ముషారఫ్ ఉరి సాధ్యమేనా?
పదవి నుంచి వైదొలిగిన పాకిస్థాన్ పాలకులకు ఏదో ఒక రూపంలో ఇబ్బందులు అనివార్యం. పదవిలో ఉండగా పాల్పడిన అక్రమాలు, అవినీతి వారిని వెంటాడుతుంటాయి. అధికారంలోకి వచ్చిన రాజకీయ [more]
పదవి నుంచి వైదొలిగిన పాకిస్థాన్ పాలకులకు ఏదో ఒక రూపంలో ఇబ్బందులు అనివార్యం. పదవిలో ఉండగా పాల్పడిన అక్రమాలు, అవినీతి వారిని వెంటాడుతుంటాయి. అధికారంలోకి వచ్చిన రాజకీయ [more]
పదవి నుంచి వైదొలిగిన పాకిస్థాన్ పాలకులకు ఏదో ఒక రూపంలో ఇబ్బందులు అనివార్యం. పదవిలో ఉండగా పాల్పడిన అక్రమాలు, అవినీతి వారిని వెంటాడుతుంటాయి. అధికారంలోకి వచ్చిన రాజకీయ ప్రత్యర్థులు వారికి ఊపిరి ఆడనివ్వరు. వారు కేసులు, శిక్షలు, కొన్ని సందర్భాల్లో మరణ దండన వంటి కఠిన శిక్షలు ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఇది పాకిస్థాన్ చరిత్ర చెబుతున్న చేదునిజం. ఇప్పుడు తాజాగా సైనిక పాలకులకు కూడా కష్టాలు ఎదురవుతున్నాయి. సాధారణంగా సైనిక పాలకులకు ఈ పరిస్థితి ఎదురు కాదు. తాజాగా మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ కు ఇస్లామాబాద్ లోని ప్రత్యేక న్యాయస్థానం మరణ శిక్ష విధించింది. రాజ్యాంగాన్ని రద్దు చేసినందుకు, దానిని దుర్వినియోగం చేసినందుకు ఈ శిక్ష విధించింది. ఈ తీర్పు దేశ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇమ్రాన్ ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెడుతోంది. తీర్పుపై బహిరంగంగా వ్యాఖ్యానించలేక, అలా అని దోషి ముషారఫ్ ను వెనకేసుక రాలేక సతమతమవుతోంది. పౌర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పటికీ దేశ రాజకీయాల్లో సైన్యానిదే కీలక పాత్ర. ఇది బహిరంగ రహస్యం. సైన్యాన్ని కాదని ముందుకెళ్లే సాహసం ఏ ప్రధాని చేయరు. అలా చేసిన ప్రధాని బతికి బట్ట కట్ట లేదు. ఈ పరిస్థితుల్లో సైన్యాన్ని కాదని శిక్ష అమలు చేసేందు సాహసం ఇమ్రాన్ చేస్తారనుకోవడం వట్టిమాటే. అందునా గత ఏడాది సైన్యం దన్నుతో ఎన్నికల్లో గెలిచిన ఇమ్రాన్ ఖాన్ అంత దూరం వెళ్లనే వెళ్లరు. అంతిమంగా ఏదో ఒక రూపంలో ముషారాఫ్ ను కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.
ముషారఫ్ నేరమిదే…..
