సీన్ లోకి సీఎంలు...!

Update: 2018-05-12 15:30 GMT

తలకిందులుగా తపస్సు చేసినా కాంగ్రెసు నేతలు మారరు. వచ్చే ఎన్నికల తర్వాత ఏంజరుగుతుందో ఎవరికీ తెలియదు. అసలు మనుగడే కష్టమవుతుందేమోనన్న పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది టీ కాంగ్రెసు. పార్టీ నాయకుల బుద్ధులు మాత్రం ముఖ్యమంత్రి పీఠంపైనే కేంద్రీకృతమై ఉన్నాయి. అగ్రనాయకులే తమ సొంత నియోజకవర్గాల్లో నెగ్గుతారో లేదో తెలియని అయోమయ స్థితిలో ఉన్న పార్టీలో సీఎం సీటు తమకోసం ఎదురుచూస్తోందన్నట్లు పోటాపోటీలు మొదలయ్యాయి. పార్టీలో ఉన్న విశృంఖల ప్రజాస్వామ్యమా? అరాచక స్వేచ్ఛా అన్నది అధిష్ఠానమే తేల్చుకోవాల్సి ఉంది. ఒకవైపు టీఆర్ఎస్ వినూత్న పథకాలతో ప్రజల్లో దూసుకుపోతోంది. అంతర్గత కుమ్ములాటలతో హస్తం పార్టీ నానాటికీ అడుగంటిపోతోంది. అసలు విషయాలను గుర్తించక పదవే పరమార్థం అన్నట్లుగా నాయకులు ప్రకటనలు గుప్పించడం పార్టీ శ్రేణులను నివ్వెరపరుస్తోంది. ప్రజల్లో నవ్వుపుట్టిస్తోంది. అంతా కలిసి నడవాల్సిన స్థితిలో అందలం కోసం అర్రులు చాస్తూ అప్పనంగా ప్రత్యర్థికి పంచభక్ష్యపరమాన్నాలు వడ్డించే తంతుగా ఉంది హస్తం నేతల తీరు.

అధినేతలు..వాతలు...

రాష్ట్ర కాంగ్రెసు నేతల్లో సీనియర్లంతా తమను తాము అధినేతలుగానే భావించుకుంటున్నారు. అవకాశం రావాలే కానీ తామే ముఖ్యమంత్రి పదవికి అందరికంటే అర్హులనే భావనలో లెక్కలు వేసుకుంటున్నారు. ఈ జాబితాలో సీనియర్ జానారెడ్డి మొదలు నిన్నామొన్న పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి వరకూ ఉన్నారు. తమ నియోజకవర్గ పరిధి దాటి ప్రాబల్యం,ప్రాచుర్యం లేకపోయినప్పటికీ అధిష్టానం తమకే పగ్గాలు అప్పగిస్తుందనే అత్యాశతో ఊహల ఊయల ఊగుతున్నారు. పీసీసీ పీఠం కోసం ఇటీవలికాలం వరకూ పోటీ కొనసాగింది. కోమటిరెడ్డి సోదరులు, డీకె అరుణ, మల్లుభట్టి విక్రమార్క, దామోదర రాజనరసింహ వంటి వారంతా ఈ పదవి తమకు అప్పగిస్తే 2019 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీని అధికార గమ్యానికి చేరుస్తామంటూ అధిష్టానానికి రకరకాలుగా చెప్పి చూశారు. ఉత్తమ కుమార్ రెడ్డి బెటరంటూ అధిష్టానం వీరి మాటలను పక్కనపెట్టేసింది. దీంతో ఈ పదవి రాకపోయినా సీఎం సీటు గురించి ముందస్తుగా కర్చీప్ వేసేస్తే పోయిందేముందంటూ పోటీలు మొదలుపెట్టారు. పైన పేర్కొన్న నేతలే కాకుండా మరికొందరూ సామాజిక సమీకరణల నేపథ్యంలో అధిష్టానం తమను పరిగణనలోకి తీసుకుంటుందంటూ లెక్కలు వేసుకుంటున్నారు. అధికారిక హోదా రీత్యా కేబినెట్ ర్యాంకులో ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి, పీసీసీ అధ్యక్షుడు గా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి పోటీలో ముందువరసలో కొనసాగుతున్నారు. మహిళ కోటా, ఎస్సీ కోటా రెంటినికలిపి భర్తీ చేయాలని భావిస్తే కేబినెట్ ర్యాంకులో కొనసాగుతున్న పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్ గీతారెడ్డి కూడా బరిలో ఉన్నట్లే భావించాలి. సీనియర్ నాయకులకు కాంగ్రెసులో కొదవ లేదు. వీరంతా పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టకుండా గ్రూపులు కట్టేందుకు ప్రయత్నిస్తున్నారనే ఫిర్యాదులు హైకమాండ్ కు చేరిపోతున్నాయి. ఈ పార్టీలో అది కొత్త విషయం కాదు. కానీ కేసీఆర్ వ్యూహనైపుణ్యం ముందు క్యాడర్ కకావికలమైపోతోంది. కలిసికట్టుగా నడిస్తే తప్ప నైతికస్థైర్యం నింపలేరు. కానీ పదవుల సంబరంలో పార్టీ పనిని మరిచిపోతూ తాము మునిగిపోతూ పార్టీనీ ముంచేస్తున్నారు పెద్ద నాయకులు. కొత్త నాయకులు.

