జార్జి రెడ్డికి అన్యాయం జరిగిందా?

సాధారణంగా ఒక వ్యక్తి జీవితంపై సినిమా తీస్తున్నారంటే నేటి తరానికి ప్రేరణ ఇవ్వడమనేది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. లేదంటే ఒక రాజకీయపార్టీకి ప్రజల్లో ప్రాచుర్యం, ప్రాముఖ్యం పెంచడానికైనా [more]

Update: 2019-11-19 15:30 GMT

సాధారణంగా ఒక వ్యక్తి జీవితంపై సినిమా తీస్తున్నారంటే నేటి తరానికి ప్రేరణ ఇవ్వడమనేది ప్రధాన లక్ష్యంగా ఉంటుంది. లేదంటే ఒక రాజకీయపార్టీకి ప్రజల్లో ప్రాచుర్యం, ప్రాముఖ్యం పెంచడానికైనా ఉపకరిస్తుంది. అయితే కులాలు, ప్రాంతాల మధ్య సంఘర్షణకు, వర్గ విభేదాలను రెచ్చగొట్టడానికి సైతం బయోపిక్ లను తీసే సంస్క్రుతి పెరుగుతూ వస్తోంది. సంచలనం చేయడం ద్వారా సొమ్ము చేసుకోవాలనుకునే తాపత్రయం చిత్రరంగంలో పెరగడమే ఇందుకు కారణం. రాంగోపాల్ వర్మ వంటి దర్శకులు దీనికి ప్రోత్సాహకులుగా ఉంటున్నారు. తమ పేరునే పెట్టుబడిగా పెట్టి ఇటువంటి సినిమాలు కోకొల్లలుగా తీసి వదిలేస్తున్నారు. అటువంటి ధోరణి కొనసాగుతున్న స్థితిలో విద్యార్థి నాయకుని జీవితం సినిమాగా రావడం , విడుదలకు ముందే వివాదాస్పదం కావడం చర్చనీయమనే చెప్పాలి. వివాదంలోనూ వాణిజ్యం తొంగి చూస్తే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. జార్జి రెడ్డి సినిమా అటువంటి సంచలనాన్నే సృష్టిస్తోంది. ఒక సైద్దాంతిక భావజాలం అతనిని నెత్తిమీద పెట్టుకుంటే వేరొక సైద్దాంతిక భావజాలం అతనిని విలన్ గా చిత్రీకరిస్తుంది. అదే సంఘర్షణ.

రీల్ పిక్చర్ vs రియాలిటీ…

ఒక వ్యక్తి జీవితం చలన చిత్రమైతే కచ్చితంగా అది చరిత్రే.. 1960లలో విద్యార్థి లోకంలో విప్లవ కెరటాలు ఉప్పొంగించిన స్టూడెంట్ లీడర్ జార్జిరెడ్డి. ఉస్మానియా విశ్వవిద్యాలయం వేదికగా రివల్యూషన్ ను రెపరెపలాడించాడు. అతని నడక, నడత, విద్యార్థుల్లో అతను రగిలించిన పోరాట స్ఫూర్తి సినిమాగా మారింది. అందులో రియాలిటీ ఎంత అన్నది పక్కనపెడితే సినిమా విడుదలకు ముందే సంచలనాత్మకం, వివాదాస్పదం అవుతోంది. సైద్దాంతిక భావ సంఘర్షణే ఇందుకు ప్రధాన కారణం. జార్జిరెడ్డి కొందరికి నాయకుడు. మరికొందరికి ప్రతినాయకుడు. సామాజిక వర్గీకరణలో ఇదెప్పుడూ ఉండేదే. జీనా హైతో మర్నా సీఖో..కదం కదం పర్ లడ్ నా సీఖో అంటూ విద్యార్థి లోకాన్ని ఉర్రూతలూగించిన అతని నినాదం మాత్రం నేటికీ మారుమోగుతూనే ఉంది.

స్టడీ అండ్ స్ట్రగుల్ ..

ఎప్పుడో నాలుగున్నర దశాబ్దాల క్రితం చనిపోయిన ఒక విద్యార్థి నాయకుడిని గుర్తుంచుకోవడం అంటే చిన్న విషయం కాదు. 1990 వ దశకంలో వచ్చిన మార్పుల నేపథ్యంలో విద్యార్థులు పూర్తిగా సామాజిక స్పృహను కోల్పోయారనే చెప్పవచ్చు. విశ్వవిద్యాలయాల్లో చేరడం, అధ్యయనం చేయడం , ఉద్యోగం తెచ్చుకోవడం విలాసవంతమైన జీవితానికి బాటలు వేసుకోవడమనేదే వారి జీవన లక్ష్యంగా మారిపోయింది. సమాజంలో ఇతరుల గురించి పట్టించుకోవడమనే మాటే వారికి పట్టడం లేదు. ఇటువంటి స్వార్థ పూరిత ధోరణి కారణంగానే రాజకీయ నాయకత్వాలు వారసత్వాల పరమవుతున్నాయి. కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచి నాయకులు రావడం మానేశారు. తండ్రులు, తాతల నుంచి రాజకీయ వారసులే పదవులను అధిష్టిస్తున్నారు. ఇంతటి అవ్యవస్థ నెలకొంటున్న స్థితిలోనూ మూడు తరాల్లో ప్రతిధ్వనిస్తూనే వచ్చింది జార్జిరెడ్డి స్టడీ అండ్ స్ట్రగుల్ నినాదం. క్లాస్, క్యాస్ట్, జెండర్ వివక్షకు వ్యతిరేకంగా చైతన్యం రగిలించడానికి జార్జి చేసిన ప్రయత్నమే అతను నేటికీ విద్యార్థి మనోఫలకాలపై జీవించి ఉండటానికి కారణంగా నిలిచింది.

