బాబుకు బిగ్ రిలీఫ్

రాజకీయాల్లో కాదంటే అవుననిలే అన్న పాటను పాడుకోవాలి. విశాఖ తెలుగుదేశం పర్టీలో నేతల తీరు చూస్తే అదే అనిపిస్తోంది. అధినేత చంద్రబాబు ముందు బుద్ధిమంతుల్లా వేదికనెక్కిన తమ్ముళ్ళల్లో [more]

Update: 2019-10-10 13:30 GMT

రాజకీయాల్లో కాదంటే అవుననిలే అన్న పాటను పాడుకోవాలి. విశాఖ తెలుగుదేశం పర్టీలో నేతల తీరు చూస్తే అదే అనిపిస్తోంది. అధినేత చంద్రబాబు ముందు బుద్ధిమంతుల్లా వేదికనెక్కిన తమ్ముళ్ళల్లో సగానికి సగం మంది పార్టీ ఫిరాయిస్తారని ప్రచారంలో ఉన్నవారే. వారంతా ఇపుడు కిక్కురుమనకుండా చంద్రబాబుతో పాటే తామూ అంటూ వేదికనెక్కి పార్టీ పసుపు బాగా రాసుకున్నారు. సైకిల్ కంటే మంచి వాహనం ఆరోగ్యానికి వేరే లేదని కూడా చెబుతున్నారు. ఇంకా చెప్పాలంటే వైసీపీని,జగన్ని మిగిలిన వారి కంటే ఎక్కువగా తిట్టిపోస్తున్నారు. ఇదంతా ఎందుకు అంటే తమని అధినేత చంద్రబాబు బాగా నమ్మాలి. పార్టీలోని మిగిలిన వారు కూడా నమ్మాలి. తామే అచ్చమైన టీడీపీ తమ్ముళ్లమ‌ని చెప్పుకోవడానికి ఈ విధంగా తెగ తాపత్రయపడుతున్నారు.

నాడు ఖండించని గొంతులు….

తెలుగుదేశం పార్టీ నుంచి ఫలనా నాయకుడు వెళ్ళిపోతున్నాడు అని మీడియా అదే పనిగా రాసిన రోజున ఖండించని ఈ గొంతులు ఇపుడు మాత్రం తామెక్కడికీ పోలేదని, మీడియా అలా రాసుకుందని చెప్పుకుంటున్నారు. మరి మొదటిసారి మీడియాలో అలాంటి వార్తలు వచ్చినపుడే ఖండించి ఉంటే బాగుండేది. కానీ రాయబేరాలు కుదరక ఒప్పందాలు పూర్తి కాక మధ్యలో చెడిన కేసులు కొన్ని అయితే, ఇపుడు తొందరేముంది, పార్టీలో చంద్రబాబు ముందుఈ శీల పరీక్ష ఎందుకు అని అధినేత ఎదుట హాజరు వేయించుకున్న తెలివిడి కలిగిన బాపతు మరికొన్ని. ఇక ఈ ఉన్న పార్టీలోనే ఉంటామని బెట్టు చేస్తే మరింత డిమాండ్ వచ్చి బయట పార్టీల మంచి ఆఫర్లు వస్తాయేమోనని ఆరాటంలో మరికొందరు ఉన్నారని అంటున్నారు. మొత్తానికి చంద్రబాబు విశాఖ టూర్ మాత్రం తమ్ముళ్ళు బాగానే సక్సెస్ చేశారనుకోవాలి. అంతా ఒక్కటిగా కనిపించి గ్రూప్ ఫోటో దిగారు. అంతే కాదు, తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబుకి ఝలక్ ఇచ్చినట్లుగా ఇక్కడ నేతలు ఎవరూ ఇవ్వకపోవడం అధినేత చంద్రబాబుకూ బిగ్ రిలీఫ్ అంటున్నారు.

అయిదేళ్ళూ ఉండే కేసులేనా?

ఇక ఇపుడు అసలు విషయం చెప్పుకోవాలి. టీడీపీ ఓడిపోయి బొత్తిగా నాలుగు నెలలే అయింది. మరోవైపు వైసీపీ ఆఫీస్ చూస్తే కిక్కిరిసి ఉంది. ఇపుడు వెళ్ళినా కూడా అక్కడ అదనంగా వచ్చేది లేదు. నింపాదిగా ఉంటూ సరైన సమయం, ఎదుటి పార్టీ అవసరం చూసుకుని బిగ్ జంప్ చేస్తే వచ్చే రాజకీయ లాభం భారీగా ఉంటుంది. ఇదే రకమైన ఆలోచనల‌తోనే చాలా మంది తమ్ముళ్ళు వెనక్కి తగ్గి మరీ చంద్రబాబు సమీక్షలకు హాజరయ్యారని అంటున్నారు. అయితే ఇలావచ్చిన వారిలో ఎవరు ముఖాల్లోనూ పెద్దగా ఆనందం లేదు, తెచ్చుకున్న సంతోషం తప్ప సహజసిధ్ధమైన జోష్ ఎక్కడా లేదు.

బాబు వెళ్లగానే…..

పైగా చంద్రబాబు ముందు బుద్ధిమంతుల్లా కనిపించి ఆయన ఇలా విశాఖ దాటేయగానే అలా తమ సొంత బిజినెస్ చూసుకునే కేసులే ఎక్కువగా ఉన్నాయి. మొత్తానికి చూసుకుటే తెలుగుదేశం పార్టీలో సమీక్షల పేరిట చంద్రబాబు ఆరాటమే తప్ప పార్టీ బతికి బట్టకడుతుందా అన్నది డౌటేనని అంటున్నారు. దానికి కారణం జంపింగ్ జపాంగులు ఇలా మారు వేషాల్లో పార్టీ వేదికల మీద కనిపించడమేనని అంటున్నారు. దీని మీద సీనియర్ నాయకులు ఒక మాట అంటున్నారు. పోతామన్న వారు త్వరగా పోతే పార్టీని బాగుచేసుకుంటామని, కానీ వారు పోరు, మరొకరిని రానివ్వరు. దీంతో పార్టీ దారుణంగా నష్టపోతోందని ఆవేదన చెందుతున్నారు. బహుశా ఇదే నిజమేమో.

Tags:    

Similar News