పెద్దాయనా… చాల్లే సంబడం.. ఇక చాలించు

తెలగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒకప్పుడు తాను చేసిన అలవాటే ఇప్పుడు శాపంగా మారుతుంది. ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభానికి ఆద్యుడు చంద్రబాబే అని [more]

Update: 2021-03-02 06:30 GMT

తెలగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఒకప్పుడు తాను చేసిన అలవాటే ఇప్పుడు శాపంగా మారుతుంది. ఎన్నికల్లో డబ్బులు పంపిణీ చేసే ప్రక్రియను ప్రారంభానికి ఆద్యుడు చంద్రబాబే అని చెప్పాలి. చంద్రబాబు రాజకీయం మూడు దశాబ్దాలుగా చూసిన వారికి ఎవరికైనా ఇది తెలుస్తుంది. అప్పట్లో ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గం ఉండేది. 2001 లో అనుకుంటా. ఉయ్యూరు నియోజవకర్గంలో ఉప ఎన్నిక జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నే బాబూరావు మరణంతో ఉప ఎన్నిక జరిగింది. ఆయన సతీమణి విజయలక్ష్మికే టిక్కెట్ ఇచ్చారు. సానుభూతి పనిచేస్తుందని తెలిసినా అప్పుడు ముఖ్యమంత్రి గా ఉన్న చంద్రబాబు ఈ నియోజకవర్గంలో గెలిచేందుకు ఓటర్లను డబ్బులతో ప్రలోభపెట్టారని ఆరోపణలు వచ్చాయి.

దగ్గర నుంచి చూసిన వాళ్లకు….

ఈ విషయం చంద్రబాబును దగ్గర నుంచి చూసిన నేతలు, జర్నలిస్టులకు తెలుసు. అప్పటి నుంచే ఎన్నికల్లో డబ్బు ప్రవాహం మరింత ఎక్కువయిందని అంటారు. అప్పటి వరకూ గ్రామాల్లో ప్రజలకు ఉపయోగపడే కమ్యునిటి భవనాలు, ఆలయాలు, మసీదు, చర్చిల నిర్మాణాలకో, మరమ్మత్తులకో రాజకీయ పార్టీలు విరాళ రూపంలో ఇచ్చి ఓటర్లను ఆకట్టుకునే వారు. కాకుంటే కొందరు నేతలు ఓటుకు యాభై, వందో ఇచ్చినట్లు ఆరోపణలు అప్పట్లో వినపడ్డాయి.

1999 ఎన్నికల నుంచే….

కానీ 1999 ఎన్నికల నుంచే చంద్రబాబు డబ్బు ప్రభావాన్ని ఎన్నికల్లో మరింత పెంచారు. అప్పటి వరకూ గ్రామాల వారీగా, సామాజిక వర్గాల వారీగా ఎన్నికల ప్రయోజనాలు చేకూర్చే పరిస్థిితి నుంచి వ్యక్తిగతంగా ప్రయోజనం చేకూర్చేలా దిశను మార్చింది ఖచ్చితంగా చంద్రబాబే. దీనిని ఆ పార్టీ నేతలు కూడా ఎవరూ కాదనలేరు. ఓటుకు వంద రూపాయలు ఇచ్చే రోజుల నుంచి వెయ్యి నుంచి రెండు వేలకు పెంచిన ఘనత కూడా ఆయనదే నంటారు. అధికారం కోసం 1999లో చంద్రబాబు అనుసరించిన వైఖరి ఇప్పుడు ఆయనకు రివర్స్ లో కొడుతుందంటున్నారు.

అదే బాట పడితే తప్ప….?

అందుకే ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో డబ్బులు పంచిపెట్టారని, కోట్లాది రూపాయలు వెచ్చించారని చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు చెల్లనవిగానే చూడాలి. కుప్పం నియోజకవర్గంలో నలభై కోట్లు పంచిపెడితేనే గెలిచారని చెప్పడం, ప్రజాస్వామ్యం ఓడిపోయిందన్న పెద్ద పెద్ద డైలాగులు చెప్పడం వినసొంపుగా లేవు. ఎందుకంటే తాను చూపించిన బాటనే అవతలి వాళ్లూ నడుస్తున్నారన్నది ఇప్పటికైనా చంద్రబాబుకు అర్థమయి ఉండాలి. అందుకే రానున్న ఎన్నికల్లోనూ అదే బాట పడితే తప్ప గెలుపు పిలుపు వినిపించదు. వినడానికి, రాయడానికి ఇది కొంచెం కష్టంగా ఉన్నా ఇదే నిజం. ఇప్పుడంతా డబ్బు మయం.

Tags:    

Similar News