కసి అలా తీర్చుకుంటారటగా

ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి త‌న రాజ‌కీయ వ్యూహానికి తెర‌దీశారు. తెలంగాణ‌లో త‌న‌ను వ్య‌తిరేకిస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ [more]

Update: 2019-10-03 05:00 GMT

ఏపీ ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు, టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు, మాజీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి త‌న రాజ‌కీయ వ్యూహానికి తెర‌దీశారు. తెలంగాణ‌లో త‌న‌ను వ్య‌తిరేకిస్తున్న అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత‌కు ఘాటుగా బుద్ధి చెప్పాల‌ని ఆయ‌న మ‌రో సారి నిర్ణ‌యించుకున్నారు. (అయితే, గ‌త ఏడాది 2018-డిసెంబ‌రులో జ‌రిగిన తెలంగాణ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఇలానే భావించి కాంగ్రెస్‌తో చేతులు క‌లిపి ఆఖ‌రికి ఘోరాతి ఘోరంగా చేతులు కాల్చుకున్నారు) గ‌త అనుభ‌వాన్ని మ‌రిచిపోయారో.. ఏమో చంద్ర‌బాబు మ‌రోసారి త‌న విశ్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని నిర్ణ‌యించుకున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా హుజూర్ న‌గర్‌కు జ‌రుగుతున్న ఉప ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున అభ్య‌ర్థిని ప్ర‌క‌టించి చంద్ర‌బాబు సంచ‌ల‌నానికి తెర‌దీశారు.

జెండా పట్టుకునే వారే లేక…

వాస్త‌వానికి గ‌త ఏడాది జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఖ‌మ్మం జిల్లా స‌త్తుప‌ల్లి నుంచి గెలిచిన సండ్ర వెంక‌ట వీర‌య్య చంద్ర‌బాబుకు జ‌ల్ల‌కొట్టి టీఆర్ఎస్‌కు జైకొట్టారు. ఇప్పుడు పార్టీలో జెండా ప‌ట్టుకునే నాయ‌కులే లేకుండా పోయారు. తెలంగాణ అసెంబ్లీలో ఇప్పుడు టీడీపీకి ఒక్క అశ్వారావుపేట ఎమ్మెల్యే మ‌చ్చ నాగేశ్వ‌ర‌రావు మాత్ర‌మే ఉన్నారు. ఇక గ‌త లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో టీడీపీ అస‌లు తెలంగాణ‌లో పోటీయే చేయ‌లేదు. అయినా కూడా చంద్ర‌బాబు మాత్రం త‌గుదున‌మ్మా అంటూ తెలంగాణ‌లో పోరుకు సిద్ధ‌మ‌య్యారు. స‌రే.. ఇక్క‌డ చంద్ర‌బాబు ఓ వ్యూహాత్మ‌క కోణంలోనే తెలంగాణ‌లో పోటీకి సిద్ధ‌మ‌య్యార‌ని అంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

పరోక్షంగా లాభమేనా?

నిజానికి ఇప్పుడు జ‌రుగుతున్న ఉప పోరుపై చంద్ర‌బాబుకు పెద్ద‌గా ఇంట్ర‌స్ట్ లేదు. అయినా కూడా గ‌త డిసెంబ‌రులో చేతులు క‌లిపి పోటీ చేసిన కాంగ్రెస్‌కు లాభించేలా, అధికార టీఆర్ఎస్‌కు దెబ్బ‌కొట్టేలా చంద్ర‌బాబు ఇక్క‌డ వ్యూహాత్మకంగా పావులు క‌దుపుతున్నార‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఉప ఎన్నిక‌ల‌కు సిద్ధ‌మైన హుజూర్ న‌గ‌ర్‌లో దాదాపు 20 వేల మంది క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన ప్ర‌జ‌లు ఉన్నారు. వీరి ఓట్లు కాంగ్రెస్‌కు ప‌డే ప్ర‌స‌క్తి లేదు. దీంతో టీడీపీ పార్టీ ఈ ఓట్ల‌లో క‌నీసం 10 వేల మేర‌కైనా చీల్చ‌గ‌లిగితే.. అది కాంగ్రెస్‌కు ప‌రోక్షంగా లాభం తెచ్చిపెడుతుంది.

వ్యూహం సక్సెస్ అవుతుందా?

అదే స‌మ‌యంలో హుజూర్‌న‌గ‌ర్ దాదాపు ఏపీ బోర్డ‌ర్‌లోనే ఉన్నందున టీడీపీ ప్ర‌భావం ఎక్కువ‌గానే ఇక్క‌డ క‌నిపించే అవ‌కాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే మాజీ జెడ్పీటీసీ చావా కిరణ్మ‌యికి ఇక్క‌డ చంద్ర‌బాబు టికెట్ కేటాయించారు. అదేస‌మ‌యంలో ఇక్కడ ఎస్సీ ఓట్లు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయి. సో.. ఇవి కూడా అధికార పార్టీకి ప‌డే ఛాన్స్ లేదు. మాదిగ‌ల‌కు కేబినెట్‌లో చోటు లేక‌పోవ‌డంతో కేసీఆర్‌పై వారు గ‌రం గ‌రం లాడుతున్నారు. ఇటు ఈ వ‌ర్గం ఓట‌ర్లు టీఆర్ఎస్‌కు దూర‌మైతే పెద్ద దెబ్బే. ఇక క‌మ్మ సామాజిక వర్గం ఓటింగ్ ఎలాగూ కాంగ్రెస్‌కు ట‌ర్న్ కాదు. టీడీపీ అభ్య‌ర్థి లేక‌పోతే వాళ్లు ఖ‌చ్చితంగా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతారు. ఈ క్ర‌మంలోనే చంద్ర‌బాబు ఇక్క‌డ కాస్త డిసైడింగ్ ఫ్యాక్ట‌ర్‌గా ఉన్న ఈ వ‌ర్గం ఓట్లు వ‌న్‌సైడ్‌గా టీఆర్ఎస్‌కు ప‌డ‌కుండానే అదే వ‌ర్గం నుంచి కిర‌ణ్మ‌యిని త‌మ పార్టీ అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించారని తెలుస్తోంది. సో ఏదేమైనా టీఆర్ఎస్ ఓట‌మి కోస‌మే చంద్ర‌బాబు ఈ వ్యూహం వేశారు. మ‌రి చంద్ర‌బాబు వ్యూహం ఇప్ప‌డైనా స‌క్సెస్ అవుతుందో లేదో చూడాలి.

Tags:    

Similar News