విజన్ ఉన్నా….దెబ్బతినింది అక్కడే.. సీఎం పదవి చేపట్టి పాతికేళ్లు
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తొలిసారి 1995, సెప్టెంబరు 1న ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత గంభీరమైన రాజకీయ వాతావరణంలో ప్రమాణం చేసి.. నేటికి ఖచ్చితంగా [more]
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తొలిసారి 1995, సెప్టెంబరు 1న ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత గంభీరమైన రాజకీయ వాతావరణంలో ప్రమాణం చేసి.. నేటికి ఖచ్చితంగా [more]
టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు తొలిసారి 1995, సెప్టెంబరు 1న ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అత్యంత గంభీరమైన రాజకీయ వాతావరణంలో ప్రమాణం చేసి.. నేటికి ఖచ్చితంగా 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ పాతికేళ్లలో ఆయన అనేక రూపాలు ధరించారు. అనేక మందితో కలిసి రాజకీయాలు చేశారు. ఎంతో మందిని దూరం చేసుకున్నారు. అయినప్పటికీ.. రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి రాజకీయాల్లో నేతలు అనేకానేక పంథాలను అనుసరిస్తారు. కొందరు ప్రజలకు చేరువ అయ్యేందుకు ప్రయత్నిస్తారు. కొందరు పథకాలతో ప్రజలను ఆకర్షించే పనిచేపడతారు. మరికొందరు.. తమకున్న ఫేస్ వాల్యూని కూడా రాజకీయంగా వాడుకుంటారు.
ప్రచారం కోసమే….
అయితే, వీటిని వాడుకుంటూనే.. తనకంటూ.. మరో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు చంద్రబాబు. అది కొందరికి నచ్చొచ్చు.. మరికొందరికి నచ్చకపోవచ్చు.. కానీ, చంద్రబాబుకున్న బలం బలహీనత కూడా అదే. అదే.. ప్రచారం. అయిన దానికీ, కాని దానికీ కూడా ఆయన ప్రచారానికి పాకులాడతారు. ప్రచారం అనేది మన సంస్కృతి కాదు.. అన్న ఎన్టీఆర్ పార్టీని ప్రచార పార్టీగా మార్చారంటూ.. ఒకప్పుడు ఇదే పార్టీలో ఉన్న జానారెడ్డి పలు సందర్భాల్లో చంద్రబాబును దుయ్యబట్టారు. అంతేకాదు, సొంత పార్టీ నాయకులు కూడా ఇంత ప్రచార పిచ్చి ఏంటి ? అని అన్నా.. బాబు వెరవలేదు.
అదే ఆ స్థాయికి…..
అయితే.. ఈ ప్రచారమే ఆయనకు క్షేత్రస్థాయిలో పెద్ద గుర్తింపు తెచ్చింది.విజన్ ఉన్న నాయకుడిగా ఆయన చేసుకున్న ప్రచారం 2002-03 మధ్య హోరెత్తిపోయింది. ఇప్పటికీ ఆయన సైబరాబాద్ కట్టించిందే తానని చెప్పుకొంటారు. ఇవి రాజకీయంగా తీవ్ర విమర్శలకు తావిచ్చినా.. ప్రజల్లో మాత్రం ఆయనకు గుర్తింపు తెచ్చాయి. సీఎంగా చంద్రబాబును ఎందుకు ఎన్నుకోవాలని అనుకుంటున్నారు ? అని 2014 ఎన్నికలకు ముందు ఏపీలో ఓ జాతీయ మీడియా ప్రశ్నిస్తే.. దానికి ప్రజలు ఇచ్చిన సమాధానం.. ఆయన విజన్ ఉన్న నాయకుడు అనే! ఇంతగా ఆయన ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తారు.
గత ఎన్నికల్లో…
ఇక, ప్రభుత్వం పరంగా సీఎంగా చంద్రబాబు ఏం చేసినా.. ముందు ప్రచారం జరుగుతోందా లేదా ? అని వెయ్యి కళ్లతో పరిశీలించేవారు. ముందుగానే లీకులు ఇచ్చి ప్రచారం చేసుకున్నారనే అపవాదులు వచ్చినా.. ఆయన వెరవలేదు. అయితే, ఇది అతిగా మారడం వల్లో ఏమో.. గత ఏడాది ఎన్నికల్లో ఈ ప్రచారమే కొంపముంచింది. రాజధానిని గ్రాఫిక్కుల్లో తప్ప చూడలేమంటూ.. చంద్రబాబును గ్రాఫిక్ సీఎంను చేసిన అప్పటి ప్రతిపక్షం వైసీపీ లక్ష్యం నెరవేర్చుకుంది. అయినా చంద్రబాబు ఎప్పుడూ.. తన ప్రచార లక్ష్యాన్ని మాత్రం ఒదులుకోలేదు. ఏదేమైనా.. పాతికేళ్ల కిందట ఎంతటి ఉత్సాహంతో ఉన్నారో.. ఇప్పుడు కూడా అంతే ఉత్సాహంతో మనగలగడం, ప్రజల గురించి ఆలోచించే విజన్ ఉన్న నాయకుడిగా చంద్రబాబుకు మనం మార్కులు వేయాల్సిందే.