ఇంగ్గీష్ కంటే ఇది బెటరేమో?
భిన్నమైన జాతులు, భాషలు ఉన్నప్పటికీ ఏకత్వాన్ని ప్రదర్శించే సంస్క్రుతి భారతదేశ పునాది. జాతి పటిష్ఠత, భవిత ప్రధానంగా విద్య, వైద్యరంగాలపై ఆధారపడి ఉంటుంది. విద్య భవిష్యత్తుకు పునాదులు [more]
భిన్నమైన జాతులు, భాషలు ఉన్నప్పటికీ ఏకత్వాన్ని ప్రదర్శించే సంస్క్రుతి భారతదేశ పునాది. జాతి పటిష్ఠత, భవిత ప్రధానంగా విద్య, వైద్యరంగాలపై ఆధారపడి ఉంటుంది. విద్య భవిష్యత్తుకు పునాదులు [more]
భిన్నమైన జాతులు, భాషలు ఉన్నప్పటికీ ఏకత్వాన్ని ప్రదర్శించే సంస్క్రుతి భారతదేశ పునాది. జాతి పటిష్ఠత, భవిత ప్రధానంగా విద్య, వైద్యరంగాలపై ఆధారపడి ఉంటుంది. విద్య భవిష్యత్తుకు పునాదులు వేస్తుంది. వైద్యం జాతి ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఈ రెండు ప్రతి వ్యక్తికి అందేలా చూడటం ప్రభుత్వ కర్తవ్యం. క్రమేపీ సర్కారులు వీటి నుంచి దూరమవుతూ ఆయా రంగాలను కార్పొరేట్, ప్రయివేటు శక్తుల పరం చేస్తూ వస్తున్నాయి. ప్రజలు ఆయారంగాల ప్రాముఖ్యాన్ని గుర్తించారు. ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం మొదలు పెట్టాయి. దాంతో ఇక్కడ ఉన్న అవసరాన్ని సొమ్ము చేసుకునేందుకు రంగంలోకి దిగిన కార్పొరేట్ శక్తులు విద్య,వైద్యం రూపంలో ప్రజలను దోపిడీ చేయడం మొదలు పెట్టాయి. ఒకే జబ్బుకు వంద రకాల చికిత్సలు, ఒకే విద్యకు వంద రకాల రూపాలు ప్రవేశపెట్టి యథేచ్చగా ఫీజులు వసూలు చేయడం రెండు మూడు దశాబ్దాలుగా ఇష్టారాజ్యంగా కొనసాగుతూ వస్తోంది. దీనిని కట్టడి చేసి, ఆయా రంగాల్లో మౌలిక వసతులను తామే కల్పించాల్సిన ప్రభుత్వాలు మౌన ప్రేక్షక పాత్రకు పరిమితం అయిపోవడమే దురదృష్టకరం. ఉమ్మడి జాబితాలోని ఈరెండు అంశాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలే జాతి జీవనాడులను దెబ్బతీస్తున్నాయని చెప్పకతప్పదు.
విద్యలో అసమానత…
ఆంధ్రప్రదేశ్ లో పెద్ద చర్చ నడుస్తోంది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఒకటో తరగతి నుంచి ఆరోతరగతి వరకూ ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టాలని రాష్ట్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కొన్ని వర్గాల్లో వ్యతిరేకత వస్తోంది. ప్రధానంగా మేధోవర్గాలు, భాషావేత్తలు విముఖత చూపుతున్నారు. బోధన చేయాల్సిన ఉపాధ్యాయవర్గమూ వ్యతిరేకత కనబరుస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో తల్లిదండ్రులు సానుకూలత కనబరుస్తున్నారు. దీనికి ప్రధానకారణం విద్యారంగంలో నెలకొన్న అసమానతలే. ఆర్థిక స్తోమత కలిగినవారు, ఉద్యోగవర్గాల పిల్లలు ఇంగ్లిషు మీడియం పాఠశాలల్లోనే చదువుతున్నారు. మధ్యతరగతి వర్గాల తల్లిదండ్రులు సైతం తమ ఆదాయంలో అత్యధిక భాగం వెచ్చించేందుకు సిద్ధపడి కార్పొరేట్, ప్రయివేటు పాఠశాలల ద్వారా ఇంగ్లిషులో అభ్యాసానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫలితంగా ప్రభుత్వ పాఠశాలలు వెలవెల బోతున్నాయి. అంతెందుకు ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల్లోనే అత్యధికులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చదివించకుండా కార్పొరేట్ పాఠశాలలకు పంపుతున్నారు. విశ్వసనీయత కోల్పోయిన విద్యావ్యవస్థకు ఇంతకు మించిన ఉదాహరణ ఉండదు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత రాకపోవడానికి ఇది కూడా ఒక కారణమే.
