ఆ…మంత్రికి జగన్ మొట్టికాయలు..ఎందుకంటే?

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా డెల్టా ప్రాంత‌మైన ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజయం సాధించిన ప్రముఖ రైస్ మిల్లర్ చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు ( [more]

Update: 2019-12-25 06:30 GMT

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా డెల్టా ప్రాంత‌మైన ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజయం సాధించిన ప్రముఖ రైస్ మిల్లర్ చెరుకువాడ శ్రీరంగ‌నాథ‌రాజు ( జిల్లా రైస్‌మిల్లర్ల అసోసియేష‌న్ అధ్యక్షుడు)కు వైసీపీ ప్రభుత్వంలో సీఎం జ‌గ‌న్ మంత్రి ప‌ద‌విని ఇచ్చారు. వాస్తవంగా ఈ ప‌ద‌వి జ‌గ‌న్‌కు అత్యంత విశ్వాస‌పాత్రుడు అయిన న‌ర‌సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద‌రాజుకు ఇవ్వాల్సి ఉన్నా క్షత్రియ సామాజిక వ‌ర్గంలో జ‌రిగిన లాబీయింగ్ కార‌ణంగా జ‌గ‌న్ రంగ‌నాథ‌రాజుకు మంత్రి ప‌ద‌వి ఇచ్చార‌న్న టాక్ ఉంది. అర్బన్ హౌసింగ్ శాఖ మంత్రిగా ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇచ్చారు. అయితే, కొన్ని నెల‌లుగా ఆయ‌న వివాదాస్పద మ‌వుతున్నార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఆది నుంచి అసంతృప్తి…..

త‌న‌కు సంబంధం లేని విషయాల్లో జోక్యం చేసుకోవ‌డం, ప్రభుత్వ నిర్ణయాల‌కు వ్యతిరేకంగా డ్యామేజీ ఏర్పడేలా వ్యాఖ్యలు చేయ‌డం వంటి కార‌ణాల‌తో జ‌గ‌న్‌కు ఫిర్యాదులు అందుతున్నాయ‌ని తెలుస్తోంది. అత్యంత విశ్వస‌నీయ స‌మాచారం ప్రకారం.. ఆది నుంచి కూడా చెరుకువాడ తీవ్ర అసంతృప్తితో ఉన్నా రు. త‌న‌కు ఇష్టమైన, త‌న రంగానికి సంబంధించిన పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ను త‌న‌కు కేటాయించాల‌ని ఆయన కోరుతున్నారు. అయితే, అలా చేస్తే.. ప్రతిప‌క్షాల నుంచి మ‌రిన్ని విమ‌ర్శలు వ‌స్తాయ‌నే కార‌ణంగా జ‌గన్ ఆయన‌కు అర్బన్ హౌసింగ్ కేటాయించార‌ని స‌మాచారం.

వివాదాస్పద వ్యాఖ్యలతో….

ఎందుకంటే రైస్‌మిల్లర్ల నాయ‌కుడిగా ఉన్న ఆయ‌న‌కు పౌర‌స‌ర‌ప‌రాల శాఖ ఇచ్చేందుకు జ‌గ‌న్ ఇష్టప‌డ‌లేదు. ఈ శాఖ‌ను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి ఇచ్చారు. దీంతో ఆయ‌న త‌న అసంతృప్తిని ప‌రోక్షంగా వెల్లడిస్తూనే ఉన్నారు. పౌర‌స‌ర‌ఫ‌రాల విష‌యంలో ఒక సారి జోక్యం చేసుకుని మంత్రి కొడాలి నానితో ప్రతి విమ‌ర్శలు ఎదుర్కొన్నారు. దీనిపై ఒక‌సారి నేరుగా జ‌గ‌న్‌కే ఫిర్యాదులు వెళ్లాయి. ఇక‌, త‌ర్వాత పేద‌ల‌కు ఇళ్ల ప‌థ‌కంపై స్పందిస్తూ.. మ‌రింత‌గా విమ‌ర్శలు చేశారు. ప్రభుత్వం పేద‌ల‌కు వీలును బ‌ట్టి సెంటున్నర నుంచి రెండు సెంట్ల వ‌ర‌కు భూమిని ఇవ్వాల‌ని ప్రయ‌త్నిస్తోంది. అయితే, దీని పై స్పందించిన రంనాథ‌రాజు.. సెంటు భూమి చాలు.. ఎన్ని అంత‌స్థులైనా క‌ట్టుకోవ‌చ్చు. అని ఆయన చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యేల ఫిర్యాదుతో…..

ఇది రాజ‌కీయంగా విమ‌ర్శలు వ‌చ్చేలా చేసింది. దీంతో జ‌గ‌న్ ఫోన్ చేసి మంద‌లించే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని కూడా వైసీపీ వ‌ర్గాలు చ‌ర్చించున్నాయి. ఇక‌, ఇప్పుడు ప‌శ్చిమ గోదావ‌రిలోని త‌న‌కు సంబంధం లేని నియోజ‌క‌వ‌ర్గాల్లో జోక్యం చేసుకుంటున్నార‌ని తోటి ఎమ్మెల్యేలే ఈయ‌న‌పై ఫిర్యాదులు చేస్తున్నార‌ని స‌మాచారం. డెల్టాలో న‌ర‌సాపురం లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఉన్న కొన్ని అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఆయ‌న వేలు పెట్టడంతో కొంద‌రు ఎమ్మెల్యేలు నేరుగా జ‌గ‌న్‌కే ఫిర్యాదు చేసిన‌ట్టు వైసీపీ జిల్లా వ‌ర్గాల్లో ప్రచారం జ‌రుగుతోంది. దీంతో జ‌గ‌న్ ఆయ‌న‌కు ఫోన్ చేసి.. అన్నా.. నీ నియోజ‌క‌వ‌ర్గంలో ప‌నిచేసుకో.. అంటూ సున్నితంగా మంద‌లించార‌ని తెలిసింది. మొత్తానికి ఈ ప‌రిణామంతో శ్రీరంగ‌నాథ‌రాజు మ‌రోసారి మీడియాలోకి ఎక్కడం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News