కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోవచ్చు. జనతాదళ్(ఎస్)కు గతంలో కన్నా ఒకటి... రెండు స్థానాలు తగ్గి ఉండవచ్చు. బీజేపీ ఆధిక్యం సాధించి ఉండవచ్చు. కానీ లోతుగా విశ్లేషిస్తే బీజేపీని వ్యతిరేకించే కాంగ్రెస్, ఇతర విపక్షాలకు ఓ స్పష్టమైన సందేశాన్ని ఇచ్చాయి. అదే విపక్షాల ఐక్యత. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ ను కలుపుకుని పోవాల్సిన ఆవశ్యకతను చాలా స్పష్టంగా తెలియజెప్పాయి. కాంగ్రెస్ ను పక్కనపెట్టి కేవలం ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటైన కూటమి బీజేపీని నియంత్రించలేదన్న చేదు నిజాన్ని స్పష్టం చేశాయి. వరుస పరాజయాలతో కుదేలైన కాంగ్రెస్ కు ఇది ఒకింత ఊరట కలిగించే పరిణామం. భారతదేశ భవిష్యత్ రాజకీయాలకు దిక్సూచి వంటిది అనడంలో ఎలాంటి సందేహం లేదు
ప్రాంతీయ పార్టీల లక్ష్యం....
గత కొంతకాలంగా బీజేపీని ఎదుర్కొనే లక్ష్యంతో దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్ లేని కూటమిగా దీనిని తీర్చదిద్దాలన్నది వాటి ఆలోచన. అభిప్రాయం. వాదన. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మొదట ఆ దిశగా అడుగులు వేశారు. హస్తం పార్టీని పక్కన పెట్టాలన్నది ఆయన ప్రగాఢ అభిప్రాయం. అయితే ఇది ఎంతవరకు సాధ్యమన్నది ప్రశ్న. ఈ దిశగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ నాయకులను కలిశారాయన. ముందుగా కోల్ కత్తా వెళ్లి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కలిశారు. చెన్నై వెళ్లి డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్ ను కలిసి చర్చలు జరిపారు. కర్ణాటక ఎన్నికలకు ముందు బెంగళూరు వెళ్లి జనతాదళ్(ఎస్) అధినేత హెచ్.డీ.దేవెగౌడ, కుమారస్వామిలను కలిసి వచ్చారు. అంతేకాక జనతాదళ్(ఎస్)ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రయత్నంలో భాగంగా ఒడిషా వెళ్లి బిజూ జనతాదళ్ అధినేత, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కలువనున్నారు. మమతా బెనర్జీ కూడా కేసీఆర్ మాదిరిగానే కాంగ్రెస్ ను పక్కనపెట్టి కూటమిని ఏర్పాటు చేయాలని, లేదా కూటమిలో కాంగ్రెస్ ను ఒక భాగస్వామిగా మాత్రమే ఉండాలని వాదించారు. అంతేగానీ దానికి నాయకత్వం అప్పగించే సమస్యే లేదని స్పష్టం చేశారు.
కర్ణాటక ఫలితాల తర్వాత......
కానీ ఆచరణలో అది అసాధ్యమని కర్ణాటక ఎన్నికలు స్పష్టం చేస్తున్నాయి. కాంగ్రెస్, జేడీఎస్ ముందే పొత్తు పెట్టుకుని ఉండాల్సందని, అలా చేసినట్లయితే ఫలితాలుమరోరకంగా ఉండేవని మమతా బెనర్జీ వ్యాఖ్యానించడం గమనార్హం. అంటే కాంగ్రెస్ లేకుండా బీజేపీని కేవలం విపక్షాలు అడ్డుకోలేవన్న వాస్తవాన్ని అంగీకరించడమే అవుతుంది. కాంగ్రెస్, ఆయా రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఏకమైనప్పుడే బీజేపీని అడ్డుకోగలవు. ఉదాహరణకు ఇటీవల జరిగిన యూపీలోని గోరఖ్ పూర్, పూల్ పూర్ లోక్ సభ ఉప ఎన్నికల్లో విపక్షాల ఐక్యత వల్లే బీజేపీని అడ్డుకోగలిగాయి. రాష్ట్ర రాజకీయాల్లో ఎడమోహం, పెడమోహంగా ఉండే బీఎప్పీ, ఎస్.పీలు కలిసి పోటీ చేయడం వల్లే ఐదుసార్ల నుంచి గోరఖ్ పూర్ లో గెలుస్తూవస్తున్న బీజేపీని ఓడించగలిగాయి. పూల్ పూర్ లో కూడా సాధ్యపడింది. ఇటీవల జరిగిన త్రిపుర అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సీపీఎం, కాంగ్రెస్ కలిసి పోటీ చేసి ఉన్నట్లయితే ఫలితం మరోరకంగా ఉండేది. అదేవిధంగా యూపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీఎస్పీ, ఎస్.పీ కూటమిగా వెళ్లి ఉంటే బీజేపీని అడ్డుకుని ఉండేవి. ఇక్కడ ఎస్.పి, కాంగ్రెస్ మాత్రమే పొత్తుపెట్టుకున్నాయి.
