మ‌హానాడే ముహూర్తం.. కీల‌క ప‌ద‌వికి బాబు స‌న్నాహాలు

టీడీపీకి మాత్రమే సొంత‌మైన రాజ‌కీయ పండుగ‌, ప్రతియేటా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసుకునే పండ‌గ‌.. మ‌హానాడు. గ‌త ఏడాది ఎన్నిక‌ల ఫ‌లితాల్లో దెబ్బకొట్టిన కార‌ణంగా వాయిదా ప‌డిన ఈ [more]

Update: 2020-05-20 12:30 GMT

టీడీపీకి మాత్రమే సొంత‌మైన రాజ‌కీయ పండుగ‌, ప్రతియేటా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేసుకునే పండ‌గ‌.. మ‌హానాడు. గ‌త ఏడాది ఎన్నిక‌ల ఫ‌లితాల్లో దెబ్బకొట్టిన కార‌ణంగా వాయిదా ప‌డిన ఈ కార్యక్రమాన్ని ఈ నెల ఆఖ‌రులో నిర్వహించేందుకు చంద్రబాబు స‌న్నాహాలు చేస్తున్నారు. అయితే, క‌రోనా లాక్‌డౌన్ నేప‌థ్యంలో ఈ కార్యక్రమం నిర్వహ‌ణ విష‌యంలో బ‌హిరంగ‌మా.. లేక ఎక్కడైనా కొద్దిమందితో నిర్వహ‌ణా ? అనే విష‌యంలో మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంద‌ని స‌మాచారం. కానీ, ఎట్టి ప‌రిస్థితిలోనూ నిర్వహించి తీరాల‌నేది మాత్రం చంద్రబాబు తీసుకున్న గ‌ట్టి నిర్ణయంగా ప్రచారం జరుగుతోంది.

యువనేతలకు…..

సో.. మొత్తానికి ఈ నెల ఆఖ‌రులో నిర్వహించ‌బోయే మ‌హానాడు అత్యంత కీల‌క‌మ‌ని టీడీపీ సీనియ‌ర్ నేత‌ల నుంచి వినిపిస్తున్న టాక్‌. దీనికి రెండు ప్రధాన కార‌ణాలు ఉన్నాయ‌ని కూడా వారే చెబుతున్నారు. ఒక‌టి.. పార్టీ ఘోర ప‌రాజ‌యం త‌ర్వాత నిర్వహిస్తున్న మ‌హానాడు. ఈ క్రమంలో భ‌విష్యత్తుకు సంబంధించిన కీల‌క దిశానిర్దేశం స‌హా.. యువ నేత‌ల‌ను ఆక‌ర్షించేందుకు చంద్రబాబు వేసే వ్యూహాలు.. మ‌రోవైపు వైసీపీ నుంచి ఎదుర‌వుతున్న రాజ‌కీయ వ్యూహాలు వంటివి కూడా ప్రధానంగా చ‌ర్చకు వ‌స్తాయ‌ని ఇది కీల‌క‌మ‌ని చెబుతున్నారు. అదేస‌మ‌యంలో మ‌రో అత్యంత కీల‌క‌మైన విష‌యాన్ని కూడా ప్రస్థావిస్తున్నారు.

కొత్త పదవితో…..

అదే.. ఇప్పుడు కొత్తగా టీడీపీలో మ‌రో కీల‌క ప‌ద‌విని సృష్టించేందుకు చంద్రబాబు ప్రయ‌త్నిస్తున్నార‌ని, ఇటీవ‌ల ఈ విష‌యంపై పొలిట్ బ్యూరోలో కూడా చ‌ర్చ చేశార‌ని అంటున్నారు. అదే.. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి. నిజానికి ఇప్పటి వ‌రకు టీడీపీలో ఇలాంటి ప‌ద‌వి అంటూ ఏదీ లేదు. కానీ, ఇప్పుడు పార్టీలో ఈ ప‌ద‌విని సృష్టించాల‌ని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నార‌ని అంటున్నారు. దీనికి ప్రధాన కార‌ణం.. రాబోయే రోజుల్లో త‌న కుమారుడికి పార్టీ అప్పగించాల‌నే వ్యూహంతో చంద్రబాబు ఉన్నార‌ని చెబుతున్నారు.

ఇప్పటికిప్పుడు పగ్గాలు….

అయితే, ఇప్పటికిప్పుడు ఆయ‌న‌కు పార్టీ ప‌గ్గాలు అప్పగించ‌కుండా.. పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌గా మార్చి.. ప్రతి కార్యక్రమం కూడా ఆయ‌న క‌నుస‌న్నల్లో జ‌రిగేలా.. లోకేష్ ప్రాధాన్యం మ‌రింత పెరిగేలా.. పార్టీలో ప‌ట్టు పెంచుకునేలా చేసేందుకు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని సృష్టించాల‌ని చంద్రబాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు. వాస్తవానికి గ‌త ఏడాది పార్టీ గెలుపు గుర్రం ఎక్కి… మ‌హానాడు నిర్వహించి ఉంటే.. అప్పట్లోనే దీనిని ప్రక‌టించి చిన‌బాబుకు ప‌ట్టాభిషేకం చేసేవార‌ని చెబుతున్నారు. ఇక‌, ఈ నెల ఆఖ‌రులో నిర్వహించే మ‌హానాడులో దీనిపై క్లారిటీ ఉంటుంద‌ని అంటున్నారు. కాగా, ప్రస్తుతం లోకేష్ టీడీపీ జాతీయ ప్రధాన కార్య‌ద‌ర్శిగా ఉన్న విష‌యం తెలిసిందే.

Tags:    

Similar News