ఇనప సామాన్లు అమ్ముకునే తెలివితేటలు

“అమ‌రావ‌తిని ప్రపంచ స్థాయి న‌గ‌రంగా మారుస్తా. ల‌క్ష కోట్లకు పైగా ఇక్కడ ఖ‌ర్చు పెట్టి.. ప్రపంచం మొత్తం స‌న్ రైజ్ ఏపీ వైపు చూసేలా చేస్తా. ల‌క్షకోట్లు [more]

Update: 2020-01-12 15:30 GMT

“అమ‌రావ‌తిని ప్రపంచ స్థాయి న‌గ‌రంగా మారుస్తా. ల‌క్ష కోట్లకు పైగా ఇక్కడ ఖ‌ర్చు పెట్టి.. ప్రపంచం మొత్తం స‌న్ రైజ్ ఏపీ వైపు చూసేలా చేస్తా. ల‌క్షకోట్లు ఖ‌ర్చు చేసే ఈ ప్రాజెక్టుకు కేంద్రం డ‌బ్బులు ఇచ్చేందుకు మీన మేషాలు లెక్కిస్తోంది. ఇది ఏపీ ప్రజ‌ల‌ను అవ‌మానించ‌డ‌మే. గుజ‌రాత్‌పై ఉన్న ప్రేమ‌ విభ‌జ‌న‌తో అత‌లాకుతలం అయిన ఏపీపై ప్రధాిని మోడీకి ఎందుకు లేదు?” 2017 డిసెంబ‌రులో అప్పటి ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఇవి. అంతేకాదు, అమ‌రావ‌తిలో ఇప్పుడున్నవ‌న్నీ తాత్కాలిక భ‌వ‌నాలేన‌ని కూడా చంద్రబాబు చెప్పారు.

నాడు చెప్పింది…..

ఇక‌, సీఆర్డీఏ చ‌ట్టంలోనూ ప్రస్తుతం ఉన్న హైకోర్టు, స‌చివాల‌యం స‌హా ప్రభుత్వ భ‌వ‌నాల‌న్నింటినీ.. కూడా తాత్కాలిక‌మేన‌ని పేర్కొన్నారు. అంటే.. రాజ‌ధానికి శాశ్వత భ‌వ‌నాలు ఇప్పటికీ ప్రారంభం కాలేద‌ని చంద్రబాబు చెప్పిన వ్యాఖ్యలను బ‌ట్టి ఏ మాత్రం చ‌దువు లేని వారికైనా ఇట్టే అర్ధం అవుతుంది. అయితే, తాజాగా మాత్రం చంద్రబాబు ఈ విష‌యంలో యూట‌ర్న్ తీసుకున్నారు. రాజ‌ధానిని ల‌క్ష కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతుంద‌ని నిన్న మొన్నటి వ‌ర‌కు భారీ ఎత్తున ఆప‌సోపాలు పడిన చంద్రబాబు తాజాగా జ‌గ‌న్ ప్రభుత్వం ల‌క్ష కోట్లు ఖ‌ర్చు పెట్టేందుకు త‌మ ద‌గ్గర నిధులు లేవ‌ని, అయినా కూడా అంత సొమ్మును ఒకే చోట పెట్టి అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతం చేయ‌డంవ‌ల్ల రేపు ప్రాంతీయ వైష‌మ్యాలు వ‌స్తాయి కాబ‌ట్టి తాము మూడు రాజ‌ధానుల విష‌యాన్ని ప‌రిశీలిస్తున్నామ‌ని చెప్పగానే చంద్రబాబు మాట మార్చారు.

తూచ్ అంటూ…

అంతా తూచ్‌… ల‌క్ష కోట్లు రాజ‌ధాని కోసం ఇప్పటికిప్పుడు అవ‌స‌రం లేద‌ని 15 రోజుల కింద‌ట మంద‌డంలో జ‌రిగిన స‌భ‌లో చంద్రబాబు చెప్పుకొచ్చారు. అన్ని నిర్మాణాలు పోగా ప్రభుత్వం వ‌ద్ద 2 వేల ఎక‌రాలు ఉంటాయ‌ని, దీనిని ఎక‌రం రు. 20 కోట్ల చొప్పున అమ్ముకుని, ఆ డ‌బ్బుల‌తో నిర్మాణాలు పూర్తి చేయొచ్చని, తెలివి ఉండాల‌ని జ‌గ‌న్‌ను దెప్పిపొడిచారు. క‌ట్ చేస్తే.. దీనిపైనా ప్రభుత్వం ధీటుగా స్పందించింది. అస‌లు రాజ‌ధాని అనేది నిర్మాణాలు పూర్తి చేసుకుని ప్రజ‌లంతా ఇక్కడకు వ‌చ్చి. అమ‌రావ‌తి ఒక మ‌హాన‌గ‌రంగా మారినప్పుడు క‌దా ఎక‌రం భూమిని రూ.20 కోట్లకు అమ్ముకునే ప‌రిస్థితి వ‌స్తుంది. లేకుంటే ఎవ‌రు కొంటారు? చంద్రబాబు వ‌న్నీ ఇనుపసామాన్లు అమ్ముకునే తెలివితేట‌లు కాబ‌ట్టే రాష్ట్రం అంగుళం అంత కూడా అభివృద్ది చెంద‌లేద‌ని విమ‌ర్శలు వ‌చ్చాయి.

రూపాయి కూడా అవసరం లేదంటూ…

దీంతో మ‌రింత త‌ర్జన భ‌ర్జన ప‌డిన చంద్రబాబు.. మ‌ళ్లీ యూట‌ర్న్ తీసుకున్నారు. రాజ‌ధానికి ల‌క్ష కోట్లు అన్న నోటితోనే రాజ‌ధానిలోని భూముల‌ను అమ్ముకుని నిర్మాణాలు పూర్తి చేయొచ్చని చెప్పిన ఆయ‌న నోటి నుంచే ప్రస్తుతం ఉన్నవ‌న్నీ శాశ్వత భ‌వ‌నాలేన‌ని, ఇప్పుడు ప్రభుత్వం, గ‌వ‌ర్నర్ బంగ్లా అన్నీ కూడా న‌డుస్తున్న భ‌వ‌నాలు క‌నీసం 50 ఏళ్లు ఉంటాయ‌ని, కాబ‌ట్టి రాజ‌ధానికి ఒక్క రూపాయి కూడా అవ‌స‌రం లేద‌ని చెప్పేశారు. దీనికి త‌గిన విధంగానే చంద్రబాబు అనుకూల మీడియాలో రాజ‌ధానిలో ఉన్నవ‌న్నీ శాశ్వత భ‌వ‌నాలేనంటూ.. చంద్రబాబు గ‌తంలో తాత్కాలికం అని చూపించిన భ‌వ‌నాల‌తో ఓ క‌థ‌నాన్ని వండి వార్చారు. మొత్తంగా చూస్తే.. అమ‌రావ‌తి నిర్మాణాల‌పై చంద్రబాబు అండ్ కో ఆడుతున్న నాట‌కం అంత‌గా ర‌క్తిక‌ట్ట‌డం లేదు. ఇదే కంటిన్యూ అయితే, చంద్రబాబు ఇన్నాళ్లు చేసిన ఉద్యమాలు నిర‌స‌న‌లు కూడా అట‌కెక్కే ప‌రిస్థితి ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

Tags:    

Similar News