జగన్ ట్రాప్ లో పడిపోయినట్లేగా?

తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. ఎంతో మందికి రాజకీయ బిక్ష పెట్టిన పార్టీ. కాంగ్రెస్ మూడు దశాబ్దాల పాలనకు కూకటి [more]

Update: 2020-08-12 02:00 GMT

తెలుగుదేశం పార్టీ అంటే కార్యకర్తల పార్టీ. ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ. ఎంతో మందికి రాజకీయ బిక్ష పెట్టిన పార్టీ. కాంగ్రెస్ మూడు దశాబ్దాల పాలనకు కూకటి వేళ్ళతో పెకిలించిన పార్టీ. రాజకీయాల‌ గురించి సామాన్య జనాల్లో చైతన్యం తెచ్చిన టీడీపీ గురించి తలచుకుంటే ఒక చరిత్ర గుర్తుకువస్తుంది. అటువంటి టీడీపీని మామ ఎన్టీఆర్ తరువాత మరో పాతికేళ్ల పాటు నిలిపి ఉంచిన ఘనత అచ్చంగా చంద్రబాబుదే. తనకు పార్టీ కంటే వేరే ఏదీ లేదని చంద్రబాబు తరచూ చెప్పుకుంటారు. మరి అటువంటి చంద్రబాబుకు పార్టీ కంటే కూడా ఆమరావతి ముఖ్యమైందిగా ఇపుడు.

తూకమేశారే….

అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించాలని చంద్రబాబు తాజాగా కొత్త ప్రతిపాదన ముందుకు తెచ్చారు. జగన్ కనుక ఒకే ఒక రాజధానిగా అమరావతినే ఉంచుతానంటే తనతో సహా మొత్తం టీడీపీ ఎమ్మెల్యేలందరి చేత రాజీనామా చేయించి అసెంబ్లీని జగన్ కి వదిలేస్తానని చంద్రబాబు చెబుతున్నారు. మరి తన పార్టీ ఎమ్మెల్సీలు పోకూడదని శాసనమండలి రద్దుని వ్యతిరేకించిన ఇదే చంద్రబాబు ఇపుడు అమరావతి కోసం తమ పార్టీ గొంతుక కూడా లేకుండా అసెంబ్లీలో చేస్తామని అంటున్నారంటే దారుణమే. అమరావతి బాబు కలల రాజధాని కావచ్చు, గొప్ప కూడా కావచ్చు, అంత మాత్రం చేత పార్టీ కంటే అమరావతే అధికమా. పైగా మొత్తం ఎమ్మెల్యేల రాజకీయాన్ని, టీడీపీ భవిష్యత్తుని బలిపెట్టడానికి బాబు రెడీ అయ్యారంటేనే ఆయన మొగ్గు ఎటువైపో అర్ధమవుతోందిగా.

ఒప్పేసుకున్నారా..?

అమరావతి రాజధానిని చంద్రబాబు ఒక సామాజిక వర్గం కోసమే నిర్మిస్తున్నారని వైసీపీ అన్న మాటలకు ఇపుడు చంద్రబాబు చేస్తున్న ప్రతిపాదనలకు బేరీజు వేసి చూస్తే నిజమేనని తానే ఒప్పేసుకున్నట్లుగా ఉందని అంటున్నారు. అమరావతి ఒక్కటి చాలు మరేమీ వద్దు అని చంద్రబాబు అంతలా సాగిలపడేలా చేసిన పరిస్థితుల మీద కూడా కొత్త చర్చ వస్తోంది. టీడీపీ వంటి బలమైన పార్టీని కూడా వదులుకుని అమరావతికే కట్టుబడడానికి బాబుకు వెనక ఉన్న కారణాలు ఏంటన్నది కూడా ప్రశ్నగా ఉంది. పార్టీ ఉంటే మళ్ళీ బాబే అధికారంలోకి రావచ్చు. అపుడు తన కలల రాజధానిని కొంత అయినా డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఇలా మొత్తం పార్టీనే తూకం పెట్టారంటేనే బాబుకు అన్నింటికీ మించి అమరావతి అని బోధపడుతోందిగా.

ఓట్లెందుకు మరి….

అమరావతి మాత్రమే తన రాజధాని అని చెప్పిన తరువాత, దాని కారణంగా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తానని చంద్రబాబు అన్న తరువాత ఉత్తరాంధ్రా, రాయలసీమ జనాలు ఎందుకు టీడీపీకి ఓట్లు వేయాలి. ఇక పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు సైతం చంద్రబాబుకు పార్టీ కంటే అమరావతి ఎక్కువ అని తెలిశాక ఎందుకు ఆ పార్టీలో ఉండాలి. వారు రేపో మాపో వేరే చోటు చూసుకుంటే తప్పేంటి. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నట్లుగా పార్టీ కంటే కూడా లక్ష కోట్ల రూపాయల విలువైన అమరావతి బినామీల ఆస్తులే ముఖ్యమా బాబూ అని తమ్ముళ్ళూ అడిగితే ఏం సమాధానం చెబుతారు. మొత్తానికి చంద్రబాబు రాజకీయం చూస్తూంటే ఏమీ వద్దు, అమరావతి ముద్దు అంటున్నట్లుగా ఉంది. ఇది నిజంగా టీడీపీకి ఆత్మహత్యాసద్రుశ్యమే. జగన్ సరిగ్గా చూసి మరీ వేసిన ట్రాప్ లో చంద్రబాబు అడ్డంగా ఇరుక్కుపోయారంతే.

Tags:    

Similar News