హార్ట్ టచింగ్ లీడర్.....!!

Update: 2018-10-28 16:30 GMT

మారిన పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి ముళ్ల కిరీటం వంటిది. ఖచ్చితంగా కత్తిమీద సాములాంటిదే. అయిదేళ్ల పాటు అధికారంలో కొనసాగడం ఆషామాషీ కాదు. అంత తేలికైన విషయం కానే కాదు. ప్రాంతీయ పార్టీ నాయకులకో, జాతీయ పార్టీలో బలమైన నాయకులకో మాత్రమే సాధ్యమైన విషయం. కానీ ఇలాంటి పరిస్థితులను అధిగమించి బీజేపీ నాయకుడు రమణ్ సింగ్ చరిత్ర సృష్టించారు. ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రిగా వరుసగా మూడు దఫాలుగా పదిహేనేళ్ల పాటు పనిచేసి అరుదైన నేతగా పేరు గడించారు. జ్యోతిబసు (పశ్చిమ బెంగాల్), పవన్ కుమార్ చామ్లింగ్ (సిక్కిం) తర్వాత సుదీర్ఘకాలం సీఎం గా పనిచేసిన నాయకుడిగా గుర్తింపు పొందారు.

ఆయుర్వేద వైద్యుడిగా......

ఆయుర్వేద వైద్యుడైన డాక్టర్ రమణ్ సింగ్ పార్టీ పరంగా చూస్తే బీజేపీలో ఎక్కువ కాలం సీఎంగా పనిచేసిన నాయకుడు కావడం విశేషం. తర్వాత స్థానాల్లో శివరాజ్ సింగ్ చౌహాన్ (మధ్యప్రదేశ్, 13 ఏళ్లు), నరేంద్ర మోదీ (గుజరాత్ 11 ఏళ్లు), ఉన్నారు. బీజేపీ ఆవిర్భవించింది 1980 ఏప్రిల్ 20వ తేదీన. అంటే దాని వయస్సు 38 సంవత్సరాలు. ఇందులో దాదాపు సగం కాలం పాటు ముఖ్యమంత్రిగా రమణ్ సింగ్ పనిచేయడం చిన్న వి‍షయమేమీ కాదు.

హడావిడి, ఆర్భాటం లేకుండానే....

పెద్దగా హడావిడి, ఆర్భాటం లేకుండా, నిదానంగా, శాంత స్వభావుడిగా కనిపించే రమణ్ సింగ్ ముందస్తు వ్యూహంతో, ప్రణాళికాబద్దంగా వ్యవహరిస్తారు. పార్టీలో సామాన్య కార్యకర్తగా చేరి అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. ఇప్పటికీ ఆ స్థాయిని కాపాడుకుంటున్నారు. మధ్యప్రదేశ్ ను విభజించి 2000లో ఏర్పాటు చేసిన ఛత్తీస్ ఘడ్ కు ఆయన మారుపేరుగా నిలిచారు. రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నాయకుడు అజిత్ జోగీ పనిచేసినప్పటికీ 2003 అసెంబ్లీ 'ఎన్నికల్లో విజేతగా నిలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలను చేపట్టడం ద్వారా ఆయన ఛత్తీస్ ఘడ్ కు పర్యాయపదంగా నిలిచారు. పదిహేనేళ్ల పాటు ఛత్తీస్ ఘడ్ అంటే రమణ్ సింగ్... రమణ్ సింగ్ అంటే ఛత్తీస్ ఘడ్ అనే పరిస్థిితి ఏర్పడింది. రేపటి ఎన్నికల్లో గెలిస్తే మళ్లీ రమణ్ సింగ్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. ప్రస్తు పరిస్థితులను పరిశీలిస్తే మరోసారి ఆయన విజేతగా నిలవడం అంత కష్టం కాదన్న వాదన వినిపిస్తోంది. కాంగ్రెస్, అజిత్ జోగి రూపంలో విపక్షాలు చీలిపోవడం ఆయనకు వరంగా మారింది. ఏదైనా చివరి నిమిషంలో అద్భుతాలు జరిగితే తప్ప రమణ్ సింగ్ గెలుపును ఎవరూ అడ్డుకునే పరిస్థితి లేదు. రాష్ట్రంలో విజయం బీజేపీ విజయం కన్నా రమణ్ సింగ్ విజయంగా పేర్కొనడం అతిశయోక్తి కాదు. బీజేపీ అధినాయకులు కూడా అంతర్గత సంభాషణల్లో ఈ విషయాన్ని అంగీకరిస్తారు.

ఎదురు లేకుండా.....

