చంద్రబాబుపై మ‌రో టీడీపీ సీనియ‌ర్ గుస్సా…!

త‌న‌కు ప‌టిష్టమైన యంత్రాంగం ఉంద‌ని, ప్రతి ఎమ్మెల్యేపై త‌న‌కు అవ‌గాహ‌న ఉంద‌ని, రాష్ట్రంలోని ప్రతి నియోజ‌క‌వ‌ర్గంపైనా త‌న‌కు పట్టు ఉంద‌ని, ఎవ‌రికి ఎక్కడ టికెట్ ఇస్తే.. గెలుస్తారో [more]

Update: 2020-08-30 00:30 GMT

త‌న‌కు ప‌టిష్టమైన యంత్రాంగం ఉంద‌ని, ప్రతి ఎమ్మెల్యేపై త‌న‌కు అవ‌గాహ‌న ఉంద‌ని, రాష్ట్రంలోని ప్రతి నియోజ‌క‌వ‌ర్గంపైనా త‌న‌కు పట్టు ఉంద‌ని, ఎవ‌రికి ఎక్కడ టికెట్ ఇస్తే.. గెలుస్తారో త‌న‌కు తెలుసున‌ని ప‌దే ప‌దే చెప్పే.. టీడీపీ అధినేత గ‌త ఏడాది ఎన్నిక‌లకు ముందు వ్యవ‌హ‌రించిన మొండి వైఖ‌రి.. చాలా మంది నేత‌ల‌కు ద‌శ‌దిశ లేకుండా చేసింది. ఇలాంటి వారిలో ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా ఉండి నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే క‌లువ‌పూడి శివ ఒక‌రు. ఆయ‌న‌కు ఇప్పుడు బాబు అన్నా.. చంద్రబాబు రాజ‌కీయాల‌న్నా.. ఆయ‌న వ్యూహాల‌న్నా చిర్రెత్తుకొస్తోంది.

పార్టీలో కష్టపడి పనిచేస్తున్నా…..

దీంతో టీడీపీకి దూరంగా ఉంటూ.. త‌న సొంత వ్యాపారాలు చేసుకుంటున్నారు. మ‌రి ఇంత‌గా చంద్రబాబుపై ఆగ్రహం రావ‌డానికి కార‌ణాలేంటి? అనే విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. ఉండి నుంచి శివ 2009, 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున‌ గెలుపు గుర్రం ఎక్కారు. క్షత్రియ సామాజిక వ‌ర్గానికి చెందిన శివ .. ఇక్కడ పార్టీని బ‌లోపేతం చేశారు. రెండు సార్లు గెలుపు గుర్రం ఎక్కడం, క్షత్రియ సామాజ‌క వ‌ర్గానికి చెంది నేత కావ‌డంతో త‌న‌కు చంద్రబాబు కేబినెట్‌లో బెర్త్ ద‌క్కుతుంద‌ని ఆశించారు. అయితే, చంద్రబాబు ఆయ‌న‌కు మొండి చేయి చూపించారు.

టిక్కెట్ విషయంలోనూ…..

2017 కేబినెట్ లో మార్పులు, చేర్పుల్లో మంత్రి ప‌ద‌వి కోసం శివ చేయ‌ని లాబీయింగ్ లేదు. అయితే చంద్రబాబు మాత్రం క్షత్రియ కోటాలో అశోక్ గ‌జ‌ప‌తిరాజు కేంద్ర మంత్రిగా ఉన్నార‌ని సాకుతో శివ‌కు మొండి చేయి చూపించారు. అయిన‌ప్పటికీ.. పార్టీలో కీల‌క నేత‌గానే ఉన్నారు శివ‌. ఇక‌, ఆ త‌ర్వాత‌.. గ‌త ఏడాది ఎన్నిక‌ల సమ‌యంలో త‌న స‌న్నిహితుడు రామ‌రాజును వెంటేసుకుని టికెట్ కోసం చంద్రబాబును క‌లిశారు శివ‌. అయితే, రామ‌రాజుకు ఉండి టికెట్ ఇచ్చిన బాబు.. శివ కాదంటున్నా ప‌ట్టుబ‌ట్టి.. న‌ర‌సాపురం ఎంపీ టికెట్ నుంచి పోటీకి దింపారు.

కండిషన్లు పెట్టడంతో…..

నిజానికి త‌న‌కు ఎమ్మెల్యే టికెట్ చాల‌ని అన్నా.. చంద్రబాబు వినిపించుకోలేదు. నువ్వు ఎంపీగా పోటీ చేస్తేనే రామ‌రాజుకు ఎమ్మెల్యే సీటు ఇస్తాన‌న్న చంద్రబాబు కండీష‌న్‌కు శివ త‌లొగ్గారు. దీంతో బ‌ల‌వంతంగానే అక్కడ పోటీ చేశారు. అయితే, ఈ స‌మ‌యంలో పార్టీ నుంచి అందాల్సిన పోలింగ్ నిధులు శివకు అంద‌లేద‌ని అస‌హ‌నం శివ‌లో ఉంది. అంతేకాదు, న‌ర‌సాపురం, తాడేప‌ల్లిగూడెం నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌స‌లేని నేత‌ల‌ను చంద్రబాబు రంగంలోకి దింపారు. శివ‌కు ఇష్టంలేక‌పోయినా.. ఓడిపోయిన వారికి టికెట్లు ఇచ్చారు. ఈ ప్రభావం ఎంపీగా పోటీ చేసిన శివ‌పై ప‌డింది.

అందుకే దూరంగా…..

అయిన‌ప్పటికీ.. త‌న ఇమేజ్‌తో హోరా హోరీ పోరు స‌ల్పి.. జ‌గ‌న్ గాలి హోరుగా ఉన్నప్పటికీ కేవ‌లం 25 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక‌, అప్పటి నుంచి ఆయ‌న చంద్రబాబు వ్యవ‌హారంపై గుస్సాగా ఉన్నారు. క‌నీసం త‌న మాట విని ఏ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినా.. గెలిచి ఉండేవాడిన‌ని, లేదా తాన‌ను సూచించిన వారికి టికెట్ ఇచ్చి ఉన్నా గెలుపు గుర్రం ఎక్కేవాడిన‌ని ఆయ‌న ఆవేద‌న‌. ఈ క్రమంలోనే ఆయ‌న పార్టీకి పూర్తిగా దూరంగా ఉండ‌డంతో పాటు త‌న వ్యాపారాల్లో మునిగిపోయారు.

Tags:    

Similar News