అట్టడుగు వర్గాల డిమాండ్…
మూడు దశాబ్దాల క్రితం కేవలం 15 శాతం విద్యార్థులకే పరిమితమైన ఇంగ్లిషు మీడియం విద్య ఇప్పుడు 60 శాతానికి చేరింది. కేవలం అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లలు, రెక్కాడితే కానీ డొక్కాడని పేదల పిల్లలు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుమీడియంలోచదువుతున్న పరిస్థితి నెలకొంది. అందుకే పెద్దలకు అందుబాటులో ఉన్న ఇంగ్లిషు మీడియం తమ పిల్లలకు కూడా అందుతుందంటే పేదలు ఆహ్వానిస్తున్నారు. ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవడంతో తాము పిల్లలను ప్రయివేటు పాఠశాలలకు పంపలేకపోతున్నామనే ఆవేదన వారిని వెంటాడుతోంది. ప్రభుత్వమే ఇంగ్లిషు ప్రవేశపెడితే ఆ సమస్య తీరిపోతుందని వారు సంతోషిస్తున్నారు. ఫలితంగానే ప్రభుత్వ నిర్ణయానికి తల్లిదండ్రుల నుంచి మద్దతు లభిస్తోంది.
నాణ్యతకు తిలోదకాలు…
సహజంగా వికసించాల్సిన బాల్యాన్ని పణంగా పెట్టి విద్య బోధనలో అసమానతలకు అవకాశం కల్పించడమే అసలు సమస్య. మీడియం ఏదైనా నాణ్యత అన్నది ముఖ్యం. నిజానికి కార్పొరేట్ పాఠశాలలు సహా ప్రయివేటు సంస్థల్లో బోధిస్తున్న ఉపాధ్యాయుల కంటే ప్రభుత్వ ఉపాధ్యాయులే ప్రతిభలో మిన్నగా చెప్పాలి. బి.ఎడ్ వంటి విద్యతో పాటు వేలమందితో పోటీ పడి ఉద్యోగం తెచ్చుకోవడం సాధారణ విషయం కాదు. విషయ పరిజ్ణానం, బోధన రీతులు వారికి మెరుగ్గానే తెలుసు. అయినప్పటికీ వసతుల లేమి, ప్రభుత్వ పర్యవేక్షణ కరవు కావడంతో ఉద్యోగ భద్రత కారణంగా ఉదాసీనత నెలకొంటోంది. దాంతో ప్రభుత్వ విద్యా వ్యవస్థలో ప్రమాణాలు తీసికట్టుగా మారుతున్నాయి. ఏ మీడియంలో చదువుతున్నారనే అంశం కంటే అందులో స్టాండర్డ్ ఏ మేరకు ఉంటోందన్నది ముఖ్యం. ఈ విషయంలో ఇప్పటికీ ప్రభుత్వ విద్యలో ప్రమాణాలు పెంచకపోతే ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టినా పూర్తి ఫలితాలు లభిస్తాయని చెప్పలేం. మానసికంగా తల్లిదండ్రులను సంతృప్తి పరచడానికే పరిమితమైపోతుంది.