సినిమా పాత్రలకు ప్రేరణ…

లెప్ట్ , రైట్ భావజాలాలు విద్యార్థుల్లో బలంగా ప్రభవించిన కాలం లో జాతీయ, అంతర్జాతీయ పరిణామాల దృక్కోణం నుంచి తన సిద్దాంతాన్ని రూపొందించుకున్న వ్యక్తి జార్జిరెడ్డి. కేవలం 25 సంవత్సరాల వయసులోనే హత్యకు గురయ్యాడు. కానీ విశ్వవిద్యాలయంలో చదువుకున్న అయిదారేళ్లలోనే విప్లవ భావాలకు బాటలు వేశారు. మూడు తరాలు దాటినా ఇంకా అతనిని ఒక ఐకానిక్ విద్యార్థి నేతగా చూస్తున్నారంటేనే అతని ప్రాధాన్యం అర్థమవుతుంది. సంఘర్షణ, విప్లవం, సమస్యలపై పోరాటం అనేది తన ఆచరణాత్మక సిద్దాంతంగా అమలు చేయడమే జార్జిరెడ్డి విజయ రహస్యం. అయితే విశ్వవిద్యాలయంలో హింసాత్మక భావనలను ప్రేరేపించారనే విమర్శలు లేకపోలేదు. యువ, శివ, డియర్ కామ్రేడ్ వంటి పాత్రలకు ప్రేరణగా కూడా అతనిని చెబుతుంటారు.

ఉస్మానియా చేగువేరా…

1960 వ దశకాన్ని విప్లవ భావాలతో అంతర్జాతీయంగా ఊపేసిన చేగువేరా, జాతీయంగా నక్సల్బరీ ఉద్యమాల ప్రభావమూ ఆనాటి విద్యార్థుల్లో ఎక్కువేనని చెప్పాలి. ఆ సమయంలో జరుగుతున్న పరిణామాలను అంది పుచ్చుకుని విప్లవభావాలు ఉప్పొంగించిన నేతగా జార్జి రెడ్డిని చెప్పుకోవాలి. నిజానికి అతను నేరుగా కార్యరంగంలోకి దిగి సాధించిన విజయాల కంటే, అతను రగిలించిన చైతన్యమే విద్యార్థి లోకాన్ని సామాజిక స్పృహ వైపు నడిపించింది. అయితే విప్లవ భావజాలాలు ఉన్నంత మాత్రాన చదువును నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం లేదని కూడా తానే నిరూపించాడు. ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్టు కావడానికి తోడు, బాక్సర్ గానూ పేరు తెచ్చుకున్నాడు. అనర్గళ వక్త. అసలు విద్యార్థి జీవితం సమాజానికి ఒక సందేశంలా ఉండాలనేది అతని జీవన సారంగా చూడాలి. అయితే ఈ భావజాలంతో విభేదించేవారూ లేకపోలేదు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా రైటిస్టు ప్రభావం పెరుగుతున్న నేపథ్యం. తెలంగాణ వంటి సమాజంలో ఇంకా అసమానతలు పూర్తిగా సమసి పోలేదు. విశ్వవిద్యాలయాల్లోనూ వివక్ష కు చరమగీతం పాడలేదు. అందుకే మరోసారి లెఫ్టిస్టు భావజాలం ఆవశ్యకతను, అవసరాన్ని జార్జిరెడ్డి చిత్రం గుర్తు చేస్తే చాలు. గిరి గీసుకుని తమ చదువులకే పరిమితమవుతున్న విద్యార్థులు సమాజం వైపు తొంగి చూస్తే చాలు, రేపటి భావి భారత నిర్మాతలు వారే అవుతారు. కొత్త నాయకత్వం పుట్టుకొస్తుంది. అవినీతి, అక్రమాలు, వారసత్వపు కంపు కొడుతున్న రాజకీయాల దిశ కూడా మారేందుకు మార్గం ఏర్పడుతుంది. అసలు మూలాలను వదిలేసి సినిమాను వివాదం చేయడం ద్వారా వ్యాపార ప్రయోజనాలు సాధించాలని చూస్తే మాత్రం జార్జిరెడ్డికి , అతను రగిలించిన భావచైతన్యానికి అన్యాయం చేసినవారే అవుతారు.

 

-ఎడిటోరియల్ డెస్క్

Tags:    

Similar News