బాబుకు తోడు ఎవరు?

టీడీపీ అధినేత చంద్రబాబు ఒంటరి అవుతున్నారు. దాదాపుగా ఆరు నెలలుగా ఆయన ఒక్కరే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత పార్టీలో [more]

Update: 2019-12-26 11:00 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు ఒంటరి అవుతున్నారు. దాదాపుగా ఆరు నెలలుగా ఆయన ఒక్కరే పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఘోర ఓటమి తర్వాత పార్టీలో సీనియర్ నేతలందరూ సైడయిపోయారు. చంద్రబాబు మాత్రం జిల్లాల సమీక్షలు చేస్తూ క్యాడర్ లో ఆత్మవిశ్వాసం నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మూడు రాజధానుల ప్రతిపాదన వచ్చింది. ఒకరకంగా ఇది చంద్రబాబుకు అగ్ని పరీక్ష వంటిదే. ఈ సమయంలో అధినేతకు అండగా నిలవాల్సిిన అవసరం ఎంతైనా ఉంది.

సీనియర్ నేతలు ఎవరూ….

కానీ సీనియర్ నేతలు ఎవరూ చంద్రబాబుకు అండగా నిలిచింది లేదు. ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ నేతలు మూడు రాజధానుల ప్రతిపాదనపై మౌనం వహిస్తున్నారు. తాజాగా చంద్రబాబు అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ నిర్ణయం తీసుకున్నా దానిని సమర్థిస్తూ ఎవరూ మాట్లాడటం లేదు. కేవలం కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పార్టీ నేతలు మాత్రం చంద్రబాబు వెంట ఉంటున్నారు.

బాలకృష్ణ సయితం…..

మరోవైపు టాలీవుడ్ లో కూడా చంద్రబాబుకు అండ దొరకడం లేదు. ఇప్పటికే చిరంజీవి మూడు రాజధానుల ప్రతిపాదనకు ఓకే చెప్పారు. మద్దతిచ్చారు. ఒకప్పుడు టాలీవుడ్ మొత్తం టీడీపీకి అండగా ఉండేది. టాలీవుడ్ లో నటులు, దర్శక, నిర్మాతలందరూ ఎక్కువగా కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వారే అయినా అమరావతికి మద్దతుగా నిలిచేందుకు ముందుకు రాలేదు. చివరకు చంద్రబాబు వియ్యంకుడు, సినీనటుడు బాలకృష్ణ సయితం అమరావతిపై స్పందించడం లేదు.

ఉత్తరాంధ్ర నేతలు….

దీనికి తోడు టీడీపీ లోని కీలక నేతలు కూడా ఈ విషయంలో సైడయిపోవాలని చూస్తున్నారు. విశాఖలో నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే గంటా శ్రీనివాసరావు తప్ప ఎవరూ నోరు మెదపలేదు. గంటా విశాఖకు రాజధాని రావాల్సిందేనంటున్నా మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు మౌనంగానే ఉన్నారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నేతలు సయితం చంద్రబాబు అమరావతిలోనే రాజధాని ఉండాలన్న ప్రకటనను సన్నిహితుల వద్ద తప్పుపడుతున్నట్లు తెలిసింది. మొత్తం మీద కీలక సమయంలో చంద్రబాబుకు తోడుగా ఎవరూ నిలవకపోవడం పార్టీలో చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News