పరివార్ లో పరేషాన్

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాస్త పరువునూ భారతీయ జనతా పార్టీ పోగొట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి పెద్దగా అవకాశాలు లేవు. ఎక్కడో కేంద్రంలో ఉన్న మోదీని, అమిత్ [more]

Update: 2019-09-15 00:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కాస్త పరువునూ భారతీయ జనతా పార్టీ పోగొట్టుకుంటుంది. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి పెద్దగా అవకాశాలు లేవు. ఎక్కడో కేంద్రంలో ఉన్న మోదీని, అమిత్ షాను చూసి ఇక్కడ ఓట్లేసే పరిస్థితి లేదు. గత కొన్ని దశాబ్దాలుగా బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఎదగేందుకు ప్రయత్నిస్తున్నా అది జరగలేదు. గత ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనం. కనీసం ఒక్క స్థానంలో గెలవలేకపోవడం, నోటా కంటే ఓట్లు తక్కువగా రావడం కూడా బీజేపీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చెప్పకనే తెలుస్తుంది.

పునాదులు వేసినా…..

భారతీయ జనతా పార్టీకి ఆంధ్రప్రదేశ్ లో పునాదులు వేసింది ఖచ్చితంగా వెంకయ్యనాయుడే. ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్ లు కూడా ఏపీలో వేళ్లూనుకోలేకపోయాయి. అలాంటి పరిస్థితుల్లో వెంకయ్యనాయుడు బీజేపీకి ఒక గుర్తింపు తెచ్చారు. అయితే ఆ గుర్తింపు ఒక్క సీటు కూడా గెలిచే దిశగా కాదన్నది అందరికీ తెలిసిందే. తెలుగుదేశం పార్టీతో పొత్తుతో వెళ్లినప్పుడే ఆ పార్టీకి అరకొర సీట్లు లభించాయి తప్ప అంతకు మించి ఏపీలో బీజేపీ బలపడిందీ లేదు.. బలపడుతుందన్న గ్యారంటీ లేదు.

కొద్దిరోజులుగా……

అయితే గత కొద్ది రోజులుగా బీజేపీలో జరుగుతున్న పరిణామాలు ఆ పార్టీ సీనియర్ నేతలకు ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయి. పార్టీ సిద్ధాంతాల కోసం, భావజాలం కోసం పనిచేసే నేతలు మాత్రమే ఇప్పటి వరకూ బీజేపీలో కన్పించారు. కాని గత కొద్ది రోజులుగా ఆ సీన్ మారిపోయింది. అక్రమ కేసులున్న వారు, జనంలో బలం లేని వారు, పార్టీ ప్రయోజనం కోసం కాకుండా స్వప్రయోజనం కోసం వచ్చే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో పాతతరం నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. తమ ఆవేదనను ఓ కీలకనేత సంఘ్ పరివార్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

పార్టీ పరువు పోతుందని…..

ఇటీవల కాలంలో సుజనాచౌదరి, సీఎం రమేష్, ఆదినారాయణరెడ్డి లాంటి వారిని పార్టీలో చేర్చుకోవడంపై కమలనాధుల్లోనే కలవరం మొదలయింది. పార్టీ ఏ స్థాయికి దిగజారిందన్న వ్యాఖ్యలు వారినోటి నుంచే విన్పిస్తున్నాయి. అందుకే గతంలో సిన్సియర్ గా పార్టీ కోసం పనిచేసిన నేతలు ఇప్పుడు దూరం జరిగారు. బీజేపీని కూడా సిద్ధాంతాలు లేని పార్టీగా మార్చేశారని వారు ఆవేదన చెందుతున్నారు. ఎంతమందిని చేర్చుకున్నా పరువు పోగొట్టుకోవడం మినహా పార్టీకి పెద్దగా ఒరిగేది లేదన్నది సీనియర్ నేతల అభిప్రాయం. ఇలా బీజేపీలోనే లుకలుకలు ప్రారంభమయ్యాయంటున్నారు.

Tags:    

Similar News