చంద్రబాబు రాజీనామా చేస్తున్నారా?

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్య తరచూ ఓ మాట అంటున్నారు. ప్రజలు తాము వైసీపీకి ఓటు వేసి తప్పు చేశామని భావిస్తున్నారని బాబు చెబుతున్నారు. ఇప్పటికి [more]

Update: 2019-10-26 06:30 GMT

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ మధ్య తరచూ ఓ మాట అంటున్నారు. ప్రజలు తాము వైసీపీకి ఓటు వేసి తప్పు చేశామని భావిస్తున్నారని బాబు చెబుతున్నారు. ఇప్పటికి ఇపుడు మళ్ళీ ఎన్నికలు జరిగితే మాత్రం టీడీపీనే గెలిపించారని అనుకుంటున్నారని కూడా చంద్రబాబు అయిదు కోట్ల ఆంధ్రుల మనసులో మాటను తన మాటగా చెప్పేశారు. ఇది మామూలు మాటగానో, మరే విధంగానో చంద్రబాబు అనడం లేదు, వ్యూహాత్మకంగానే అంటున్నారు ఆ విధంగా అనడం ద్వారా చంద్రబాబు రాజకీయంగా భారీ ప్రయోజనం ఆశిస్తున్నారు. ఏపీలో వైసీపీ ఫెయిల్ అయిందని పరోక్షంగా చెప్పడంతో పాటు, ఓ రకమైన హిప్నాటిజంలా జనానికి చంద్రబాబు బెటర్ అన్న మాటకు ఎక్కించేస్తారన్నమాట. ఎపుడు ఎన్నికలు జరిగినా అంటూ తనే ఓటు చేయాలన్నది కూడా ఇలా ప్రచారం చేసుకుంటున్నారు, క్యాడర్ సైతం నిబ్బరం కోల్పోకుండా ఉండేందుకు కూడా చంద్రబాబు ఈ రకమైన మాటల గారడీని వాడుతున్నారు.

పోటీ చేస్తే పోలా…..

దీన్ని ఇప్పుడిపుడే పసిగట్టిన వైసీపీ గట్టిగానే రియాక్ట్ అవౌతోంది. ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి ఇదే విషయం మీద చంద్రబాబుకు సవాల్ చేశారు. అంత సరదాగా ఉంటే ఎన్నికల గోదాలోకి దిగిపోటీ చేయరాదా చంద్రబాబు అంటూ కవ్విస్తున్నారు. ప్రజలు అంటే కేవలం అనుకూల మీడియా, కులజనులు, భజన బృందాలు కానే కాదని, పదమూడు జిల్లాల్లో ఉన్న అయిదు కోట్ల మంది ప్రజలు అన్న సంగతిని చంద్రబాబు తెలుసుకోవాలని కూడా సూచిస్తున్నారు. అయితే ప్రజాభిప్రాయం చంద్రబాబు తెలుసుకోవాలంటే మొత్తం ఏపీ అంతటా ఎన్నికలు ఇపుడు అవసరం లేదని, చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పోటీ చేస్తే చాలు అని కూడా సవాల్ విసురుతున్నారు. కుప్పంలో కనుక చంద్రబాబు మళ్ళీ గెలిస్తే ఏపీ అంతటా టీడీపీ గాలి ఉందని తాము ఒప్పుకుంటామంటూ బంపర్ ఆఫరే ప్రకటించారు.

ఇరకాటంలో బాబు…

నిజానికి చంద్రబాబుకు అధికారంలో ఉన్నపుడే ఒక్క ఉప ఎన్నికనైనా ఎదుర్కొనే ధైర్యం లేకపోయిందని అంటారు. భూమా నాగిరెడ్డి మృతితొ వచ్చిన నంద్యాల ఉప ఎన్నిక సైతం చంద్రబాబుకు ఇష్టంలేదని చెబుతారు. తప్పనిస‌రి పరిస్థితుల్లో ఆ ఎన్నికల్లో పోటీ చేసిన చంద్రబాబు మొత్తం ఏపీలోని తన బలాన్ని అంతా అక్కడే మోహరించి అధికారం అండతో గెలిచారు. వైసీపీ నుంచి ఫిరాయించిన 23 మంది ఎమ్మెల్యేల విషయంలో కనీసం ఉప ఎన్నికలకు వెళ్ళే ధైర్యం చేయలేదని విమర్శలు ఎదుర్కొన్నారు. అటువంటి చంద్రబాబు ఇపుడు కుప్పంలో రాజీనామా చేసి ఉప ఎన్నికలు తెస్తారా. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే అక్కడ గెలవడం అంత ఈజీనా అన్నది కూడా పెద్ద డౌటే. ఎందుకంటే 2019 ఎన్నికల్లో చంద్రబాబు మెజారిటీ సగానికి సగం పడిపోయింది. ఇపుడు చంద్రబాబు పంతానికి పోయి రాజీనామా చేస్తే జగన్ చూస్తూ వూరుకోరు కదా. మొత్తానికి మొత్తం బలాన్ని, బలగాన్ని దింపైనా చంద్రబాబుని ఓడించేందుకు చూస్తారు. ఈ సంగతి తెలిసే విజయసాయిరెడ్డి తెలివిగా చంద్రబాబుకు సవాల్ చేశారు. మరి చంద్రబాబు ఈ సవాల్ స్వీకరిస్తారా. లేక ఎప్పటి మాదిరిగానే పక్కన పెడతారా. అలా కనుక చేస్తే ఇకపై చంద్రబాబు టీడీపీ వైపే జనం అంటూ బడాయి కబుర్లు చెప్పే చాన్స్ అసలు ఉండదు మరి.

Tags:    

Similar News