బాబు కాగితం పులేనా? ఎవరూ లెక్క చేయడం లేదా?

ఒక‌సారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు ఆయ‌న ఏపీని పాలించారు. దాదాపు పాతికేళ్లకు పైగా పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే, ఇది చ‌రిత్రగా [more]

Update: 2020-09-04 00:30 GMT

ఒక‌సారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా మూడు సార్లు ఆయ‌న ఏపీని పాలించారు. దాదాపు పాతికేళ్లకు పైగా పార్టీకి అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే, ఇది చ‌రిత్రగా మిగిలిపోవ‌డ‌మేనా ? ఆయ‌న‌కంటూ.. ఆయ‌న మాట వినేవారంటూ.. నాయ‌కుల‌ను స్థిర‌ప‌రుచుకోలేరా ? ఇప్పుడు ఏనోట విన్నా.. ఇదే మాట వినిపిస్తోంది. ఆయ‌నే టీడీపీ అధినేత చంద్రబాబు. ఇప్పుడున్న రాజ‌కీయ నేత‌ల్లో చంద్రబాబు చాలా సీనియ‌ర్‌. ఇక‌, ఏపీని సుదీర్ఘకాలం పాలించిన సీఎంల‌లో ఆయ‌నే తొలిస్థానంలో ఉన్నారు. అలాంటి నాయ‌కుడు.. ఇప్పుడు ఇంటా బ‌య‌టా కూడా తీవ్ర విమ‌ర్శలు ఎదుర్కొంటున్నారు. అది కూడా ఆయ‌న స్థాయికి త‌గ‌ని నేత‌లు, ఆయ‌న సొంత పార్టీ నాయ‌కుల‌తోనే విమ‌ర్శలు ఎదుర్కొంటున్నారు.

రెండుసార్లు సీట్లు ఇచ్చినా…..

తాజాగా విశాఖ జిల్లా ఎల‌మంచిలి మాజీ ఎమ్మెల్యే పంచ‌క‌ర్ల ర‌మేశ్‌బాబు.. టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ‌కీయాల్లో ఇదంతా స‌హ‌జ‌మే. అయితే, ఆయ‌న పార్టీ మారుతూనే చంద్రబాబుపై తీవ్ర విమ‌ర్శలు చేశారు. ఆయ‌న కులాల రాజ‌కీయం చేస్తున్నార‌ని, త‌న వారిని మాత్రమే అభివృద్ధి చేసుకోవాల‌ని ప్రయ‌త్నించార‌ని దుయ్యబ‌ట్టారు. వాస్తవానికి గ‌త ఏడాది చంద్రబాబు ఇచ్చిన టికెట్‌పై పోటీ చేసిన ఈయ‌న ఇప్పుడు ఇంత ఎందుకు తీసిపారేశారు ? చ‌ంద్రబాబు కేవ‌లం పార్టీలో కాగితం పులేనా ? అనే సందేహాల‌కు తావిచ్చేలా చేశారు. ర‌మేష్‌కు 2014లోనే పార్టీ మారి వ‌చ్చినా స్థానిక నేత‌ల‌ను కాద‌ని మ‌రీ య‌ల‌మంచిలి సీటు ఇచ్చారు. ఇక మొన్న ఎన్నిక‌ల్లో మ‌రోసారి సీటు ఇచ్చారు.

పార్టీ మారి ఆటాడుకుంటూ….

ఇక‌, ఇప్పటికే పార్టీ మారిన గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మ‌ద్దాలి గిరి రాజకీయంగా పుట్టి.. ప‌ట్టుమ‌ని ప‌దేళ్లు కాలేదు. కానీ, గిరి కూడా చంద్రబాబును ఏక‌వ‌చ‌నంతో ఏకేస్తున్నారు. గిరి సైతం చంద్రబాబు కుల రాజ‌కీయం చేస్తూ.. త‌న కులానికే ప్రయార్టీ ఇస్తున్నార‌ని తీవ్ర విమ‌ర్శలు చేశారు. ఇక‌, గ‌తంలోపార్టీ మారిన తూర్పు గోదావ‌రి జిల్లాకు చెందిన తోట త్రిమూర్తులు కూడా చంద్రబాబును ఉతికి ఎండేశారు. త్రిమూర్తులు సైతం గ‌త ఎన్నిక‌ల్లో చంద్రబాబు, లోకేష్ త‌మ కులం క్యాండెట్ల‌కే ఎక్కువ డ‌బ్బులు ఇచ్చార‌ని ఆరోపించారు. తోట రెండు సార్లు పార్టీలు మారినా బాబు సీటు ఇచ్చారు. ఆయ‌న కూడా ఇప్పుడు బాబును ఓ ఆటాడుకుంటున్నారు.

కులం అంటగడుతూ…..

ఇలా అనేక మంది నాయ‌కులు అనేక జిల్లాల‌లో ఇలానే ఉన్నారు. ఇలా ఎందుకు జ‌రుగుతోంది. పైగా చంద్రబాబుఎంతో ప్రేమ‌గా పార్టీలో చేర్చుకున్న వైసీపీ మాజీ నాయ‌కులు ఇప్పుడు బాబును ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు. పేరుకే పార్టీలో ఉన్నారు త‌ప్ప చంద్ర బాబు ఫోన్ చేసినా.. ప‌ట్టించుకోవ‌డం లేదు. ఇక నిన్నటి వ‌ర‌కు పార్టీలో ఉంటోన్న వారు.. పార్టీ మారిన వెంట‌నే బాబుపై తీవ్ర విమ‌ర్శలు చేయ‌డంతో పాటు బాబుకు కుల రాజ‌కీయం అంట‌క‌ట్టేస్తున్నారు. ఏదేమైనా ఈ ప‌రిణామాల‌కు కార‌ణం.. ఎవ‌రు? చ‌ంద్రబాబు కాదా? ఆయ‌న ఇచ్చిన అలుసా? లేక ఆయ‌న పార్టీలో నేత‌ల‌ను మేనేజ్ చేయ‌డంలో చోటు చేసుకున్న లోప‌మా? ఏదేమైనా.. చంద్రబాబు త‌న వాల్యూతోపాటు పార్టీ విలువ‌ను కూడా పోగొట్టుకుంటున్నార‌నే వ్యాఖ్యలు ఇప్పుడు ఎక్కువుగా వినిపిస్తున్నాయి.

Tags:    

Similar News