తొలిగాయా…?

దేశంలో నరేంద్ర మోడీ, అమిత్ షాలు మాత్రమే బలమైన నాయకులు అని గత ఏడాది ఇదే సమయంలో పవన్ కల్యాణ్ గట్టిగానే చెప్పారు. వారిద్దరి వల్లనే ఈ దేశం బాగా ముందుకుపోతోందని కూడా పవన్ కీర్తించారు. నిజానికి ఇంతటి గొప్ప మాటలు అసలైన బీజేపీ నేతల నోటి వెంట కూడా ఎపుడూ రాలేదు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం ఈ మధ్య కాలం దాకా బీజేపీ పెద్దలను పొగుడుతూనే గడిపారు. అయితే ఎంత చెప్పినా ఎన్ని చెప్పినా జనసేనానిది వన్ సైడ్ లవ్ గానే ఉంది. పవన్ బలం, బలహీనతలు మాకు తెలుసు అన్నట్లుగా బీజేపీ వ్యవహరించడం కూడా ఆ పార్టీ వారిని కలచివేస్తోంది. దీంతో బీజేపీకి తన అవసరమా. లేక తనకు బీజేపీకి అవసరమా అన్నది తెలియక, తేలక పవన్ కల్యాణ్ ఇన్నాళ్ళూ డోలాయమానంలో పడ్డారు.

షాట్ కట్స్ ఉండవుగా…?

పవన్ కల్యాణ్ పెట్టిన్ పార్టీ జనసేన, దాన్ని కష్టమైనా నష్టమైనా సాకాల్సింది పవనే. బీజేపీ ఒడిలోకి తెచ్చి పెట్టి పెంచి పెద్ద చేయమంటే కుదిరే పనేనా. రాజకీయాల్లో ఎవరి అవసరాలు వారికి ఉంటాయి. పవన్ సినిమాలు చేసుకుంటూ బీజేపీ మీద అధారపడి రాజకీయాలు నడుపుదామనుకుంటే కమలంతో కుదిరే పని అసలు కాదు, పవన్ కల్యాణ్ కూడా కార్యక్షేత్రంలో ఉండాలి. బీజేపీ అవసరాలకు ఆయన ఉపయోగపడాలి. నిన్నటి దుబ్బాక ఉప ఎన్నికల వేళ పవన్ సాచివేత ధోరణి కూడా బీజేపీకి కొంత గుస్సా తెప్పించిందని టాక్ ఉంది. బీజేపీకి తాను పొలిటికల్ గ్లామర్ కాబట్టి, తన మీద ఆధారపడి వారు రాజకీయాలు చేస్తారనుకున్న పవన్ కల్యాణ్ కి బీజేపీ ఉదాశీనత కూడా మండుకొచ్చేలాగే ఉందిపుడు. ఇక బీజేపీ, మోడీ మీద ఆధారపడి సులువుగా అధికార పీఠం వైపు ఎగబాకవచ్చు అనుకుంటే కూడా తప్పేనని పవన్ కి ఇపుడు తెలిసి వచ్చిందేమో.

తిరుపతి పేచీయేనా…?

ఇక తిరుపతి ఉప ఎన్నిక వైసీపీ జాతకాన్ని తేల్చుతుంది అని అంతా అనుకుంటారు. కానీ బీజేపీ, జనసేన మిత్రత్వానికి కూడా అది అగ్ని పరీక్ష పెడుతుందని ఇపుడు అంటున్నారు. పవన్ కళ్యాణ్ ని సంప్రదించారో లేదో కానీ తిరుపతి నుంచి తాము పోటీ చేస్తామని బీజేపీ పెద్దలు చెప్పుకున్నారు. ఉప ఎన్నికల సన్నాహక మీటింగు కూడా తిరుపతిలో తాజాగా పెట్టి మరీ హుషార్ చేశారు. మరి ఏపీ రాజకీయాల వరకూ చూసుకుంటే ఆరు శాతం ఓట్లున్న పవన్ వంటి మిత్రుడితో కలసి బరిలోకి దిగాలనుకున్నపుడు కనీసం చెప్పాల్సింది కదా. కానీ అలా జరగకపోవడం వల్లనే తిరుపతి నుంచి తానూ పోటీకి సై అని జనసేన అంటోందిట. మొత్తానికి బీజేపీ పెద్దన్న వైఖరికి తమ్ముడు చిన్నబుచ్చుకుంటున్నాడు అంటున్నారు. అలాగే పవన్ సినీ హీరో వర్షిప్ పాలిటిక్స్ పట్ల బీజేపీలో కొంత అసహనం వ్యక్తం అవుతోంది అంటున్నారు. చూడాలి ఈ ఇద్దరు మిత్రుల కధ ఎందాకా చేరుతుందో.

Tags:    

Similar News