నిధుల్లేక నీరసం...

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ తీవ్రమైన నిధుల కొరతను ఎదుర్కొంటోంది. రెడ్డి, దళిత సామాజిక వర్గాల నుంచి పార్టీకి బలమైన మద్దతు లభిస్తోంది. కానీ ఈరెండు వర్గాలే అధికారం తెచ్చిపెట్టే పరిస్థితి లేదు. మిగిలిన వారినీ కలుపుకుని పోవాలి. ఈ విషయంలో టీఆర్ఎస్ కంటే పార్టీ బాగా వెనకబడి ఉంది. కులాలవారీ పథకాలతో కేసీఆర్ చాలా వ్యూహాత్మకంగా కదులుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలతో పార్టీకి పక్కా ఓటు బ్యాంకును నిర్మించుకుంటున్నారాయన. అదే సమయంలో తమకు పట్టున్న సామాజిక వర్గాలను సైతం కాంగ్రెసు వదిలేసుకోవాల్సి వస్తోంది. ముస్లిం లమద్దతు 2014 ఎన్నికలవరకూ కాంగ్రెసుకే లభించేది. ఇప్పుడు ఆ గ్యారంటీ కనిపించడం లేదు. ఎస్సీ, ఎస్టీలు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఖర్చు మొత్తం పార్టీ భరించాల్సి ఉంటుంది. అక్కడి ప్రచార కార్యక్రమాలకు సైతం పీసీసీ, ఏఐసీసీ నిధులు సమకూర్చాలి. నియోజకవర్గానికి అయిదు కోట్ల రూపాయల చొప్పున అనధికారికంగా ప్రచార ఖర్చును పంపిణీ చేసేందుకు టీఆర్ఎస్ అధిష్ఠానం నిర్ణయించిందని సమాచారం. కాంగ్రెసు పార్టీ రోజువారీ కార్యక్రమాల నిర్వహణకే నిధుల ఇక్కట్లు ఎదుర్కొంటోంది. ఇక రిజర్వుడ్ నియోజకవర్గాల ఖర్చు ఎవరు భరిస్తారనేది ప్రశ్న. ఎన్నికల వరకూ ప్రచార ఖర్చులు, గాంధీభవన్ వ్యయం మొత్తం పదవుల్లో ఉన్నవారే చూసుకోవాలని ఏఐసీసీ ఇప్పటికే చెప్పేసింది. జానారెడ్డి వంటి నేతలు ఈ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతరుల నుంచి నిధులు సమీకరించగల నేర్పరి కాదు. సొంత జేబునుంచే పెట్టాల్సి వస్తోంది. దీంతో కాంగ్రెసులో పొదుపు మంత్రం వినిపిస్తోంది. దీంతో అధికార టీఆర్ఎస్ హంగామాతో పోలిస్తే కాంగ్రెసు ప్రచారం పేలవంగా తేలిపోతోంది.

టీఆర్ఎస్ చెక్...

గెలుపు ధీమాతో ఉన్న కేసీఆర్ మరొక వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నారు. బలమైన వాయిస్ వినిపించే సీనియర్ నాయకులు ఈసారి అసెంబ్లీకి ఎన్నిక కాకుండా నిరోధించాలని భారీ పథకం రచిస్తున్నారు. జానారెడ్డి, ఉత్తమ్, మల్లు భట్టివిక్రమార్క, రేవంత్, డీకే అరుణ వంటి నాయకులే లక్ష్యంగా పక్కా స్కెచ్ గీస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో బలమైన నాయకులను పోటీకి దింపడమే కాకుండా సీనియర్ నేతలను నియోజకవర్గ ప్రచార ఇన్ ఛార్జులుగా నియమించాలని యోచిస్తున్నారు. సామాజిక వర్గాల వారీ సమీకరణ, నిధుల వ్యయం వంటి అంశాలను హైదరాబాదు నుంచే పర్యవేక్షించేలా కమిటీలను కూడా నియమించబోతున్నారు. అందులోనూ ఆరునెలల ముందునుంచే ఈ కమిటీలు పనిచేయడం ప్రారంభిస్తాయనేది టీఆర్ఎస్ వర్గాల సమాచారం. సీఎం సీటు కోసం తంటాలు పడుతున్న ఈ నాయకుల ఎమ్మెల్యే సీట్లకే ఎసరు పెట్టేలా కేసీఆర్ పావులు కదుపుతున్నారు. దీనిని గమనించకుండా తమలో తాము కలహించుకుంటూ సొంత చాపల కిందకే నీళ్లు తెచ్చుకుంటున్నారు కాంగ్రెసు నేతలు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News