సరదాగా కాదు.. సీరియస్ గానే?

చంద్రబాబు మాట్లాడితే గతం చెప్పుకుంటారు. తాను నాలుగున్నర దశాబ్దాల అనుభవశాలిని అని కూడా అంటారు. సరిగ్గా ఇక్కడే ఆయన దొరికిపోతున్నారు. ఎపుడైతే అనుభవాలను వల్లె వేయడం మొదలుపెడతారో [more]

Update: 2019-12-13 08:00 GMT

చంద్రబాబు మాట్లాడితే గతం చెప్పుకుంటారు. తాను నాలుగున్నర దశాబ్దాల అనుభవశాలిని అని కూడా అంటారు. సరిగ్గా ఇక్కడే ఆయన దొరికిపోతున్నారు. ఎపుడైతే అనుభవాలను వల్లె వేయడం మొదలుపెడతారో వారు అక్కడితో ఆగిపోయారని అర్ధం అంటారు మానసిక విశ్లేషకులు. చంద్రబాబు రాజకీయంగా నాటౌట్ అని ఎంత చెప్పుకున్నా ఇప్పటి జనరేషన్ కి ఆయన ఫిట్ అవడంలేదని గత అసెంబ్లీ నుంచే రుజువు అవుతూ వస్తోంది. ఎవరు అవునన్నా, కాదన్నా ఏపీ రాజకీయాల్లోకి కొత్త రక్తం వచ్చేసింది. గత అసెంబ్లీ చూసుకున్నా ఇపుడున్న సభను చూసుకున్నా కూడా అంతా నలభై, యాభై ఏళ్ళవారే ఎక్కువమంది ఉన్నారు. చంద్రబాబు ఈడు వారు లెక్కకడితే స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వంటి వారు కొందరు ఉంటారు. ఇక చంద్రబాబు కు కంటే వయసులో సీనియర్ గా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ఉన్నా ఆయన నాయకత్వం దాకా రావడంలేదు కాబట్టి సరిపోతోంది. ఏది ఏమైనా సభ లోపలా, బయటా కూడా చంద్రబాబు సీనియర్ మోస్ట్ గా ఉంటూ జూనియర్లతో తలపడాల్సివస్తోంది.

వయసేమో ఇరవై…

నా వయసు ఎంతనుకుంటున్నారు. పాతికేళ్ళలోపే అంటున్నారు చంద్రబాబు. అదేదో సరదాకు ఆయన అనడంలేదు. సీరియస్ గానే అసెంబ్లీలో స్టేట్మెంట్ ఇచ్చేసారు. వయసు డెబ్బై అనుకున్నా నేనింకా కుర్రాడినే అంటూ చంద్రబాబు గట్టిగానే అంటున్నారు. మొత్తం నూటాభైమంది వైసీపీ ఎమ్మెల్యేలు ఒక్కసారి దాడిచేసినా వారికి తగిన జవాబు చెబుతాను అంటూ చంద్రబాబు సవాల్ చేస్తున్నారు. ఓ విధంగా తన‌ వయసుపై ఏపీ రాజకీయాల్లో ఈ మధ్య కాలంలో జరిగిన, జరుగుతున్న చర్చకు ఆ విధంగా అత్యున్నత వేదిక మీద నుంచే చంద్రబాబుజవాబు చెప్పారనుకోవాలి. మరో వైపు సొంత పార్టీ వారికి కూడా ఇదే సమాధానం అని కూడా చెప్పారేమో. చంద్రబాబు ఏజ్ అయిపోయింది. టీడీపీ ఖేల్ ఖతం అని తమ్ముళ్ళు ఎవరైనా అనుకుంటే పొరపాటేనని చంద్రబాబు వారికి కూడా క్లారిటీ ఇచ్చారన్న మాట.

రెస్ట్ తీసుకోమంటున్నారు…

చంద్రబాబు ఇలా బోరవిడుచుకుని మరీ నేను జగన్ కంటే కూడా పాతికేళ్ళు కుర్రోడిని అంటే అధికార వైసీపీ ఊరుకుంటుందా హాట్ కామెంట్స్ చేసింది. సెగ పుట్టించే సెటైర్లూ వేసింది. మాటల మరాఠీ అంబటి రాంబాబు అయితే మరి చంద్రబాబు వయసు ఇరవై అయితే అబ్బాయి లోకేష్ వయసు 70 ఏళ్ళా అంటూ గట్టిగానే తగులుకున్నారు. మరో ఎమ్మెల్యే గుడివాడ అమర్నాధ్ అయితే చంద్రబాబు ఎపుడో సిక్సర్లు కొట్టానని ఇపుడు కూడా నాటౌట్ అంటే ఎలా అంటూ ఘాటుగానే స్పందించారు. ఇపుడు సీజన్ కోహ్లీది, తెలుసుకో బాబూ అంటూ బాగానే సుద్దులు చెప్పారు. మరో వైసీపీ ఎమ్మెల్యే సీదరి అప్పలరాజు అయితే చంద్రబాబు ఏజ్ కి ఈ సభ అసలు సరిపోదని, ఆయన ఇంట్లో కూర్చుంటే బెటర్, కాస్త రెస్ట్ అయినా దొరుకుతుందని తేల్చేశారు. మొత్తానికి చంద్రబాబు తాను కుర్రోడిని అంటున్నా ఇక్కడ నమ్మేంటంత వెర్రోళ్ళు ఎవరూ లేరంటోంది వైసీపీ.

Tags:    

Similar News