రెండోసారి ఓటమి నుంచి తప్పించుకోవడమెలా?

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం, పదమూడున్నరేళ్ల ముఖ్యమంత్రిగా పాలన ఇవేమీ ఆయనను గత ఎన్నికల్లో గెలుపు బాటను నడపలేదు. దీనికి ప్రధాన [more]

Update: 2020-05-08 08:00 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నలభై ఏళ్ల రాజకీయ అనుభవం, పదమూడున్నరేళ్ల ముఖ్యమంత్రిగా పాలన ఇవేమీ ఆయనను గత ఎన్నికల్లో గెలుపు బాటను నడపలేదు. దీనికి ప్రధాన కారణం ఆయన పట్ల ప్రజల్లో నమ్మకం లేకపోవడమే. చంద్రబాబు రెండు సార్లు మాత్రమే తన నేతృత్వంలో పార్టీని గెలిపించారు. అదీ కూడా పొత్తులతోనే. దేశంలో అనేక మంది ముఖ్యమంత్రులు వరసగా విజయం సాధిస్తున్నా చంద్రబాబుకు మాత్రం వరస విజయం దక్కడం లేదు. వరస ఓటములు మాత్రం దక్కుతున్నాయి. దీనికి కారణం చంద్రబాబు స్వయంకృతాపరాధమే.

పార్టీని గాడిన పెట్టే పనిలో….

చంద్రబాబు ప్రస్తుతం పార్టీని గాడిన పెట్టే పనిలో ఉన్నారు. ఆయన లక్ష్యమంతా 2024 ఎన్నికలు. జమిలి ఎన్నికలు రావచ్చన్న చిరు ఆశ చంద్రబాబులో ఎటూ ఉండనే ఉంది. అయితే క్యాడర్ కంటే ప్రజలను నమ్మించడమే ఇక్కడ ముఖ్యమన్నది చంద్రబాబు విస్మరిస్తున్నారు. పార్టీ గెలుపునకు క్యాడర్ ఎంత ముఖ్యమో, ప్రజల్లో విశ్వాసమూ అంతే ముఖ్యం. ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే తాను ఇచ్చిన మాటలను నిలబెట్టుకోలేకపోవడం చంద్రబాబు బలహీనతల్లో భాగమయిపోయింది. 2014 ఎన్నికల్లో చంద్రబాబు పై విశ్వాసంతోనే ప్రజలు గెలిపించారు. దీనికి తోడు అప్పటి మోదీ, పవన్ కల్యాణ‌్ ల మద్దతు కూడా కలసి వచ్చింది.

అనేకమంది ముఖ్యమంత్రులు…..

దేశంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ రెండు సార్లు వరస విజయాలు సాధించారు. హ్యాట్రిక్ కొట్టేందుకు రెడీ అవుతున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంగతి చెప్పనవసరం లేదు. ఆయన నాలుగు పర్యాయాల నుంచి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సయితం వరస విజయాలు నమోదు చేస్తూ ఉన్నారు. కానీ నలభై ఏళ్ల అనుభవం అని చెప్పుకునే చంద్రబాబుకు మాత్రం వరస విజయాలు దక్కక పోవడానికి కారణం ఆయన అతి విశ్వాసం, నిర్లక్ష్యం కారణమన్న వ్యాఖ్యలు పార్టీ నుంచే విన్పిస్తన్నాయి.

వరస ఓటములు మాత్రం….

2004, 2009 ఎన్నికల్లో వరసగా చంద్రబాబు ఓడిపోయారు. ఆ తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో మాత్రం రాష్ట్ర విభజన ఆయన గెలుపునకు కారణమయింది. ఇక 2024 ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందో? అన్న భయం టీడీపీ సీనియర్ నేతలను సయితం వదిలిపెట్టడం లేదు. అందుకే సీనియర్ నేతలు ఇప్పటికే పార్టీకి దూరమయినట్లు కన్పిస్తుంది. అయితే ముందుగా చంద్రబాబు ప్రజల్లో విశ్వాసం చూరగొనే విధంగా వ్యవహరించాలని పార్టీ నేతలు సయితం సూచిస్తున్నారు. ప్రభుత్వంపై అనవసర విమర్శలు చేయకుండా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే, ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని కొందరు టీడీపీ నేతలు సూచిస్తున్నారు. మొత్తం మీద రెండోసారి ఓటమిపై టీడీపీలో పెద్దయెత్తున చర్చ నడుస్తోంది.

Tags:    

Similar News