సార్వత్రిక విద్యావిధానం…
ప్రపంచంలో పదిశాతం దేశాలు మాత్రమే ఇంగ్లీషును తమ బోధన భాషగా బాల్యంలో అమలు చేస్తున్నాయి. ఆ దేశాలన్నిటిలోనూ అది వారికి మాతృభాష. మిగిలిన దేశాలు అనుసంధాన భాషగానే ఇంగ్లిషును బోధిస్తున్నాయి తప్పితే మీడియంగా ప్రవేశ పెట్టలేదు. పేద, ధనిక వర్గాల మధ్య విద్యా బోధనలో వ్యత్యాసం నెలకొన్న కారణంగానే ఇప్పుడు రాష్ట్రంలో చర్చ సాగుతోంది. త్రిభాషా సూత్రాన్ని అంగీకరించిన దేశం మనది. ప్రాథమిక స్థాయి వరకూ మాతృభాషలో బోధనే బాలల సంపూర్ణ వికాసానికి ఉపకరిస్తుందని ఐక్యరాజ్య సమితి సహా మానసిక శాస్త్రవేత్తలు ఘోషిస్తున్నారు. జాతీయ సార్వత్రిక విద్యా విధానం ప్రవేశపెట్టడమే దీనికి పరిష్కారం. కార్పొరేట్, ప్రయివేటు, ప్రభుత్వ పాఠశాలల వ్యత్యాసం లేకుండా అన్నిటా ఒకే విద్యను బోధించేలా చట్టాన్ని తీసుకొస్తే సమస్య పరిష్కారమవుతుంది. ధనిక, పేద, ప్రాంతీయ వ్యత్యాసాలకు తావులేకుండా అందరికీ ఒకటే విద్య ఉండాలి. దక్షిణ కొరియా, జపాన్, చైనా వంటి దేశాలు ఇదే విధానంతోనే విద్యావ్యవస్థలో అసమానతలు లేకుండా చూసుకోగలిగాయి. భారతదేశం అక్కడే వైఫల్యం చెందింది. ఫలితంగానే మాతృభాషలు వివక్షను, చిక్కులను ఎదుర్కొంటున్నాయి.
ఉపాధి మార్గమేనా…?
ఇంగ్లిషు కమ్యూనికేషన్ భాష మాత్రమే. ఇంగ్లిషు ఆధారంగా ఉపాధి లభించదు. మన దేశం నుంచి వెళ్లి ఇతర దేశాల్లో ఉపాధి పొందుతున్నవారు తమ తమ రంగాల్లో నైపుణ్యం ఆధారంగానే ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ నిపుణులు, డాక్టర్లు, సైంటిస్టులు, ఇతర రంగాల్లో విదేశాల్లో ఉపాధి పొందుతున్నవారికి ఇంగ్లిషు జీవన భృతి కాదు. ఇంగ్లిషును అర్థం చేసుకునే స్థాయి , కమ్యునికేట్ చేయగల పరిజ్ణానం ఉండాలి. ఉపాధికి మాత్రం తమ రంగాల్లో నైపుణ్యమే తప్పనిసరి. ప్రపంచంలో వివిధ దేశాల్లో 70 లక్షల మంది వరకూ భారతీయులు ఉపాధి పొందుతున్నట్లు అంచనా. అందులో గల్ఫ్ దేశాలు, ఇతర సంపన్న దేశాల్లో కూలీలుగానే ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు. వారికి ఇంగ్లిషు భాషతో పనిలేదు. అమెరికా వంటి అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లో 25 నుంచి 30 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. వారందరూ వ్రుత్తి నిపుణులే తప్ప భాషా నిపుణులు కాదు. మొత్తంగా చూస్తే దేశ జనాభాలో నూటికి 0.5 శాతం కూడా విదేశాల ద్వారా ఉపాధి పొందడం లేదన్న విషయం గణాంకాలను పరిశీలిస్తే స్పష్టమవుతుంది. ఇతర దేశాల నుంచి వచ్చి తమ ఉపాధిని దెబ్బతీస్తున్నారనే ఆందోళనలు పాశ్చాత్య దేశాల్లో సైతం పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో నాణ్యతతో కూడిన విద్యను పెంచడం, స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడమే ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. ఈ విషయంలో అట్టడుగు వర్గాలు వెనకబాటుకు గురికాకుండా సార్వత్రిక విద్యా విధానం ప్రవేశపెట్టి కోటీశ్వరుడి కుమారుడు, కటిక పేదవాడి బిడ్డడు ఒకే విద్యను అందుకునే అవకాశాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
-ఎడిటోరియల్ డెస్క్