వెంటనే దిగిపోవాల్సిందేనా?

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఏపీలోని దాదాపుగా అన్ని రాజకీయ పక్షాలకు ఇష్టంలేదన్నది తెలిసిందే. ఆ మాటకు వస్తే వైఎస్ జగన్ ని ఓ రాజకీయ నాయకుడిగా [more]

Update: 2019-09-08 06:30 GMT

వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావడం ఏపీలోని దాదాపుగా అన్ని రాజకీయ పక్షాలకు ఇష్టంలేదన్నది తెలిసిందే. ఆ మాటకు వస్తే వైఎస్ జగన్ ని ఓ రాజకీయ నాయకుడిగా అంగీకరించే పరిస్థితి కూడా మొదటి నుంచి కొన్ని పార్టీలకు లేదు. వైఎస్ జగన్ మీద ఉన్న అవినీతి ముద్ర తెలిసో తెలియకో పడిపోయింది. అది జీవితకాలం శాపంగా పరిణమిస్తోంది. వైఎస్ జగన్ మీద సీబీఐ దాడులు చేయడం ఫక్తు రాజకీయమని అందరికీ తెలుసు. దాన్ని మాత్రం పక్కన పెట్టి వైఎస్ జగన్ లక్ష కోట్లు దోచుకున్నాడన్న తెలుగుదేశం చేసిన ప్రచారాన్ని మిగిలిన పార్టీలే కాదు, సమాజంలో తాము చదువుకున్నామని భ్రమించే సోకాల్డ్ మేధావులంతా నమ్ముతూ వచ్చారు. తాజా ఎన్నికల్లో కూడా అర్బన్ ఏరియాల్లో వైసీపీకి ఓట్ల షేర్ బాగా తక్కువగానే ఉంది. వైఎస్ జగన్ బలమంతా గ్రామాల్లో ఉంది. ఆ పల్లెజనం బాగా విస్తరించి ఉన్న పట్నాలు, నగరాలు, బస్తీల్లో కూడా వైసీపీ ఘన విజయాలు సాధించగలిగింది.

భరించలేకపోతున్న బాబు…..

వైఎస్ జగన్ సీఎం కావడాన్ని ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు అసలు భరించలేకపోతున్నారు. ఆయన వైసీపీకి అధికారం దక్కిన మొదటి రోజునుంచే వైఎస్ జగన్ మీద విమర్శలు చేయడం ఆరంభించారు. ఇక వందవ రోజు వస్తే ఊరుకుంటారా. రెచ్చిపోయి మాట్లాడుతున్నారు. విమర్శించడానికి తనకు ఇక ఏ అడ్డూ అదుపూ లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. రాక్షసపాలన అంటున్నారు, పులివెందుల రాజకీయం అంటూ అక్కడ ఉన్న ప్రజలను మొత్తం ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అయి ఉండి కూడా బాబు అవమానిస్తున్నారు. ఇక వైసీపీకి క్యాడర్ లేదని, అలా కలిసొచ్చి అధికారంలోకి వచ్చిందని బాబు అంటున్నారు. వైఎస్ జగన్ ని ముఖ్యమంత్రిగా తాను గుర్తించనని బాబు స్పష్టంగా చెప్పేస్తున్నారు. కానీ మూడు నెలలకే ఇలా అయిపోతే ముందు ముందు బాబు ఎలా ఉంటారా అన్నదే అసలు ప్రశ్న. వైఎస్ జగన్ ఎన్ని తప్పులు చేసినా, ఆయనకు ఎంతలా ప్రజావ్యతిరేకత వచ్చినా కూడా అయిదేళ్ళు ఆయనకు అధికారం గ్యారంటీ, ఇప్పటికైతే వెంటనే సీటు ఖాళీ చేసేసి బాబుకు ఇవ్వరు కదా. ఆ సంగతి ముందు గుర్తుంచుకుని బాబు కార్యాచరణకు సిధ్ధపడాలి. అంతే తప్ప వైఎస్ జగన్ ఇవాళే దిగిపోవాలి అన్నట్లుగా చిందులేస్తే పోయేది టీడీపీ పరువేనని గుర్తించాలి.

జనసేన కూడా అంతేగా…

మొదటి నుంచి వైఎస్సార్ కుటుంబం అంటే ఎందుకో పవన్ కి పడదా అన్న అనుమానాలు చాలా మందిలో ఉన్నాయి. ప్రజారాజ్యం సమయం నుంచి కూడా ఆ దూకుడు పవన్ లో ఉంది. పంచెలూడగొడతాను అంటూ అప్పటి యువరాజ్యం నేతగా పవన్ డైరెక్ట్ గా అటాక్ చేసింది వైఎస్సార్ నే. ఆ తరువాత ఆయన కొన్నాళ్ళు కామ్ గా ఉన్నా కూడా జనసేన పేరిట రాజకీయ పార్టీ పెట్టింది, బాబు భుజం మోసింది కూడా వైసీపీని, వైఎస్ జగన్ ని ఓడించాలన్న ఆరాటంతోనేనని అంటారు. ఇక 2019 ఎన్నికల్లో కూడా విడిగా పోటీకి దిగి విపక్ష ఓట్లు చీల్చాలన్న ఎత్తుగడ కూడా ఉందని చెబుతారు. మరి ఇన్నేళ్ళుగా వైఎస్సార్ కుటుంబం పైన ఓ విధమైన వ్యతిరేకత ఉన్న పవన్ వైఎస్ జగన్ సీఎం కావడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన వైఖరి తెలియచేస్తోంది.

అన్నీ చేసేస్తున్నా…..

పవన్ లేవనెత్తిన ఉధ్ధానం కిడ్నీ బాధితుల కోసం వైఎస్ జగన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కడుతున్నారు, అక్కడ రిసెర్చ్ సెంటర్ పెడుతున్నారు. వారికి బాబు మూడు వేలు పించను ఇస్తే వైఎస్ జగన్ దాన్ని పది వేలు చేశారు, అయినా మెచ్చుకోని పవన్ వైఎస్ జగన్ ఒక్క హామీ కూడా అమలు చేయలేదని తేలికగా అనేస్తున్నారు. అచ్చం బాబు పాటనే పాడుతున్నారు. ఇక వామపక్షాలు ఆర్టీసీని ప్రభుత్వంలో కలపాలని పోరాడాయి. ఆశా వర్కర్ల జీతాలు పెంచాలని డిమాండ్ చేస్తూ వచ్చాయి. పారిశుధ్ధ్య కార్మికులకు కనీస వేతనాలను అమలు చేయమని కూడా రొడ్డెక్కాయి. ఇవన్నీ వైఎస్ జగన్ చేసినా కూడా ఆయన వంద రోజుల పాలనపై పెదవి విప్పలేదంటే వీటికి మించిన రాజకీయమే అలా చేసి ఉంటుందనిపిస్తోంది. రాజకీయాల్లో అంటరాని పార్టీగా ఒకనాడు బీజేపీని చూశారు, ఇపుడు ఆ పార్టీ అందరికీ కావాల్సిన పార్టీ అయింది. వైఎస్ జగన్ ని కూడా అలాగే రాజకీయ పార్టీలు చూస్తే మాత్రం జనాల్లో అభిమానం ఉంటే తప్పక ప్రజాస్వామ్యంలో అంతా ఆ దారిలో నడవాల్సిందే. అదే డెమోక్రసీ గొప్పదనం మరి.

Tags:    

Similar News