రీప్లేస్ చేయడం కష్టమే

ఏపీ టీడీపీలో ప్రస్తుతం చంద్రబాబుతో క‌లుపుకొంటే 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే బ‌లం ద‌క్కక పోయినా.. హీన‌ప‌క్షం 60 కి త‌గ్గకుండా [more]

Update: 2019-10-12 12:30 GMT

ఏపీ టీడీపీలో ప్రస్తుతం చంద్రబాబుతో క‌లుపుకొంటే 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాస్తవానికి ప్రభుత్వం ఏర్పాటు చేసే బ‌లం ద‌క్కక పోయినా.. హీన‌ప‌క్షం 60 కి త‌గ్గకుండా ఎమ్మెల్యేలు అందుబాటులోకి వ‌స్తార‌ని అధికారంలో ఉన్న స‌మ‌యంలోనే చంద్రబాబుకు ఇంటిలిజెన్స్ నివేదిక‌లు అందాయి. అయితే, వీటికి భిన్నంగా జ‌గ‌న్ సునామీ దెబ్బ టీడీపీకి భారీ ఎత్తున త‌గిలింది. దీంతో కేవ‌లం రెండు ప‌దుల‌కే టీడీపీ ప‌రిమిత‌మైంది. అందులోనూ ప్రధాన ప్రతిప‌క్షం హోదా ద‌క్కించుకోవ‌డమే టీడీపీకి మిగిలిన ఆనందం. అయితే, ఈ 23 మందిలోనూ వృద్ధులు ఉండ‌డం ఇప్పుడు చ‌ర్చనీయాంశంగా మారింది.

ఇద్దరు నేతలు కూడా…

వారు వ‌చ్చే ఎన్నిక‌లు అంటే 2024 నాటికి పార్టీలో యాక్టివ్‌గా ఉండే అవ‌కాశం లేదు. ఇప్పటికే ఒక‌రిద్దరు రిటైర్మెంట్ ప్రక‌ట‌న కూడా చేశారు. ఈ నేప‌థ్యంలో వారి స్థానాల్లో కొత్తవారికి అవ‌కాశం క‌ల్పించాలా ? లేక వారి వార‌సుల‌కే అవ‌కాశం ఇవ్వాలా ? అదీ కాదంటే.. వారు సూచించిన వారికి ఛాన్స్ ఇవ్వాలా ? అనేది ప్రధానంగా చంద్రబాబును వేధిస్తున్న ప్రశ్న. ఇక‌, రిటైర్మెంట్ ప్ర‌క‌టించేందుకు సిద్ధమైన వారిలో రాజ‌మండ్రి రూర‌ల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌద‌రి, ప్రకాశం జిల్లా చీరాల నుంచి విజ‌యం ద‌క్కించుకున్న క‌ర‌ణం బ‌లరామ కృష్ణమూర్తి ఇద్దరూ కూడా రిటైర్మెంట్‌కు చేరువ‌లోనే ఉన్నారు.

ఆ సీటు కోసం…..

వీరిలో క‌ర‌ణం బ‌ల‌రామ‌కృష్ణమూర్తికి వార‌సుడు ఉన్నారు. గ‌త 2014 ఎన్నిక‌ల్లో క‌ర‌ణం వెంక‌టేష్‌ అద్దంకి నుంచి పోటీ చేశారు. అయితే, వైసీపీ నేత గొట్టిపాటి ర‌విపై ఓట‌మిపాల‌య్యారు. పోనీ, ఆత‌ర్వాత అయినా.. యాక్టివ్‌గా ఉన్నారా? అంటే లేకుండా పోయారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా ఆశించిన మేర‌కు పుంజుకోలేదు. దీంతో ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో చంద్రబాబు క‌ర‌ణానికే ప్రాధాన్యం ఇవ్వాల్సి వ‌చ్చింది. దీంతో ఇప్పటికైనా క‌ర‌ణం వెంక‌టేష్ పుంజుకునేలా కార్యక్రమాలు చేయాల్సిన అవ‌స‌రం ఉంది. లేకుండా క‌ర‌ణం సీటును భ‌ర్తీ చేసేందుకు వేరేవారిని వెతుక్కోవాల్సిన అవ‌స‌రం ఉంది.

బుచ్చయ్య వారసులెవరు?

పైగా చీరాల నుంచే క‌ర‌ణం వార‌సుడు పోటీ చేయాల‌నుకుంటే అక్కడ బ‌ల‌మైన ఆమంచి ప్రత్యర్థిగా ఉన్నాడు. ఇక‌, బుచ్చయ్యకు రాజ‌కీయంగా వార‌సులు ఎవ‌రూ లేరు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న పోటీకి కూడా దూరంగా ఉంటాన‌ని ప్రక‌టించారు. ఈ నేప‌థ్యంలో కొత్తవారికి అవ‌కాశం ఇవ్వడ‌మా ? లేక బుచ్చయ్య సూచించిన వారికి ఛాన్స్ ఇవ్వడ‌మో చేయాలి. మ‌రి చంద్రబాబు ఇప్పటి నుంచే దృష్టి పెట్టక‌పోతే.. ఈ స్థానాలు కూడా వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మిగిలేలా క‌నిపించ‌డం లేదు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

Tags:    

Similar News