తలుపులేసేస్తున్నా కూడా…?

చంద్రబాబునాయుడు ఫక్త్ రాజకీయ నాయకుడు. అది అందరికీ తెలిసిందే. సాధారణంగా రాజకీయ నాయకులకు పట్టు విడుపులు ఉంటాయి. లేకపోతే వారి రాజకీయం సాగదు, ఇక మరో విషయం [more]

Update: 2020-08-24 14:30 GMT

చంద్రబాబునాయుడు ఫక్త్ రాజకీయ నాయకుడు. అది అందరికీ తెలిసిందే. సాధారణంగా రాజకీయ నాయకులకు పట్టు విడుపులు ఉంటాయి. లేకపోతే వారి రాజకీయం సాగదు, ఇక మరో విషయం కూడా ఉంది, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఉండరని, సరిగ్గా ఇదే పాయింట్ చంద్రబాబు బాగా నమ్ముతున్నారు. కానీ ఇది కూడా అన్ని వేళలా పనిచేయదు. చేసి ఉంటే ఎపుడో యాభై ఏళ్ల క్రితం విడిపోయిన ఉభయ వామపక్షాలు నేటికీ ఎందుకు కలవవు. ఇక కాంగ్రెస్ నుంచి విడిపోయి అధికారం చలాయిస్తున్న అనేక ప్రాంతీయ పార్టీలు మాతృ సంస్థలో ఎందుకు వీలీనం కావడంలేదు. అంటే ఒక స్థాయి వరకూ ఏదైనా రాజకీయాల్లో వర్తిస్తుంది అన్నది కూడా గుర్తు పెట్టుకోవాలి.

బిగుసుకుపోతున్నా …..

చంద్రబాబు బీజేపీతో చెలిమికి చేయని ప్రయత్నం లేదు. ఓడిపోయిన మరుసటి రోజే ఆయనకు జ్ఞానోదయం కలిగింది. తను ఎందుకు ఓడానో తెలిసివచ్చింది. బీజేపీని వీడడం అతి పెద్ద తప్పు అని కూడా అర్ధమైంది. ఆ వెంటనే చంద్రబాబు ఎలాంటి సంకోచాలు, బిడియాలు పెట్టుకోకుండా బీజేపీ తలుపు తడుతూనే ఉన్నారు. ఇలా ఏడాది అయింది చంద్రబాబు కాషాయం శిబిరం వద్ద వేచి వేసారి. కానీ కమలం పార్టీ మాత్రం బిగుసుకుని కూర్చుంది. చంద్రబాబు ఎంత తగ్గుతున్నా బీజేపీ మాత్రం హెచ్చుతూనే ఉంది. బాబుని పూర్తిగా పక్కన పెడుతోంది కూడా.

బలహీనతతో …..

బలం లేకపోయినా బాగున్నామని చెప్పాలి. ఇది కూడా రాజకీయమే. కానీ అన్నీ తెలిసిన రాజకీయ చాణక్యుడు చంద్రబాబు మాత్రం తన బలహీనతను బయటేసుకుంటున్నారు. ఇపుడు రెండు తెలుగు రాష్ట్రాలే కాదు, జాతీయ స్థాయిలోనూ చంద్రబాబు వీక్ నెస్ తెలిసిపోయింది. పొత్తులు లేకపోతే చంద్రబాబు పార్టీ బతికి బట్టలేదని కూడా అందరికీ అర్ధమైపోయింది. దాంతో సరిగ్గా ఈ పాయింటుతోనే బీజేపీ చెడుగుడు ఆడేస్తోంది. బాబు కు నిన్నా నేడూ గుర్తు చేసి మరీ తిట్ల పురాణం అందుకుంటోంది.

కష్టమేనా …?

చంద్రబాబు ఇపుడు ఆడుతున్న రాజకీయం ఆయనకే కాదు, పార్టీకి కూడా పెను సవాల్ లాంటిది. బీజేపీ లేకపోతే తాను లేను అన్న భావనను చంద్రబాబు కలిగిస్తున్నారు. కేవలం 0.84 శాతం ఓట్లు వచ్చిన బీజేపీ కోసం చంద్రబాబు పాకులాడుతున్న తీరుతో టీడీపీ నాలుగు దశాబ్దాల అనుభవం కూడా నలిగిపోతోంది. పార్టీ క్యాడర్ నైతిక స్థైర్యం కూడా దెబ్బతింటోంది. మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు ఆడుతున్న ఈ రాజకీయ జూదం మొత్తం టీడీపీ అస్థిత్వాన్నే దెబ్బ తీసేలా ఉంది. ఇంకో వైపు చూసుకుంటే చంద్రబాబు ఎంత వంగుతారా. లొంగుతారా అని బీజేపీ పెద్దలు చూస్తున్నారు. వారు కోరుకున్న టార్గెట్ కి టీడీపీ క్షీణత చేరిన నాడు అసలు ఆపరేషన్ స్టార్ట్ అవుతుంది. మొత్తానికి ఏపీలో అనేక ఎన్నికల్లో గెలిచిన టీడీపీని కనీసం వార్డు స్థాయిలో కూడా గెలవని బీజేపీ నేతలు గట్టిగా తగులుకుంటున్నారంటే అది చంద్రబాబు ఇచ్చిన అలుసే అనుకోవాలి.

Tags:    

Similar News