ఉమ్మడి మధ్యప్రదేశ్ లో 1982 అక్టోబరు 15న జన్మించిన రమణ్ సింగ్ రాజ్ పుత్. ఆర్ఎస్ఎస్, బీజేపీలో సుదీర్ఘకాలం వివిధ హోదాల్లో పనిచేసిన అనంతరం 1990లో ఉమ్మడి మధ్యప్రదేశ్ అసెంబ్లీకి తొలిసారిగా ఎన్నికయ్యారు. 1993లో మళ్లీ చట్ట సభకు ఎన్నికయ్యారు. 1999 లో 13వ లోక్ సభకు జరిగిన ఎన్నికల్లో రాజానందగావ్ నియోజకవర్గం నుంచి ఎన్నికై పార్లమెంటులో ప్రకాశించారు. వాజ్ పేయి మంత్రివర్గంలో 2003 వరకూ వాణిజ్యం, పరిశ్రమల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 2003లో రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. నాటి ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించి ముఖ్యమంత్రి అయ్యారు. అప్పటి నుంచి ఆయనకు ఎదురులేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి పదవికి పార్టీలో దిలీప్ సింగ్ జుడే పోటీ పడినప్పటికీ అవినీతి ఆరోపణల కారణంగా పార్టీ ఆయనను పక్కన పెట్టి రమణ్ సింగ్ వైపు మొగ్గింది. ఇక అప్పటి నుంచి ఆయనకు అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో ఎదురులేకుండా పోయింది.

ఆయనే పెద్దదిక్కుగా......

ఇక ప్రస్తుత ఎన్నికల పరంగా చూస్తే పార్టీకి ఆయనే పెద్దదిక్కు. మోదీ, అమిత్ షా వంటి అగ్రనేతలు ఉన్నప్పటికీ రమణ్ సింగ్ దే హవా. పదిహేనేళ్ల పాలన సాఫీగా, ప్రశాంతంగా జరిగింది. అదే సమయంలో వెనుకబడిన రాష్ట్రాన్ని అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా మార్చారు. నిజాయితీ పరుడన్న పేరుంది. చెప్పుకోదగ్గ అవినీతి ఆరోపణలు లేవు. రాష్ట్రం మావోయిస్టుల కేంద్రంగా ఉన్నప్పటికీ అభివృద్ధి పరంగా దూసుకుపోతోంది. కొత్త రాజధాని "నయా రాయ్ పూర్" నిర్మాణం అదిపెద్ద విజయం. ఎలాంటి హడావిడి, ఆర్భాటం లేకుండా తక్కువ వ్యయంతో రాజధానిని నిర్మించడం తేలికైన విషయం కాదు. " అమరావతి" నిర్మాణానికి ఏపీ సీఎం చేస్తున్న హడావిడి, ఆర్భాటం చూశాక రమణ్ సింగ్ ను అభినందించకుండా ఉండలేం. మహిళలు, యువతకు స్మార్ట్ ఫోన్లు ఇచ్చేందుకు ఉద్దేశించిన ఛత్తీస్ ఘడ్ సంచార్ క్రాంతి యోజన, ఉపాధి హామీ కూలీల కోసం ఉద్దేశించిన ముఖ్యమంత్రి అల్పాహార వితరణ పథకాలు తనను ఎన్నికల్లో ఆదుకుంటాయని ఆయన విశ్వసిస్తున్నారు. రమణ్ సింగ్ పనితీరుకు ప్రజా పంపిణీ వ్యవస్థే నిదర్శనం. 80 శాతం మంది ప్రజలకు కిలో రెండు రూపాయల వంతున ప్రతి కుటుంబానికి 35కిలోల వంతున సరఫరా చేస్తున్నారు. అంతేకాకుండా రెండు కిలోల ఉప్పు, మూడు లీటర్ల కిరోసిన్, 1.3 కిలోల చక్కెర పంపిణీ చేస్తున్నారు. ఈ పథకం ప్రజలను బాగా ఆకట్టుకుంది. గత ఎన్నికల్లో ఉచితంగా చౌక బియ్యాన్ని కాంగ్రెస్ ఇస్తామన్నప్పటికీ ప్రజలు విశ్వసించలేదు. రమణ్ సింగ్ పై ప్రజల విశ్వసనీయతకు ఇది నిదర్శనం. గత ఐదేళ్లలో రూ.30 వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టింది. తునికాకు రైతులకు నగదు ప్రోత్సాహకంగా రూ.700 కోట్లు అందజేశారు. పల్లెల విద్యుదీకరణ, 12 లక్షలకు పైగా ఇళ్ల రిజిస్ట్రేషన్ల పట్టాల పంపిణీ, 5.40 లక్షల ఇళ్ల నిర్మాణం, విద్య, వైద్య, రహదారి రంగాల్లో రమణ్ సింగ్ ప్రభుత్వం ఎన్నో విజయాలను నమోదు చేసింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా ఆయన ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ప్రజలు ఆయనను ప్రేమగా "చావల్ బాబా" పిలుచుకుంటారు. పాలనా దక్షతతో పాటు విపక్షాల అనైక్యత కూడా రమణ్ సింగ్ కు కలసి వస్తుంది. గత మూడు ఎన్నికల్లోనూ కాంగ్రెస్ గట్టి పోటీ ఇచ్చింది. రెండు పార్టీల మధ్య వ్యత్యాసం తక్కువే. ఈసారి పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి మరి.

 

 

-ఎడిటోరియల్ డెస్క్

Similar News