అంత ధైర్యం చేయడం లేదే?

ఏపీ విప‌క్షం టీడీపీకి కంచుకోట వంటి జిల్లా గుంటూరు. 2014లో మెజారిటీ స్థానాలు టీడీపీ గెలుచుకుంది. అయితే, తాజా ఎన్నికల్లో మాత్రం ఈ పార్టీ రేప‌ల్లె, గుంటూరు [more]

Update: 2019-11-10 12:30 GMT

ఏపీ విప‌క్షం టీడీపీకి కంచుకోట వంటి జిల్లా గుంటూరు. 2014లో మెజారిటీ స్థానాలు టీడీపీ గెలుచుకుంది. అయితే, తాజా ఎన్నికల్లో మాత్రం ఈ పార్టీ రేప‌ల్లె, గుంటూరు వెస్ట్ నియోజ‌క‌వ‌ర్గాల‌కు మాత్రమే ప‌రిమిత‌మైంది. అయితే, గెలుపు ఓట‌ముల‌ను ప‌క్కన పెడితే.. ఓడిన నాయ‌కులు ప‌క్కకు త‌ప్పుకొన్నారు. దీంతో ఇప్పుడు ఇక్కడ నాయ‌క‌త్వ లేమితో పాటు .. కార్యక‌ర్తల్లో ఆత్మ స్థయిర్యం కూడా లోపించింది. ఈ నేప‌థ్యంలో ఇక్కడ పార్టీని న‌డిపించేందుకు పార్టీ త‌ర‌పున కార్యక్రమాల‌ను నిర్వహించేందుకు కూడా నాయ‌కులు అవ‌స‌ర‌మ‌య్యారు. ఈ క్రమంలో పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పటి వ‌ర‌కు దీనిపై దృష్టి పెట్టక పోవ‌డంతో స‌ర్వత్రా చ‌ర్చకు దారితీస్తోంది.

ఖాళీలున్నప్పటికీ….

మొత్తంగా జిల్లాలోని నాలుగు నియోజ‌క‌వ‌ర్గాల ప‌రిస్థితి దారుణంగా ఉంది. బాప‌ట్ల, మాచ‌ర్ల, గుంటూరు తూర్పు, స‌త్తెన‌ప‌ల్లి. ఒక్క స‌త్తెన‌ప‌ల్లిని మిన‌హాయిస్తే.. 2014లోనూ ఈ నియ‌జ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ విజ‌యం సాధించ‌లేక పోయింది. స‌త్తెన‌ప‌ల్లిలో మాత్రం దివంగ‌త కోడెల శివ‌ప్రసాద‌రావు విజ‌యం సాదించారు. తాజాగా ఈ ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఇక్కడ కూడా టీడీపీ ప‌రాజ‌యం పాలైంది. దీంతో ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో యుద్ధ ప్రాతిప‌దిక‌న పార్టీని బ‌లోపేతం చేయాల్సిన అవ‌స‌రం పార్టీ అధినేత‌పై ఎంతైనా ఉందని అంటున్న పార్టీలోని సీనియ‌ర్లు. బాప‌ట్ల విష‌యానికి వ‌స్తే.. ఇక్కడ నుంచి అన్నం సతీష్ ప్రభాక‌ర్ పోటీ చేసి ఓడిపోయారు. అయితే, త‌ర్వాత ఆయ‌న బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఇక్కడ ఖాళీ ఏర్ప‌డింది.

