ఏం చేయాలనుకున్నారు? ఏం చేస్తున్నారు?

రాజ‌కీయ అప‌ర‌చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఏం చేయాల‌ని ఆయ‌న అనుకుంటున్నారు? కానీ, ఏ మార్గంలో న‌డుస్తున్నారు? ఇప్పుడు [more]

Update: 2019-11-15 08:00 GMT

రాజ‌కీయ అప‌ర‌చాణిక్యుడిగా పేరు తెచ్చుకున్న టీడీపీ అధినేత‌, మాజీ సీఎం చంద్రబాబు ఏం చేస్తున్నారు? ఏం చేయాల‌ని ఆయ‌న అనుకుంటున్నారు? కానీ, ఏ మార్గంలో న‌డుస్తున్నారు? ఇప్పుడు ఇవే ప్రశ్నలు టీడీపీలోనే వినిపిస్తున్నాయి. ఎన్నిక‌ల‌కు ముందు, అంటే ఐదు మాసాల‌కు ముందు, ఇప్పుడు ఆయ‌న వ్యవ‌హార శైలిలో తీవ్ర‌మైన మార్పు వ‌చ్చింది. అంతా తానే అయి పార్టీని న‌డిపించి అధికారంలోకి తీసుకురావాల‌ని క‌ల‌లు క‌న్నారు. దీనికి 2017లో జ‌రిగిన నంద్యాల ఉప ఎన్నిక‌ల ప‌లితం కొంత‌మేర‌కు ఆయ‌న‌లో బూస్ట్ నింపింది. ఈ ఉప ఎన్నిక ఫ‌లితం త‌ర్వాత టీడీపీలో ఉన్న ఆత్మ విశ్వాసం కాస్తా అతి విశ్వాసం అయ్యింది.

నంద్యాల ఫార్ములా అంటూ….

అయితే, ఈ ఫార్ములా ఇటీవ‌ల ఏప్రిల్‌లో జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో మాత్రం బెడిసి కొట్టింది. ఒంట‌రి పోరుతో అధికారంలోకి వ‌చ్చేందుకు చంద్రబాబు చేసిన తీవ్రమైన ప్రయ‌త్నం ఫ‌లించ‌క‌పోగా.. గౌర‌వ ప్రద‌మైన స్థానాల‌ను కూడా ద‌క్కించుకోలేక పోయారు. దీంతో అప్పటి వ‌ర‌కు ఏదో చేయాల‌ని అనుకున్న చంద్రబాబు జావ‌గారిపోయారు. ఇక‌, ఎన్నిక‌ల అనంత‌రం కూడా త‌న‌ను క‌లుపుకొని వెళ్లే వారి కోసం దాదాపు ఆయ‌న ఎదురు చూసింది లేదు. కానీ, పార్టీలో అంత‌ర్గత కుమ్ములాట‌లు, త‌మ్ముళ్ల ప‌లాయ‌నం వంటివి తెర‌మీదికి వ‌చ్చాక పార్టీని బ‌తికించుకోవాలంటే.. త‌న ఒక్కడి వ‌ల్లా కాద‌ని అనుకున్నారు.

నాలుగు మెట్లు దిగి వచ్చి….

ఈ క్రమంలోనే గ‌తంలో అంటే ఎన్నిక‌ల‌కుముందు ఎవ‌రిని తాను శ‌త్రువులు అని తిట్టిపోశారో.. వారినే విశాఖ వేదిక‌గా భుజాల‌కు ఎత్తుకున్నారు. బీజేపీని తిట్టిపోసినా, మోడీ హ‌ఠావో నినాదం ఇచ్చి దేశం అంతా తిరిగినా.. జ‌మ్ము క‌శ్మీర్ నుంచి అబ్దుల్లాను తీసుకువ‌చ్చి జ‌గ‌న్‌ను తిట్టిపోయించినా.. ఇదంతా రాష్ట్రం కోసం, ప్రజ‌ల కోసం చేసిన త్యాగంగా చెప్పుకొచ్చి… బీజేపీకి చేరువ‌య్యారు. అదే క్రమంలో జ‌న‌సేనానితోనూ చెలిమికి చేతులు చాపారు. అయితే, బాబు ఇలా రెండు నుంచి నాలుగు మెట్లు దిగి.. త‌న త‌ప్పును ఒప్పుకొన్నా.. ఆ రెండు పార్టీలు మాత్రం అంటే బీజేపీ, జ‌న‌సేన‌లు గ‌తంలో చంద్రబాబును తిట్టిపోసినా.. అవి మాత్రం లెంప‌లు వేసుకోలేదు.

విలీనం చేయాలంటూ….

పైగా టీడీపీని విలీనం చేయాల‌ని బీజేపీ ఇంకా డిమాండ్ చేస్తోంది. జ‌న‌సేన అయితే, అప్పటి మాట‌ల ( బాబువృద్ధుడు అయ్యాడు రిటైర్మెంట్ ప్రక‌టిద్దాం. నోట్లో నాలుక లేని చినబాబును ఇంటికి పంపిద్దాం)పై క‌నీసం వివ‌ర‌ణ కూడా ఇచ్చుకోలేదు. అయినా కూడా చంద్రబాబు ఈ రెండు పార్టీల కోసం ఎత్తిన‌ చేతులు దించ‌డం లేదు. ఇక రాజ‌కీయంగా చంద్రబాబు అనుభ‌వం ఎక్కడ ? ప‌వ‌న్ ఎక్కడ ? ఎన్నిక‌ల్లో ఇంత ఘోరంగా ఓడిపోయాక నిల‌క‌డ లేని రాజ‌కీయాలు చేసే ప‌వ‌న్ వెంట అంత‌గా పాకులాడాల్సిన అవ‌స‌రం ఏంట‌ని ? కూడా పార్టీ నేత‌లు ప్రశ్నిస్తున్నారు. దీంతో అస‌లు చంద్రబాబు ఏం చేయాల‌ని అనుకున్నారు? ఏం చేస్తున్నారు? అని త‌మ్ముళ్లు చ‌ర్చించుకోవ‌డం ఆశ్చర్యంగా అనిపించ‌క‌పోయినా.. చంద్రబాబుపై మాత్రం త‌మ్ముళ్లలో నెల‌కొన్న అనేక సందేహాల‌కు ఆన్సర్ లేకుండా ఉంది.

Tags:    

Similar News