జగన్ బెంచ్ మార్క్ ను బాబు దాటగలరా?

చంద్రబాబు అంటే ఎవరైనా చాలా చెబుతారు. చాణక్యుడు, మేధావి, అనుభవశాలి ఇలా ఎన్నో విశేషణాలు ముందు చేరుస్తారు. దానితో పాటే ప్రత్యర్ధులు కూడా ఎన్నో చెబుతారు. ఆయన [more]

Update: 2021-08-30 05:00 GMT

చంద్రబాబు అంటే ఎవరైనా చాలా చెబుతారు. చాణక్యుడు, మేధావి, అనుభవశాలి ఇలా ఎన్నో విశేషణాలు ముందు చేరుస్తారు. దానితో పాటే ప్రత్యర్ధులు కూడా ఎన్నో చెబుతారు. ఆయన పక్కా అవకాశవాది అని. మాట ఇచ్చి తప్పుతారు అని. జనాలు వరకూ వస్తే బయటపడరు కానీ వారిలోనూ సరిగ్గా ఇదే రకమైన భావన ఉంది అంటారు. చంద్రబాబు హామీలు అయితే భారీగా ఇస్తారు కానీ నిలబెట్టుకోరు అన్న విమర్శ అయితే సొంత పార్టీలోనూ ఉంది. అదే చంద్రబాబు రాజకీయ జీవితానికి మైనస్ గా మారుతోంది అంటున్నారు. ముఖ్యంగా జగన్ తో పోల్చుకుంటే బాబు ఈ విషయంలో పూర్తిగా తేలిపోతారు అన్నది కూడా ఉంది మరి.

మార్కులు పడవా ?

చంద్రబాబు సంక్షేమం గురించి చాలా ఎక్కువ మాటలే చెబుతారు. కానీ ఆచరణలో మాత్రం అది జరిగేది పెద్దగా ఉండదని విమర్శలు ఉన్నాయి. ఇపుడు ఏపీలో జగన్ సంక్షేమ శిల్పిగా ఉన్నారు. ఆయన అప్పు చేయవచ్చు. తప్పు చేయవచ్చు కాక, జనాలకు అయితే చేసి చూపిస్తున్నారు. హామీలను నెరవేరుస్తున్నారు. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు జగన్ ని ఎదుర్కోవడానికి ఇదే నిలువెత్తు అవరోధంగా మారుతుంది అంటున్నారు. బాబు సంక్షేమం అన్నా కూడా పెద్దగా మార్కులు పడవన్నది కూడా విశ్లేషణగా ఉంది.

పెద్ద గీత ఎలా…?

ఇంకో వైపు జగన్ కంటే తాను ఎక్కువగా సంక్షేమ పధకాలు అమలు చేస్తానని చంద్రబాబు రేపటి ఎన్నికల్లో చెప్పాల్సి ఉంటుంది. ఒక వైపు వైసీపీ పంచుడు కార్యక్రమం మీద ఘాటు విమర్శలు చేస్తున్న టీడీపీ ఎన్నికల వేళ అలాంటి మాటలు చెబితే జనాలు నమ్ముతారా అన్నది కూడా చూడాలి. ఇప్పటికైతే జగన్ కంటే ఎవరూ సంక్షేమ కార్యక్రమాలు చేయలేరు అన్న పేరు అయితే వచ్చింది. ఆ విషయంలో బెంచ్ మార్క్ ని జగన్ క్రియేట్ చేశారు. దాన్ని అందుకోవడమే కష్టం. ఇక అధిగమించడం అంటే సర్కస్ ఫీట్లు చేయాల్సిందే. మరి జగన్ చెడ్డ అని ఎలా చెప్పాలి. తాను మంచి చేస్తానని ఎలా చెప్పి ఒప్పించాలి. ఇది చంద్రబాబుకు సవాల్ గానే పరిణమించవచ్చునని అంటున్నారు.

ట్రాక్ రికార్డే ..?

చంద్రబాబు ట్రాక్ రికార్డే ముందు పెట్టి వచ్చే ఎన్నికలలో జగన్ చాలెంజ్ చేస్తారు అంటున్నారు. విశ్వసనీయత, హామీలకు కట్టుబడి ఉండడం వంటి వాటితో పోటీపడమని చంద్రబాబుకే జగన్ సవాల్ చేస్తారు అంటున్నారు. ఈ పోటీలో ఎటూ జనాల మొగ్గు తనకే ఉంటుందని జగన్ ధీమాగా ఉన్నారు. అందుకే పంటి బిగువున ఓర్చి మరీ ఏపీలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. ఇంకా మూడేళ్ల పాలన మిగిలి ఉంది. జగన్ ఈ హామీలను నిలబెట్టుకునేందుకు చేస్తున్న అసిధారా వ్రతంలో ఎక్కడైనా వ్రత భంగం జరగకపోతుందా అన్నదే చంద్రబాబు సహా టీడీపీ నేతల ఆశ. జగన్ కనుక అయిదేళ్ళూ పధకాలు సక్రమంగా అమలు చేయక పోయినా, తన హామీలను నిలబెట్టుకోలేకపోయినా చంద్రబాబుకు చాన్స్ దక్కినట్లే మరి. మొత్తానికి బాబు ఇక్కడ కూడా తన కంటే జగన్ తప్పులూ తడబాట్లనే నమ్ముకోవడమే విశేషం.

Tags:    

Similar News