పెత్తనం ఎక్కువైనా.. ప్రమాద‌మేనేమో.. బాబూ..!

సుప్తచేత‌నావ‌స్థలో ఉన్న టీడీపీని ప‌రుగులు పెట్టించాల‌ని టీడీపీ అధినేత‌గా చంద్రబాబు వ్యూహం. అరె మాకు పెత్తనం చేసే అవ‌కాశం లేదే.. ఇన్నేళ్లుగా మేం పార్టీలోనే ఉన్నాం.. అని [more]

Update: 2020-10-04 05:00 GMT

సుప్తచేత‌నావ‌స్థలో ఉన్న టీడీపీని ప‌రుగులు పెట్టించాల‌ని టీడీపీ అధినేత‌గా చంద్రబాబు వ్యూహం. అరె మాకు పెత్తనం చేసే అవ‌కాశం లేదే.. ఇన్నేళ్లుగా మేం పార్టీలోనే ఉన్నాం.. అని సీనియ‌ర్ల ఆవేద‌న‌. వెర‌సి.. విరుగుడు మంత్రం అయితే.. క‌నిపెట్టారు. లెక్కలేన‌న్ని ప‌ద‌వులు సృష్టించారు. ప్రతి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గానికీ క‌మిటీ వేశారు. ఆ క‌మిటీకి కీల‌క నేత‌ను ఇంచార్జ్‌గా నియ‌మించారు. వీటిపై ప్రతి రెండు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌లుపుతూ.. ఒక ఇంచార్జ్ (స‌మ‌న్వయ క‌ర్త)ను నియ‌మించారు. దీంతో మ‌రో ప‌ద‌మూడు మందికి ప‌ద‌వులు ద‌క్కాయి.

పార్టీ పరుగులు పెడుతుందా?

మొత్తానికి తీవ్ర అసంతృప్తితో ర‌గిలిపోతున్న త‌మ్ముళ్లపై చంద్రబాబు ప‌దువుల‌నే చంద‌న‌పు గాలులు వీచేలా చేశారు. ఇంత‌వ‌ర‌కు బాగానే ఉంది. భారీ రేంజ్‌లో త‌మ్ముళ్ల‌కు ప‌ద‌వులు ద‌క్కుతాయి. ఇక‌, ప‌ద‌వి లేని నాయ‌కుడు పార్ట‌లో క‌నిపించ‌ని విధంగా కూడా చేసేశారు. అయితే, ఇది ఎంత‌వ‌ర‌కు పార్టీని ముందుకు తీసుకువెళ్తుంది ? కేవ‌లం ప‌ద‌వులు ఇచ్చి స‌రిపెడితే.. పార్టీ ప‌రుగులు తీస్తుందా ? లేక నిర్మాణాత్మక‌మైన విధానంతో పార్టీ ముందుకు న‌డుస్తుందా? అన్నదే ఇప్పుడు కీల‌క ప్రశ్న. పాత్రలు మారినా.. పాయ‌సం రంగు, రుచి మార‌న‌ట్టుగా ఉంద‌నే కామెంట్లు వినిపించ‌డానికి కార‌ణ‌మేంటి ?

అన్ని వర్గాలకూ….

టీడీపీలో సంస్థాగ‌తంగా అన్ని వ‌ర్గాల‌కు ప్రాధాన్యం ద‌క్కాల‌నేది కీల‌క సూత్రం. గ‌డిచిన ఐదేళ్ల అధికార కాలంలో పార్టీ ఈ సూత్రాన్ని ప‌క్కన పెట్టి.. కేవ‌లం కొన్ని సామాజిక వ‌ర్గాల‌కే ప్రాధాన్యం ఇచ్చింది. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ నేత‌లు తీవ్రంగా మ‌ద‌‌న ప‌డ్డారు. ఇప్పుడు వారిలో కొంద‌రికి ప‌ద‌వులు ఇచ్చారు. అయితే.. వ్యవ‌స్థీకృతంగా ఈ విధానం మ‌రింత ఆధిప‌త్యానికి దారితీస్తే.. మ‌రింత ప్రమాదం పొంచి ఉంటుంద‌నేది విశ్లేష‌కుల వాద‌న‌. క్షేత్రస్థాయిలో పార్టీని బ‌లోపేతం చేయాలంటే.. పార్టీలోని విధి విధానాల‌ను స‌మూలంగా ప్రక్షాళ‌న చేయాల‌నే వాద‌న కొన్నాళ్లుగా సీనియ‌ర్ల నుంచే వినిపిస్తోంది. దీనిని వ‌దిలి.. సాము చేస్తే.. పార్టీకి ఒన‌గూరే ప్రయోజనం లేద‌నే వీరి సూచ‌న‌.

పరిష్కారం చూపలేవా?

ప్రతి నిర్ణయానికీ ఓ ప‌రిశీల‌న పేరుతో తాత్సారం చేసే ల‌క్షణం ఇటీవ‌ల కాలంలో పార్టీ పెన‌వేసుకుంది. దీనినిముందు విడిచి పెట్టాలి. మంచో చెడో.. కింది స్థాయి నేత‌ల ఆలోచ‌న‌ల‌కు విలువ ఇవ్వాలి. నేనే సీనియ‌ర్‌.. మీరు నామాటే వినాలి.. అనే ధోర‌ణిని వ‌దిలి పెట్టాలి. కానీ, ఇప్పుడు కూడా అది జ‌ర‌గ‌డం లేదు. ఇలా అయితే, క‌ష్టాలు కొన‌సాగుతాయే త‌ప్ప.. ప‌ద‌వులు ప‌రిష్కారం చూపించ‌లేవు. మ‌రి చంద్రబాబు ఏం చేస్తారో.. చూడాలి.

Tags:    

Similar News