టీడీపీని “గాలి” కి వదిలేసినట్లేనా?

గాలి ముద్దుకృష్ణమ‌నాయుడు. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. అయితే, ఇప్పుడు ఆయ‌న భౌతికంగా లేరు కానీ, ఆయ‌న వార‌సులుగా ఆయ‌న కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు గాలి [more]

Update: 2020-04-12 13:30 GMT

గాలి ముద్దుకృష్ణమ‌నాయుడు. టీడీపీ సీనియ‌ర్ నాయ‌కుడు. అయితే, ఇప్పుడు ఆయ‌న భౌతికంగా లేరు కానీ, ఆయ‌న వార‌సులుగా ఆయ‌న కుమారులు ఉన్నారు. వీరిలో పెద్ద కుమారుడు గాలి భాను ప్రకాష్ నాయుడును ముద్దు త‌న రాజ‌కీయ వార‌సుడిగా ప్రక‌టించారు. ఈ క్రమంలోనే ఆయ‌న 2014లో ఓడిపోయినప్పటికీ.. నియోజ‌క‌వ‌ర్గానికి త‌న పెద్దకుమారుడిని ప‌రిచ‌యం చేశారు. ఈయ‌న కూడా ప్రజ‌ల‌కు చేరువ‌య్యారు. వారి స‌మ‌స్యలు తెలుసుకున్నారు. వారితో క‌లిసిపోయారు. అయితే, గాలి ముద్దు కృష్ణమ హ‌ఠాత్తుగా మృతి చెంద‌డం, ఆ వెంట‌నే టీడీపీలో ప‌ద‌వుల వేట‌లో ఈ కుటుంబంలోని ముగ్గురు తెర‌మీదికి రావ‌డం, ఒక‌రితో ఒక‌రు కీచులాడుకోవ‌డం వంటి ప‌రిణామాలు అంద‌రికీ తెలిసిందే.

రోజాకు వ్యతిరేకత ఉన్నా…

ఈ క్రమంలోనే ముద్దు కృష్ణమ స‌తీమ‌ణి స‌రస్వతికి చంద్రబాబు ఎమ్మెల్సీ ఇచ్చారు. చంద్రబాబు ఆమెకు ఎమ్మెల్సీ ఇచ్చేముందు ఎమ్మెల్సీ ఒక కుమారుడికి.. న‌గ‌రి ఎమ్మెల్యే సీటు మ‌రో కుమారుడికి ఇవ్వాల‌నుకున్నా ఇద్దరు వాదోప‌వాదాల‌కు దిగ‌డంతో చంద్రబాబు మ‌ధ్యేమార్గంగా గాలి భార్యకు ఎమ్మెల్సీ ఇచ్చారు. ఇక‌, గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో గాలి పెద్ద కుమారుడు భానుకు న‌గ‌రి టికెట్ ఇచ్చారు. ఇంత వ‌రకు బాగానే ఉన్నా.. కుటుంబంలో నెల‌కొన్ని రాజ‌కీయ ఘ‌ర్షణ‌లు, ప‌దవుల వేట‌లు, ఆధిప‌త్య పోరులు పార్టీని, భాను ప్రకాశ్ రాజ‌కీయాన్ని కూడా నాశ‌నం చేస్తున్నాయ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గంలో వైసీపీ ఎమ్మెల్యే న‌టి రోజాకు సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేక‌త ఉంది.

ఒకే ఇంట్లో రెండు కుంపట్లు….

రోజాను విమ‌ర్శించే వారు.. ఆమె వ్యవ‌హార శైలిని త‌ప్పుబ‌ట్టే వారు కూడా ఎక్కువ‌గానే ఉన్నారు. దీంతో ఇలాంటి వారంతా కూడా గ‌త ఏడాది ఎన్నిక‌ల్లో ఆమెను ఓడించాల‌ని ప్రయ‌త్నించారు. ఈ అవ‌కాశాన్ని అందిపుచ్చుకునే విష‌యంలో మాత్రం టీడీపీ నాయ‌కుడు, టికెట్ పొందిన గాలి త‌న‌యుడు భాను విఫ‌ల‌మ‌య్యారు. రోజా ఓడిపోతుంద‌నుకున్నా కేవ‌లం 2500 ఓట్ల స్వల్ప తేడాతో ఆమె బ‌య‌ట‌ప‌డ్డారు. నిజానికి రాజ‌కీయం అంటే.. ప్రత్యర్థి వీక్‌నెస్‌ను త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవ‌డం అనే చిన్న సూత్రాన్ని భాను విస్మరించా రు. అయితే, ఈయ‌న‌కు ఇంట్లోని ప‌రిస్థితులు స‌హ‌క‌రించ‌క‌పోవ‌డం కూడా గ‌మ‌నార్హం. త‌న సోద‌రుడు మామ‌గారు వైసీపీకి మ‌ద్దతుదారుగా ఉండ‌డం, ఇంట్లోనే రెండు కుంప‌ట్లు ఉండ‌డంతో భానుకు ప‌రిస్థితులు క‌లిసి రాలేద‌ని చెప్పాలి.

అందువల్లనే…?

ఇక‌, ఇప్పుడు ప‌రిస్థితిని చూస్తే ఎమ్మెల్యే రోజా దూకుడు ప్రద‌ర్శిస్తున్నారు. ఆమెకు ధీటుగా ఇక్కడ టీడీపీని ముందుకు న‌డిపించ‌లేక పోతున్నారనే వాద‌న కూడా వినిపిస్తోంది. నిజానికి వైసీపీలో నెల‌కొన్న విభేదాల‌ను అదే గాలి ముద్దుకృష్ణమ ఉంటే.. త‌మ‌కు అనుకూలంగా మార్చుకునేవార‌ని, జంపింగుల‌ను కూడా ప్రోత్సహించేవార‌ని, కానీ, ఇప్పుడు భాను ఆ చొర‌వ తీసుకోవ‌డం లేద‌ని అంటున్నారు. మొత్తంగా చూస్తే.. అవ‌కాశం ఉన్నా కూడా న‌గ‌రిలో టీడీపీ పుంజుకోవ‌డం లేద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది.

Tags:    

Similar News