ఆ ఇద్దరు మంత్రులు మంచోళ్లే కానీ.. జాబితాలో చేరిపోయార‌ట

జ‌గ‌న్ కేబినెట్‌లో ఉన్న మంత్రుల‌ను మార్చేందుకు స‌మ‌యం స‌మీపిస్తోంది. గ‌ట్టిగా అయితే.. మ‌రో ప‌దిమాసాల్లో మంత్రుల‌ను పూర్తిగా మార్చాల్సిన అవ‌స‌రం ఉంది. ఇది జ‌గ‌న్ చెప్పిన మాటే. [more]

Update: 2020-10-14 08:00 GMT

జ‌గ‌న్ కేబినెట్‌లో ఉన్న మంత్రుల‌ను మార్చేందుకు స‌మ‌యం స‌మీపిస్తోంది. గ‌ట్టిగా అయితే.. మ‌రో ప‌దిమాసాల్లో మంత్రుల‌ను పూర్తిగా మార్చాల్సిన అవ‌స‌రం ఉంది. ఇది జ‌గ‌న్ చెప్పిన మాటే. త‌న కేబినెట్‌ను రెండున్నరేళ్లలో మ‌రోసారి పున‌ర్నియామ‌కం చేస్తాన‌ని ఆయ‌న చెప్పారు. అంటే.. పార్టీలో ఎక్కువ‌గా ఉన్న నాయ‌కులకు అవ‌కాశం ఇచ్చేందుకేన‌ని ఆయ‌న స్పష్టం చేశారు. అయితే, ఇప్పుడున్న వారిలో.. చాలా మంది మంత్రులు.. కీల‌క స్థానాల్లో చ‌క్రం తిప్పుతున్నారు. మ‌రికొంద‌రు ఆయ‌నకు అత్యంత స‌న్నిహితులు, నువ్వు-నువ్వు అనుకునే స్థాయిలో ఉన్నవారు ఉన్నారు.

మార్చడం ఖాయమా?

ఇంకొంద‌రు.. స్నేహితులు. మ‌రికొంద‌రు పార్టీ కోసం ఏమైనా చేసేందుకు రెడీగా ఉన్నవారు. ఇలా అంద‌రూ కూడా చాలా ముఖ్యులే. వీరిలో నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు మ‌రింత‌గా జ‌గ‌న్‌కు ఆప్తులు. వారే మేక‌పాటి గౌతంరెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్ యాద‌వ్‌. నిన్న మొన్నటి వ‌ర‌కు మంత్రి వ‌ర్గాన్ని మార్చినా.. వీరిని మాత్రం మార్చేది లేద‌ని సీనియ‌ర్లు సైతం స్పష్టం చేశారు. కానీ, ఇప్పుడు మారిన రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌లు.. రెడ్డి సామాజిక వ‌ర్గం నుంచి ఎదుర‌వుతున్న ఒత్తిళ్ల నేప‌థ్యంలో వీరిని మార్చడం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

వీరి ప్లేస్ లో…….

గౌతం రెడ్డి.. ప్లేస్‌లో నెల్లూరు జిల్లాకే చెందిన కాకాని గోవ‌ర్ధన్‌రెడ్డి లేదా ఆనం రామ‌నారాయ‌ణ రెడ్డి లేదా ప్రస‌న్న కుమార్‌రెడ్డి పేర్లు కేబినెట్ రేసులో గ‌ట్టిగా వినిపిస్తున్నాయి. వీరిలో ఒక‌రికి ఖ‌చ్చితంగా ప‌ద‌వి ఖాయ‌మ‌ని అంటున్నారు. అదే స‌మ‌యంలో అనిల్‌కుమార్ యాద‌వ్ బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. ఈయ‌న ప్లేస్‌లో మంత్రి ప‌ద‌వి కోసం.. ఎదు‌రు చూస్తున్న కృష్ణాజిల్లా పెన‌మ‌లూరుకు చెందిన నాయ‌కుడు మాజీ మంత్రి కొలుసు పార్థసార‌థికి ఇస్తార‌ని తెలుస్తోంది.

సీనియర్ నేత కావడంతో….

పార్థసార‌థి గ‌తంలో వైఎస్‌, రోశ‌య్య, కిర‌ణ్‌కుమార్ రెడ్డి కేబినెట్ల‌లో మంత్రిగా ప‌నిచేశారు. ఈయ‌న ఎన్ని ప‌ద‌వులు (విప్ ఇస్తే తీసుకోలేదు. దీంతో టీటీడీ స‌భ్యుడిగా నియ‌మించారు) ఇచ్చినా.. సంతృప్తి వ్యక్తం చేయ‌డం లేద‌ని.. ప‌ద‌వి ఇస్తే త‌ప్ప ఏమీ ప‌ట్టించుకోన‌ని భీష్మించార‌ని ఈ క్రమంలో అనిల్ స్థానంలో సార‌థికి ఛాన్స్ ఇవ్వక త‌ప్పద‌ని అంటున్నారు. దీంతో సీఎం జ‌గ‌న్‌కు ఎంత ప్రాణ‌మిత్రులైనా ఈ ఇద్దరినీ రీప్లేస్ చేయ‌క‌త‌ప్పేలా లేదు.

సమీకరణలు మారితే తప్ప…..

విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరిలో గౌతంరెడ్డి జిల్లాలో అజాత‌శ‌త్రువుగానే అంద‌రిని స‌మ‌న్వయం చేసుకుంటూ వెళుతున్నారు. అయినా ఆయ‌న్ను త‌ప్పించాల్సి వ‌స్తోంది. జిల్లాలో కేబినెట్ రేసులో మ‌రో నలుగురైదుగురు రెడ్డి ఎమ్మెల్యేలు ఉండ‌డంతో వారంతా కూడా మంత్రి ప‌ద‌వి ఆశిస్తున్నారు. ఇక అనిల్‌కుమార్ యాద‌వ్‌ను వ్యతిరేకిస్తోన్న వారి లాబీయింగ్ స్ట్రాంగ్‌గా ఉండ‌డంతో ఆయ‌న్ను త‌ప్పించ‌వ‌చ్చనే తెలుస్తోంది. చివ‌ర్లో సమీక‌ర‌ణ‌లు ఏమైనా మారితే త‌ప్పా వీరిద్దరి ప్లేస్‌లో మ‌రో ఇద్దరు ఎమ్మెల్యేల‌తో రీ ప్లేస్ అయ్యేందుకే ఎక్కువ ఛాన్సులు ఉన్నాయి.

Tags:    

Similar News