1999 అక్టోబరులో నాటి ప్రధాని నవాజ్ షరీఫ్ శ్రీలంక పర్యటనకు వెళ్లగా, అప్పటి సైన్యాధిపతి పర్వేజ్ ముషారఫ్ సైనిక కుట్ర ద్వారా తిరుగుబాటు చేశారు. షరీఫ్ ను గద్దె దించి అధికార పగ్గాలు చేపట్టారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని రద్దు చేశారు. న్యాయవ్యవస్థను నిర్వీర్యం చేశారు. మీడియా గొంతునొక్కారు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రజాస్వామ్యాన్ని చెరబట్టారు. నాటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఇఫ్తాకర్ మహ్మద్ చౌదరి సహా పలువురు న్యాయమూర్తులను గృహనిర్భంధంలో ఉంచారు. కొత్త రాజ్యాంగాన్ని ముషారఫ్ తీసుకు వచ్చి దాని ప్రకారం ప్రమాణస్వీకారం చేయమని న్యాయమూర్తులపై ఒత్తిడి తెచ్చారు. పాత రాజ్యాంగం ప్రకారం దానిని రద్దు చేసినా, దుర్వినియోగ పర్చినా ఆరో అధికరణం ప్రకారం అది దేశద్రోహం కిందకు వస్తుంది. ఈ నేరానికి మరణశిక్ష విధిస్తారు. వాస్తవానికి నాడు సైన్యంలో ముగ్గురు సీనియర్లను కాదని జూనియర్ అయిన ముషారఫ్ ను నవాజ్ షరీఫ్ పైకి తీసుకు వచ్చి సైన్యాధిపతిని చేశారు. చివరకు అదే ముషారఫ్ పుట్టిముంచారు.
పగ తీర్చుకునేలా షరీఫ్….
2013లో అధికారంలోకి వచ్చిన నవాజ్ షరీఫ్ పాత జ్ఞాపకాలను మర్చిపోలేదు. ముషారఫ్ పై దేశద్రోహం కింద కేసు నమోదు చేయించారు. 2015 నాటికే కేసు విచారణ పూర్తయినప్పటికీ వివిధ కారణాల వల్ల తీర్పు వాయిదా పడుతూ వస్తుంది. ఈ కేసు విచారణను జాప్యం చేసేందుకు ఇమ్రాన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు విఫలమవ్వడంతో ఎట్టకేలకు ఇటీవల తీర్పు వెలువడింది. మరణదండన విధించింది. ఒక మాజీ దేశాధినేతకు మరణశిక్ష విధించడం దేశచరిత్రలో ఇది రెండోసారి. ఒక సైనిక పాలకుడికి మరణశిక్ష విధించడం ఇది తొలిసారి. 1979లో సైనిక పాలకుడు జనరల్ జియా ఉల్ హక్ మాజీ ప్రధాని జుల్ఫికర్ ఆలీ భుట్టోకు మరణశిక్ష అమలు చేశారు. 1977లో ప్రధానిగా ఉన్న భుట్టో జూనియర్ అధికారి అయిన జనరల్ జియాను సైన్యాధిపతిని చేశారు. ఇదే జయా 1977లో సైనిక కుట్ర ద్వారా భుట్టోను పదవి నుంచి తొలగించారు. ఇది చరిత్ర.
న్యాయమూర్తి వ్యాఖ్యలు……
ముషారఫ్ ను కాపాడేందుకు ఇమ్రాన్ సర్కార్ గట్టిగా కృషి చేస్తుంది. సైన్యం అభిమతాన్ని కాదని శిక్ష అమలు చేసే ధైర్యం ఇమ్రాన్ కు లేదు. అ మాట కొస్తే ఇమ్రాన్ ఖాన్ కే కాదు… ఏ పౌర ప్రభుత్వం సైన్యాన్ని కాదని ముందుకు వెళ్లలేదు. ఆయన సైన్యం మద్దతుతో ఎన్నికల్లో గెలిచిన ఇమ్రాన్ ఆ పని చేయలేరు. ఇక సైన్యం కూడా బహిరంగంగా కోర్టు తీర్పు తప్పుపట్టడం గమనార్హం. ఏ దేశ సైన్యమూ ఇంతటి సాహసం చేయలేదు. ముషారఫ్ తీర్పు అమలుకు ముందే చనిపోతే ఆయన శవాన్ని ఇస్లామాబాద్ లోని డి చౌక్ లో మూడు రోజుల పాటు వేలాడదీయాలన్న న్యాయమూర్తి వ్యాఖ్యల్లో పరిపక్వత లోపించింది. ఓ న్యాయమూర్తి అలా వ్యాఖ్యానించడం తగదు. ఏది ఏమైనప్పటికీ ముషారఫ్ శిక్ష అమలుకు ప్రభుత్వం అంతగా చొరవ చూపే అవకాశం లేదు.
-ఎడిటోరియల్ డెస్క్