క్యాస్ట్ ఈక్వేషన్ తో…

అయితే, ఇక్కడ వేగేశ్న న‌రేంద్ర వ‌ర్మ పార్టీలో కీల‌క‌నాయ‌కుడిగా ఉన్నప్పటికీ.. చంద్రబాబు ఆయ‌న‌కు ప‌గ్గాలు అప్పగించ‌లేదు. దీంతో ఇక్కడ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవ‌సరం ఉంది. వాస్తవానికి న‌రేంద్రవ‌ర్మ సీటు ఆశించినా.. ఆయ‌న అక్కడ బ‌లంగా ఉన్నా బాబు క్యాస్ట్ ఈక్వేష‌న్లో ఆయ‌న ప‌క్కన పెట్టారు. ఇప్పుడు బాప‌ట్ల టీడీపీ నాయ‌క‌త్వం న‌రేంద్రవ‌ర్మనే కోరుకుంటోంది. అదేవిధంగా కీల‌క‌మైన ప‌ల్నాడులోని మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం లో అన్నపురెడ్డి అంజిరెడ్డి.. ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. త‌ర్వాత ఆయ‌న పార్టీని ప‌ట్టించుకోకుండా హైద‌రాబాద్ వెళ్లి వ్యాపారాల్లో మునిగితేలుతున్నారు. దీంతో ఇక్కడ కొత్తవారికి ప‌గ్గాలు అప్పగించ‌డం ద్వారా ఇప్పటి నుంచే పార్టీని అభివృద్ధి చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. ఇంకా చెప్పాలంటే మాచ‌ర్లలో గత ఐదు ఎన్నిక‌ల్లో ఐదుగురు అభ్యర్థుల‌ను మార్చారు.

కొందరిని మార్చాలంటూ….

అదేవిధంగా గుంటూరు తూర్పులో మ‌హ‌మ్మద్ న‌జీర్ ఓడిపోయారు. దీంతో ఆయ‌న‌ను మార్చాల‌ని డిమాండ్ వినిపిస్తోంది. అదే స‌మ‌యంలో మ‌రో కీల‌క‌మైన స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గంలో నిన్న మొన్నటి వ‌ర‌కు ఉన్న మాజీ స్పీక‌ర్ కోడెల ఆత్మహ‌త్య చేసుకోవ‌డంతో ఇక్కడ కూడా ఇంచార్జ్ పోస్టు ఖాళీ అయింది. అయితే, దీనిని ఎవ‌రికి ఇస్తారు ? అనే విష‌యంలో ఇప్పటికీ స‌స్పె న్స్ కొన‌సాగుతోంది. కోడెల కుమారుడు డాక్టర్ శివరామ‌కృష్ణ పోటీలో ఉన్నా.. ఆయ‌న‌పై ఆరోప‌ణ‌లు ఉండ‌డంతో చంద్రబాబు ఆయ‌న విష‌యాన్ని ప‌క్కన పెట్టారు. దీంతో రాయ‌పాటి సాంబ‌శివ‌రావు కుమారుడు రంగారావుకు ఇక్కడ ప‌గ్గాలు ఇవ్వాల‌నే డిమాండ్ ఎప్పటి నుంచో వినిపిస్తోంది. అయితే, దీనిపైనా చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఈ నాలుగు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

ఎక్కడికక్కడ విభేదాలు….

ఇక ప్రత్తిపాడులో ఓడిన ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవ‌ర‌ప్ర‌సాద్ అక్కడ ప‌నిచేసేందుకు ఉత్సాహం చూప‌డం లేదు. ఆయ‌న మ‌న‌సంతా తాడికొండ పైనే ఉంది. తాడికొండ‌లో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావ‌ణ్‌కుమార్ మాత్రం డొక్కాతో విబేధిస్తున్నారు. తాడికొండ‌లో శ్రవ‌ణ్ వ్యతిరేక వ‌ర్గం డొక్కాను ఆహ్వానిస్తోంది. ఇలా ఎక్కడిక‌క్కడ గ్రూపు రాజ‌కీయాలు కూడా ఎక్కువే ఉన్నాయి. మ‌రి చంద్రబాబు వీటిని ఎలా స‌ర్దుబాటు చేస్తారో ? కొత్త ఇన్‌చార్జ్‌ల‌ను ఎప్పట‌కి నియ‌మిస్తారో ? చూడాలి.

Tags:    

Similar News