ఇక తిరుపతిలో చాపచుట్టేయండి.. చాలిక

ఏపీ బీజేపీకి రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరిగే సమయంలో కేంద్ర బడ్జెట్ బీజేపీ విజయావకాశాలు బాగా దెబ్బతీసిందనే చెప్పాలి. [more]

Update: 2021-02-13 00:30 GMT

ఏపీ బీజేపీకి రోజురోజుకూ ఆశలు సన్నగిల్లుతున్నాయి. పంచాయతీ ఎన్నికలు, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక జరిగే సమయంలో కేంద్ర బడ్జెట్ బీజేపీ విజయావకాశాలు బాగా దెబ్బతీసిందనే చెప్పాలి. కేంద్ర బడ్జెట్ లో మరోసారి ఏపీకి మొండి చేయి చూపింది. ఇటు చూస్తే తాము 2024కు అధికారంలోకి వస్తామని ఏపీ బీజేపీ నేతలు జబ్బలు చరుస్తున్నారు. కానీ విభజన హామీలతో పాటు కనీస నిధులను కూడా కేటాయించకపోవడం సామాన్యుల్లోనూ చర్చ జరుగుతోంది.

గత ఏడేళ్లుగా…..

కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు చేకూరిన ప్రయోజనం శూన్యమనే చెప్పాలి. చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన లేదు. ప్రత్యేక హోదా నుంచి ప్యాకేజీ వరకూ ఎలాంటి హామీలను నెరవేర్చలేదు. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ కంటే ఏడేళ్లుగా ఏపీకి బీజేపీ చేసిన అన్యాయమే ఎక్కువగా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇక సామాన్యులకు ప్రయోజనం చేకూరే విధంగా ఏ ఒక్క పని చేయలేదు.

సామాన్యుడికి అన్ని రకాలుగా…..

దీంతోపాటు పెట్రోలు ధరలు విపరీతంగా పెరగడంపై కూడా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు తెలియకుండానే రోజూ పెట్రోలు ధరలు పెరగడం మూలాన నిత్యావసరాలు పెరిగిపోయాయి. పేద, మధ్యతరగతి ప్రజలు ఈ ధరల పెరుగుదలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభావం రానున్న తిరుపతి ఉప ఎన్నికలపై పడే అవకాశం ఉందని చెప్పక తప్పదు. బీజేపీకి ఎందుకు ఓటేయాలన్న దానిపై వారి నుంచి సమాధనం లేదు.

మామూలుగానే బీజేపీ…..

ఏపీలో మామూలుగానే బీజేపీకి ఓటు బ్యాంకు లేదు. ఇక తిరుపతి పార్లమెంటు వంటి ఎస్సీ నియోజకవర్గ పరిధిలో అస్సలు ప్రభావం చూపే అవకాశం లేదు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వ వైఖరి సయితం బీజేపీకి తిరుపతి ఉప ఎన్నికలలో ఇబ్బందికరంగా మారనుంది. ఇక్కడ నోటా కంటే ఎక్కువ ఓట్లు రావడమే కష్టమన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. జనసేన, బీజేపీ కూటమితో అభ్యర్థిని నిలబెట్టినా కేంద్ర బడ్జెట్ తర్వాత ఇక్కడ బీజేపీ చాప చుట్టేసినట్లే అనుకోవాలి.

Tags:    

Similar News