లాక్ అయిపోయారు…లాస్ భారీగానే ఉంటుందా?

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం, ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ చంద్రబాబుకు క‌రోనా క‌ష్టాలు మ‌రో నెల రోజులు కొన‌సాగ‌నున్నాయా ? ఎప్పటిక‌ప్పుడు ఆయన ఏపీలోకి వ‌చ్చేయాల‌ని [more]

Update: 2020-04-17 15:30 GMT

టీడీపీ అధినేత‌, మాజీ సీఎం, ఫార్టీ ఇయ‌ర్స్ పొలిటిక‌ల్ ఇండ‌స్ట్రీ చంద్రబాబుకు క‌రోనా క‌ష్టాలు మ‌రో నెల రోజులు కొన‌సాగ‌నున్నాయా ? ఎప్పటిక‌ప్పుడు ఆయన ఏపీలోకి వ‌చ్చేయాల‌ని ప్రయ‌త్నిస్తున్నా.. క‌రోనా మ‌హ‌మ్మారి చంద్రబాబు దూకుడు అడ్డుక‌ట్ట వేస్తోందా? ఆయ‌న‌ను హైద‌రాబాద్‌లో సొంత ఇంటికే ప‌రిమితం చేస్తోందా? అంటే.. తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తున్న వారు ఔన‌నే అంటున్నారు. క‌రోనా ఎఫెక్ట్‌కు ముందుగానే సొంత ప‌నుల‌పై చంద్రబాబు హైద‌రాబాద్ కు వెళ్లారు. ఆ వెంట‌నే కేంద్ర ప్రభుత్వం జ‌న‌తా క‌ర్ఫ్యూ విధించ‌డంతో చంద్రబాబు అక్కడికే ప‌రిమిత‌మ‌య్యారు. త‌ర్వాత వ‌చ్చేయాల‌ని అనుకున్నా.. జ‌న‌తా క‌ర్ఫ్యూ రోజే స‌డెన్‌గా దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రక‌టించారు.

హైదరాబాద్ సేఫ్ అనుకుని…..

వాస్తవానికి చంద్రబాబు ప్రతిప‌క్ష నేత కాబ‌ట్టి, కేబినెట్ హోదా ఉంది కాబ‌ట్టి ఆయ‌న వ‌చ్చేసినా ఎవ‌రూ అడ్డగించే వారు ఉండ‌రు. కానీ, ఎందుకో ఆయ‌న హైద‌రాబాద్‌లో ఉండ‌డ‌మే సేఫ్ అనుకున్నారు. దీంతో తొలి వారం రోజులు హైద‌రాబాద్‌లోనే ఉండి.. త‌న కుటుంబంతో ఆయ‌న క‌రోనా రిలీఫ్ డేస్‌ను ఎంజాయ్ చేశారు ఈ క్రమంలోనే త‌న మ‌న‌వ‌డితో ఆయ‌న ఆడుకున్న వీడియోలు కూడా సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేశాయి. కానీ, లాక్‌డౌన్ కొన‌సాగుతున్న స‌మ‌యంలోనే రాష్ట్రంలో రాజ‌కీయ ప‌రిణామాలు హ‌ఠాత్తుగా మారిపోయాయి. రాష్ట్ర ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మగ‌డ్డ ర‌మేష్ కుమార్‌ను జ‌గ‌న్ స‌ర్కార్ త‌ప్పించేసింది. ఆ వెంట‌నే ఆయ‌న స్థానంలో క‌న‌గ‌రాజ్‌ను కూడా నియ‌మించింది.

వస్తే అభ్యంతరం లేదని…..

దీంతో చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం క‌ట్టలు తెగింది. వెనువెంట‌నే ఆయ‌న ఏపీలో వాలిపోయి.. జ‌గ‌న్‌పై విరుచుకుప‌డాల‌ని అనుకున్నారు. నిజానికి అప్పటికే ఆయ‌న ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా త‌న అనుకూల మీడియాలో మాట్లాడారు. అయినా కూడా ఏపీలో ఉండి మాట్లాడితే ఆ ఎఫెక్ట్ వేరేగా ఉంటుందని అనుకున్నారు కాబోలు.. అందుకే చంద్రబాబు ఏపీకి వ‌చ్చేందుకు స‌న్నాహాలు చేసుకుంటున్నార‌ని వార్తలు వ‌చ్చాయి. ఆ వెంట‌నే ఏపీ ప్రభుత్వంలోని మంత్రులు ఒక‌రిద్దరు స్పందించారు. చంద్రబాబు హైద‌రాబాద్ నుంచి వ‌స్తే.. త‌మ‌కు అభ్యంత‌రం లేద‌ని, స్వాగ‌తిస్తామ‌ని అన్నారు.

ఇప్పట్లో సాధ్యం కాదా?

అయితే, క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్రంగా ఉన్న తెలంగాణ నుంచి వ‌స్తున్నారు కాబ‌ట్టి ఆయ‌న ను 14 రోజులు క్వారంటైన్‌లో పెడ‌తామ‌ని ప్రక‌టించారు. దీనికి సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల‌ను కూడా మంత్రి ఆదిమూలపు సురేష్ చూపించారు. దీంతో చంద్రబాబుకు ముందు నుయ్యి వెనుక గొయ్యి మాదిరిగా మారిపోయింది. ఇప్పుడు ప‌ట్టుబ‌ట్టి ఏపీకి వెళ్తే.. క్వారంటైన్‌కు త‌ర‌లించ‌డం ఖాయమ‌ని ఆయ‌న భావిస్తున్నారు. పోనీ లాక్‌డౌన్ ఎత్తేస్తారా? అంటే అది కూడా సాధ్యమయ్యే ప‌నికాదు. ఈ నేప‌థ్యంలో మ‌రో నెల రోజుల పాటు ఆయ‌న హైద‌రాబాద్‌లోనే ఉండాల్సి వ‌స్తుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మొత్తానికి మ‌రో నెల రోజులు ఏ రాజ‌కీయాలు చేసినా.. హైద‌రాబాద్ నుంచి చేయాల్సి రావ‌డం చంద్రబాబుకు అగ్నిప‌రీక్షగా మారింద‌ని చెబుతున్నారు.

Tags:    

Similar News