కాలం చెప్పిన సమాధానం

నాలుగేళ్ళ క్రితం ఇదే సమయానికి విజయవాడలో ధర్నాలు, రాస్తారోకోలు అంటే ఎంజీ రోడ్డు కిక్కిరిసి పోయేది. నగరంలో ఏ నిరసన అన్నా సబ్ కలెక్టర్ కార్యాలయం అందుకు [more]

Update: 2019-11-14 06:30 GMT

నాలుగేళ్ళ క్రితం ఇదే సమయానికి విజయవాడలో ధర్నాలు, రాస్తారోకోలు అంటే ఎంజీ రోడ్డు కిక్కిరిసి పోయేది. నగరంలో ఏ నిరసన అన్నా సబ్ కలెక్టర్ కార్యాలయం అందుకు వేదిక అయ్యేది. చిన్నదో, పెద్దదో ప్రభుత్వానికి నిరసన తెలపడం, ఆ తర్వాత సబ్ కలెక్టర్ కి ఓ వినతి పత్రం ఇవ్వడం బెజవాడ ఆచారంగా చాన్నాళ్ళు నడిచింది. రాజధాని ప్రకటన తర్వాత రైతులు, ఉద్యోగాల కోసం నిరుద్యోగులు అంగన్ వాడీలు, ఆశా వర్కర్లు, కార్మికులు, ప్రతి పక్షాలు ఆందోళనలు నిత్యకృత్యం అయ్యేవి. బందరు రోడ్డులో ప్రయాణం జనాలకు చుక్కలు చూపేది. రాఘవయ్య పార్క్ నుంచి పిడబ్ల్యూడీ గ్రౌండ్ వరకు రోడ్డు బ్లాక్ చేసి ధర్నాలకు అనుమతి ఇచ్చేవారు.

విజయవాడ రావడంతో…..

2015 జూన్ తర్వాత అప్పటి సీఎం చంద్రబాబు విజయవాడ రావాలని నిర్ణయించుకోవడంతో ఆయనకు బస అవసరం అయ్యింది. అప్పటి జల వనరుల శాఖ కార్యాలయాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్ గా మార్చారు. సీఎం విజయవాడ వచ్చాక అనూహ్యంగా ఆందోళనలు కూడా పెరిగాయి. రాజకీయంగా ఆయన మీద ఒత్తిడి పెంచేందుకు రోజూ రాజకీయ పోరాటాలు జరిగేవి. ఈ సమయంలోనే విజయవాడ సీపీ ఏబీ వెంకటేశ్వర రావు నిఘా బాస్ అయ్యారు. ఆయన స్థానంలో గౌతమ్ సవాంగ్ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ అయ్యారు. రోజూ ఏదొక ఆందోళన కార్యక్రమాలు, సీఎం క్యాంపు నివాసం ముట్టడి వంటి కార్యక్రమాలకు పరిష్కారం కనుగొనే క్రమంలో రకరకాల ఆలోచనలు చేశారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాలను పరిశీలించిన తర్వాత రైల్వే స్టేషన్ కి దగ్గర్లో ఉన్న రైవస్ కాల్వ గట్టు సరైన స్థలంగా నిర్ణయించారు.

ధర్నా చౌక్ ఏర్పాటు చేసినా….

దాదాపు 10వేల మంది ఆందోళన చేసేంత విశాల స్థలం అప్పట్లో అందుబాటులో ఉండేది. దీనికి కమ్యూనిస్టు పార్టీలు కూడా అంగీకరించాయి. అప్పటి లా అండ్ ఆర్డర్ డీసీపీ కాళిదాస్ సూచనలతో అప్పటి సత్యనారాయణ పురం సీఐ సత్యనారాయణ ప్రస్తుతం ఉన్న స్థలాన్ని మట్టితో నింపి చదును చేయించారు. ధర్నా చౌక్ ఏర్పడిన తర్వాత ఈ స్థలం మీద అన్ని శాఖలకు కన్ను పడింది. విశాలమైన స్థలం ధర్నాలకు వృధా అవుతోంది అని, సీఎం ఇంటి దగ్గర్లో ఉన్న రైతు బజార్ ని అక్కడకి తరలించాలని అప్పటి కలెక్టర్ అహ్మద్ బాబు సిఫార్సు చేశారు. దీనికి పోలీసులు సైతం అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మరో వైపు పార్టీల నుంచి విమర్శలు వస్తాయని హెచ్చరించడంతో కలెక్టర్ బాబు వెనక్కి తగ్గారు. ఆ తర్వాత కొద్ది రోజులకే 33/11కెవి సబ్ స్టేషన్ కోసం ధర్నా చౌక్ స్థలాన్ని కేటాయించారు. ప్రతిపక్షాల ఆందోళనలు, రాజధాని భూ కేటాయింపుల నిరసనలను తగ్గించే క్రమంలో ఈ పనులు జరిగాయి.

కాల్వగట్టుకే పరిమితం చేసి…..

2015-19 మధ్య కాలంలో ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి సెక్షన్ 30, 144 ఉత్తర్వులను నగర పరిధిలో పొడిగించే వారు. ఇప్పటికీ విజయవాడలో అదే పరిస్థితి కొనసాగుతున్నది. ధర్నా చౌక్ ఏర్పడిన కొద్ది రోజులకే అక్కడ అన్నా కాంటీన్ ఏర్పాటుతో ధర్నాలు చేసే స్థలం తగ్గిపోయింది. మొదట్లో ధర్నా చౌక్ లో ఎవరైనా ఆందోళన చేసుకునేలా సౌకర్యాలు కల్పించాలని, అక్కడ ఉన్న రావి చెట్టు కింద బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేసి శుభ్రమైన వాతావరణం కల్పించాలని భావించినా అది ఆచరణలోకి రాలేదు. మొత్తం మీద ముఖ్యమంత్రిగా ఉన్నపుడు నగరంలో ఆందోళనలు, పాలనా వ్యవస్థ మీద ప్రభావం చూపకుండా ఉండేలా ధర్నాలు చేసే ప్రాంతాన్ని కాల్వ గట్టుకు పరిమితం చేసిన చంద్రబాబు అదే ప్రాంతంలో ధర్నా చేయాల్సి రావడం విచిత్రం. భారీగా జన సమీకరణ చేసి నగరం నడి బొడ్డున ఉన్న స్టేడియంలో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించినా , తన హయాంలో ప్రతిపక్షాలను ధర్నా చౌక్ కి పరిమితం చేసినట్టే ప్రస్తుత ప్రభుత్వం చంద్రబాబుని అక్కడికే పరిమితం చేసింది. కాలం అన్ని ప్రశ్నలకు జవాబు చెబుతుంది అంటే ఇదేనేమో…..!!

Tags:    

Similar News