బీహార్ ప్రయోగం.....
ఇలాంటి ప్రయోగం బిహార్ లో విజయవంతమైన విషయాన్ని ఇక్కడ గుర్తించాలి. 2015లో జరిగిన ఆ రాష్ట్ర ఎన్నికల్లో నితీశ్ కుమార్ సారధ్యంలోని జనతాదళ్(ఎన్), లాలూప్రసాద్ యాదవ్ సారధ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ), కాంగ్రెస్ కూటమిగా పోటీ చేసి సత్ఫలితాలు సాధించాయి. బీజేపీని విజయవంతంగా నిరోధించగలిగాయి. ఆర్జేడీ, జేడీ(ఎస్), కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేసి ఉంటే బీజేపీ లబ్ధి పొంది ఉండేది. ఇది ఒక రాష్ట్రమో, ఇంకో రాష్ట్రమో పరిస్థితి కాదు. కాంగ్రెస్ తో సహా విపక్షాలు ఏకం కాకపోతే బీజేపీని నిలువరించలేవన్నది అందరూ అంగీకరించాల్సిన విషయం. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట సహజంగానే అవి కాంగ్రెస్ ను వ్యతిరేకిస్తాయి. ప్రాంతీయ పార్టీలు బలంగా లేని రాష్ట్రాల్లో అవి కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమవుతాయి. బెంగాల్లో మమత, తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు, ఒడిశాలో నవీన్ పట్నాయక్ కాంగ్రెస్ కంటే బలంగా ఉండబట్టే దానితో పొత్తును వ్యతిరేకిస్తున్నాయి. అదే సమయంలో వాటికి కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థి కావడంతో వ్యతిరేకిస్తున్నారు. కర్ణాటకలో కూడా జేడీఎస్ జూనియర్ భాగస్వామి కాబట్టే కాంగ్రెస్ తో ఎన్నికల అనంతరం పొత్తుకు సిద్ధమైంది. అదే సమయంలో ఎన్నికలకు ముందు పొత్తుకు అవి విముఖంగా ఉండటం గమనార్హం.
కాంగ్రెస్ ను విస్మరిస్తే.....
ఒకప్పుడు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా బీజేపీ, వామపక్షాలు కలిసి పనిచేశాయి. పెద్దశత్రువును ఎదుర్కొనేందుకు పరస్పర వైరుధ్యం గల ఈ రెండు పార్టీలు అడుగులు వేశాయి. ఇప్పడు కూడా అదే పరిస్థితి. కానీ పార్టీ మారింది. కాంగ్రెస్ స్థానంలో బీజేపీ ఉంది. బీజేపీ వంటి బలమైన పార్టీని నియంత్రించాలంటే సిద్ధాంతాలు, స్థానిక పరిస్థితులు, వ్యక్తిగత అభిప్రాయాలను పక్కనపెట్టి కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీలు కలిసి ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. అంతేకాదు, కర్ణాటక ఫలితాలు అనుభవపూర్వకంగా తెలియజెబుతున్నాయి. ఒంటరిగా వెళితే శత్రువును ఢీకొనడం కష్టం. కాంగ్రెస్ ఓడిపోయినప్పటికీ దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రంలో దాని మూలాలు ఉన్నాయి. కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. దానిని విస్మరిస్తే బీజేపీని గద్దె దించాలన్న స్వప్నం సాకారం కావడం సాధ్యమయ్యే పనికాదు.