తమ్ముళ్లకు వణుకుపుడుతుందటగా

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా జిల్లాల ప‌ర్య‌ట‌న ప్రారంబించారు. పార్టీ ఘోరంగా ఓడిపోయిన నేప‌థ్యంలో కేడ‌ర్‌లో భ‌రోసా నింపేందుకు ఆయ‌న వ్యూహాత్మ‌కంగా ఈ [more]

Update: 2019-09-09 00:30 GMT

ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా జిల్లాల ప‌ర్య‌ట‌న ప్రారంబించారు. పార్టీ ఘోరంగా ఓడిపోయిన నేప‌థ్యంలో కేడ‌ర్‌లో భ‌రోసా నింపేందుకు ఆయ‌న వ్యూహాత్మ‌కంగా ఈ కార్య‌క్ర‌మానికి శుక్ర‌వార‌మే శ్రీకారం చుట్టారు. తాజాగా ఆయ‌న కాకినాడ‌లో ప‌ర్య‌టించారు కూడా. ఈ సంద‌ర్భంగా జ‌గ‌న్ పాల‌న‌కు వంద రోజులు పూర్త‌యిన సంద‌ర్భంగా త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. నిజానికి పార్టీ అధినేత‌గా ఆయ‌న చేప‌ట్టిన కార్య‌క్ర‌మం మంచిదే అయినా.. ఆయా జిల్లాల పార్టీ ఇంచార్జులు మాత్రం హ‌డ‌లిపోతున్నారు. మ‌ళ్లీ చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లంటే.. ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఖ‌ర్చు చేయ‌డంతోపాటు కార్య‌క‌ర్త‌ల‌ను మొబిలైజ్ చేయ‌డం, వారికి ఏర్పాటు చూడ‌డం, అధినేత‌కు అన్నీతామై వ్య‌వ‌హ‌రించాలంటే.. ఖ‌ర్చుతో కూడి ఉండ‌డంతో ఇబ్బంది ప‌డుతున్నారు.

ఎన్నికలు పూర్తయి….

ఇప్ప‌టికే పార్టీ గెలుపు కోసం మూడు మాసాల కింద‌టే జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీగా ఖ‌ర్చు పెట్టారు. కొంద‌రు త‌మ వ్య‌క్తిగ‌త ఆస్తుల‌ను తాక‌ట్టు పెట్టి మ‌రీ ఎన్నిక‌ల్లో చేతికి ఎముక లేకుండా ఖ‌ర్చు చేశారు. మ‌రికొంద‌రు ఎక్కువ వ‌డ్డీ అయినా.. స‌రే తెచ్చి ఖ‌ర్చు పెట్టారు. వాటికే ఇప్ప‌టి వ‌ర‌కు దిక్కుమొక్కు లేదు. ఇప్పుడు మ‌రోసారి ఇంత స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌లంటే.. మ‌రోసారి ల‌క్ష‌ల‌కు ల‌క్ష‌లు ఎక్క‌డి నుంచి తీసుకురావాల‌ని వారు దిగులు పెట్టుకున్నారు. ప్ర‌స్తుతం జిల్లా, న‌గ‌ర పార్టీల అధ్య‌క్షులుగా ఉన్న నాయ‌కులే ఈ బాధ్య‌త‌ల‌ను చూడాల్సి వ‌స్తోంది. కేంద్ర కార్యాల‌యం నుంచి ఒక్క రూపాయి కూడా వారికి అంద‌డం లేదు. దీంతో వారు త‌ల‌లు ప‌ట్టుకుంటున్నారు.

జిల్లా అధ్యక్షులకే భారం….

గుంటూరు జిల్లా ఇంచార్జ్ జీవీ ఆంజ‌నేయులు, ప్ర‌కాశం ఇంచార్జ్ దామ‌చ‌ర్ల జ‌నార్ద‌న్‌, విజ‌య‌వాడ అర్బ‌న్ ఇంచార్జ్ బుద్దా వెంక‌న్న‌, కృష్ణాజిల్లా పార్టీ ఇంచార్జ్ బ‌చ్చ‌ుల అర్జునుడు, శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్య‌క్షురా లుగౌతు శిరీష‌, విజ‌య‌న‌గ‌రం ఇంచార్జ్ ద్వార‌పు రెడ్డి జ‌గ‌దీష్‌, విశాఖ అర్బ‌న్ ఇంచార్జ్ రెహ్మాన్‌, రూర‌ల్ ఇంచార్జ్ పంచ‌క‌ర్ల ర‌మేష్ బాబు, తూర్పుగోదావ‌రి నామ‌ర‌ రాంబాబు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఇంచార్జ్ రాజ్య‌స‌భ స‌భ్యురాలు తోట సీతారామ‌ల‌క్ష్మి, నెల్లూరు బీద ర‌విచంద్ర‌, అనంత‌పురం బీకే పార్థ‌సార‌ధి, చిత్తూరు పులివ‌ర్తి నాని, క‌ర్నూలు సోమిశెట్టి వెంక‌టేశ్వ‌ర్లు, క‌డ‌ప ఇంచార్జ్ శ్రీనివాసులు రెడ్డి మొత్తం చంద్రబాబు కార్య‌క్ర‌మాల‌ను భుజాన వేసుకోవాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.

కొంత సమయం కావాలంటూ…

అయితే, వీరిలో ఎక్కువ మంది ఇటీవ‌ల ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ నేప‌థ్యంలో చంద్రబాబు జిల్లాల ప‌ర్య‌ట‌న‌ల‌పై వీరు అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. ఇప్ప‌టికే ఇబ్బందుల్లో ఉన్న త‌మ‌కు కొంత స‌మ‌యం కావాల‌ని కోరుతున్నారు. మ‌రోప‌క్క‌, వీరు మిన‌హా ఓడిపోయిన వారు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు గ‌డ‌ప దాటి బ‌య‌ట‌కు వ‌చ్చిన దాఖ‌లా క‌నిపించ‌లేదు. ఇక బాబు తాజా తూర్పుగోదావ‌రి జిల్లా ప‌ర్య‌ట‌న‌లో కూడా చాలా మంది సీనియ‌ర్లు డుమ్మా కొట్టేశారు. దీంతో జిల్లా పార్టీ అధ్యక్షుల‌పైనే బాబు ప‌ర్య‌ట‌న‌ ఖ‌ర్చు ప‌డుతోంది. దీంతో బాబు ప‌ర్య‌ట‌న‌లు వాయిదా వేసుకోవాల‌నే డిమాండ్ త‌మ్ముళ్ల నుంచి బాహాటంగానే వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం

Tags:    

Similar News