అప్లయ్ చేయలేదా? ఆరోగ్యం కాపాడుకోవడానికేనా?

టీడీపీ అధినేత చంద్రబాబు తెలియని ఇరకాటంలో పడిపోయారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కు దూరంగా ఉండటం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయింది. నిజానికి చంద్రబాబు ఏ విపత్తు వచ్చినా వెంటనే [more]

Update: 2020-04-24 06:30 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు తెలియని ఇరకాటంలో పడిపోయారు. ఆయన ఆంధ్రప్రదేశ్ కు దూరంగా ఉండటం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమయింది. నిజానికి చంద్రబాబు ఏ విపత్తు వచ్చినా వెంటనే రంగంలోకి దిగుతారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సమస్య వస్తే వెంటనే అమరావతిలో వాలిపోతారు. కానీ ఈసారి నెలరోజులకు పైగానే హైదరాబాద్ లో లాక్ అయిపోయారు. ఇప్పుడు ఇది వైసీపీ తనకు అనుకూలంగా మలచుకుంటోంది.

మనవడి పుట్టినరోజుకోసమని….

చంద్రబాబు నాయుడు గత నెల 20వ తేదీన హైదరాబాద్ కు వెళ్లారు. మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు వేడుకలకు హాజరవ్వాలని ఆయన ముందుగానే హైదరాబాద్ వెళ్లారు. అయితే 22వ తేదీన జనతా కర్ఫ్యూ, 23 నుంచి లాక్ డౌన్ విధించడంతో ఇక హైదరాబాద్ లోనే ఉండపోయారు. అయితే హైదరాబాద్ లో ఉన్నప్పటికీ ఆయన నిత్యం వీడియో కాన్ఫరెన్స్ ల ద్వారా మీడియాతో, పార్టీ నేతలతో మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు లేఖల రూపంలో తన సూచనలు అంద చేస్తున్నారు. అయితే చంద్రబాబు ఎప్పుడూ నెల రోజుల పాటు ఏపీకి దూరంగా లేరు.

భయపడే రాలేదంటున్న…..

కానీ చంద్రబాబు ఏపీకి భయపడే రాలేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన ఏపీకి వస్తామంటే ఎవరు కాదంటారని ప్రశ్నిస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్లే వారు పోలీసుల అనుమతి తీసుకుని వెళుతున్నారని వారు గుర్తు చేస్తున్నారు. సీనియర్ సిటిజన్ కావడం, ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయనే చంద్రబాబు హైదరాబాద్ ను వదలడం లేదని ఘాటు విమర్శలు చేస్తున్నారు. చంద్రబాబు తాను ఏపీకి వస్తానని దరఖాస్తు కూడా ప్రభుత్వానికి ఇప్పటి వరకూ చేసుకోలేదని కూడా వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పొరుగు రాష్ట్రంలో కూర్చుని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సబబు కాదని కూడా అంటున్నారు.

నిబంధనలను పాటించాలనే…?

అయితే టీడీపీ వాదన మరోలా ఉంది. తమ అధినేత చంద్రబాబు లాక్ డౌన్ నిబంధనలను పక్కాగా అనుసరిస్తున్నారని అంటున్నారు. ఏపీకి చంద్రబాబు వస్తే 14 రోజులపాటు క్వారంటైన్ లోకి వెళ్లాలన్న మంత్రుల కామెంట్స్ ను టీడీపీ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. కరోనా కట్టడిని నియంత్రించలేమని వైసీపీ నేతలు భావిస్తే, చంద్రబాబు వచ్చి వారంరోజుల్లో సమస్యను సెటిల్ చేస్తారని కూడా అంటున్నారు. అయితే చంద్రబాబు ఏపీకి వచ్చి పొడిచేది ఏమీ లేదని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. పార్టీ జాతీయ అధ్యక్ష్య, కార్యదర్శులు చంద్రబాబు, నారా లోకేష్ లు పొరుగు రాష‌్ట్రంలో ఉండిపోవడంపై సోషల్ మీడియాలో మాత్రం పార్టీ గ్రూపులు చెలరేగిపోతున్నాయి.

Tags:    

Similar News