సొంత కులంలోనే కుట్ర జరుగుతోందా?

చంద్రబాబుకు బంధువులు, బంధాలు అన్నీ కూడా రాజకీయమేనని విమర్శలు ఉన్నాయి. ఆయన సొంత మామనే వెన్నుపోటు పొడిచాడని ఇప్పటికీ నిందలు మోస్తున్నారు. సరే చంద్రబాబుకు కొడుకు లోకేష్ [more]

Update: 2020-05-07 13:30 GMT

చంద్రబాబుకు బంధువులు, బంధాలు అన్నీ కూడా రాజకీయమేనని విమర్శలు ఉన్నాయి. ఆయన సొంత మామనే వెన్నుపోటు పొడిచాడని ఇప్పటికీ నిందలు మోస్తున్నారు. సరే చంద్రబాబుకు కొడుకు లోకేష్ మీద కూడా ప్రేమ, అభిమానం లేనేలేవని, ఆయనకు ఊపిరి రాజకీయమేనని వైసీపీ నేతలు ఎటూ ఆరోపణ‌లు చేస్తూంటారు. ఇవన్నీ ఇలా ఉంటే నందమూరి కుటుంబాన్ని తెలివిగా పక్కన నెట్టేసి నారా వారి చేతుల్లోకి టీడీపీని తెచ్చేసిన చంద్రబాబు తన తరువాత కొడుకు లోకేష్ మాత్రమే అధినేత కావాలని కోరుకుంటున్నారు. అది ఒక తండ్రిగా ఉండాల్సిన కోరికే కూడా. అయితే ఇపుడు దాని మీదనే పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మరో వైపు టీడీపీకి గట్టి మద్దతుదారులుగా ఉన్న కమ్మ సామాజికవర్గం మాత్రం నందమూరి రక్తమే భావి సారధి కావాలంటోందిట.

కొంప కొల్లేరే…?

చంద్రబాబు తన స్వార్ధ రాజకీయాలు చూసుకుంటున్నారని, ఆయన కారణంగానే ఎన్టీఆర్ హయాంలో 23 జిల్లాల ఉమ్మడి ఏపీలో బలంగా ఉన్న టీడీపీ ఇపుడు ఏపీలో కూడా సోదిలోకి లేకుండా పోయిందని బలమైన కమ్మ సామాజికవర్గంలో వినిపిస్తున్న మాటగా ఉందని అంటున్నారు. చంద్రబాబు ఒకనాడు టీడీపీకి బలమైనా ఇపుడు ఆయన వారసత్వ రాజకీయాల వల్ల చేటు వస్తోందని కూడా విశ్లేషిస్తున్నారుట. టీడీపీలో లోకేష్ కనుక పార్టీ పగ్గాలు చేపడితే మాత్రం కొంప కొల్లేరు అవుతుందని బలమైన లాబీ కలిగిన కమ్మ వర్గంలో తాజాగా వినిపిస్తున్న మాటగా ఉందిట.

చిన్నమ్మే పెద్దమ్మ….

ఇక టీడీపీలో చూసుకుంటే నందమూరి వారసులు ఎవరూ ఇపుడు పార్టీ పగ్గాలు చేపట్టే స్థితిలో లేరన్నది నిజం. బాలకృష్ణ బావ చంద్రబాబుని కాదని పార్టీని తనకు తానుగా స్వాధీనంలోకి తెచ్చుకోలేరు. అదే విధంగా వయసు రిత్యా చిన్నవాడైన జూనియర్ ఎన్టీఆర్ విషయంలో నందమూరి వంశంలోనే అభిప్రాయ భేదాలు ఉన్నాయి. ఇక ఆయనకు కూడా సినిమా రంగంలో మంచి భవిష్యత్తు ఉందని, దాన్ని వదులుకుని రావడం కుదిరే పనికాదని అంటున్నారు. ఈ నేపధ్యంలో ఎన్టీఆర్ రక్తం అయిన పురంధేశ్వరి చేతిలో పార్టీ పగ్గాలు పెట్టాలని కమ్మలలో బలమైన నేతలు భావిస్తున్నారని అంటున్నారు. కేంద్ర మంత్రిగా, రెండు సార్లు ఎంపీగా పురంధేశ్వరి తన సత్తా ఇప్పటికే చాటుకున్నారని అంటున్నారు. ఆమె కనుక పార్టీ పగ్గాలు స్వీకరిస్తే ఏపీలో టీడీపీకి కొత్త ఊపిరి వస్తుందని అంటున్నారుట‌.

మోదీ ఆశీస్సులు …

ఇక చిన్నమ్మ ఇపుడు బీజేపీలో ఉన్నారు. ఆమెని ఏపీ బీజేపీ చీఫ్ చేస్తారన్న మాట కూడా ఉంది. మోడీ దగ్గర మంచి మార్కులు పొందిన నేతగా ఉనన్ చిన్నమ్మని తండ్రి స్థాపించిన టీడీపీలోకి తెచ్చి పార్టీ సారధ్యం అప్పగిస్తే మోడీ ఆశీస్సులు కూడా ఉంటాయని అంటున్నారు. ఇక ఏపీలో బీజేపీతో టీడీపీ పొత్తునకు మార్గం సుగమం అవుతుందని అంటున్నారు. మరో వైపు చూసుకుంటే బావ చంద్రబాబు చేతిలో పావుగా మారిన బాలయ్య అక్క పురంధేశ్వరి కనుక పార్టీ ప్రెసిడెంట్ అయితే కచ్చితంగా మద్దతు ఇస్తారని అంటున్నారు. అంటే చంద్రబాబు తప్ప టోటల్ గా నందమూరి కుటుంబం మద్దతు ఆమెకు దక్కుతుందని అంటున్నారు. మరోవైపు పార్టీకి వ్యూహకర్తగా ఎటూ పెద్దల్లుడు దగ్గుబాటి ఉంటారని, ఈ కాంబినేషన్ తో, బీజేపీ పొత్తుతోనే 2024 ఎన్నికల్లో జగన్ ని ఢీ కొట్టగలమని కమ్మ సామాజికవర్గంలోని మెజారిటీ వాదనగా ఉందిట.

బాబుని పక్కనపెడతారా..?

మరి ఈ మొత్తం ఎపిసోడ్ లో భారీగా నష్టపోయేది చంద్రబాబే. మరి ఆయన తన కాళ్ళకిందకు నీళ్ళు తెచ్చుకుంటారా. కోరి మరి వదినగారి చేతిలో పార్టీ పగ్గాలు పెడతారా. అది కనుక జరగకపోతే కమ్మ వర్గమే పునాదిగా ఉన్న టీడీపీలో చంద్రబాబుకు వ్యతిరేకంగా తిరుగుబాటు వచ్చినా రావచ్చు అంటున్నారు. మొత్తానికి చంద్రబాబుకు ఇపుడు వదిన గారి బెదురు ఎక్కువైందిట. ఏది ఏమైనా టీడీపీలో చంద్రబాబు నాయకత్వం మీద సొంత కులంలోనే నమ్మకం తగ్గుతోందని అంటున్నారు.

Tags:    

Similar News