బీజేపీ డబుల్ గేమ్ కి జగన్ మార్క్ టెస్ట్ ?

బీజేపీ అంటేనే ఢక్కామెక్కీలు తిన్న పార్టీ. ఎన్ని జిమ్మిక్కులు చేయకపోతే రెండు సీట్ల నుంచి ఎగబాకి ఇప్పటికి నాలుగైదు మార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలుగుతుంది. ఇక బీజేపీకి [more]

Update: 2020-09-24 14:30 GMT

బీజేపీ అంటేనే ఢక్కామెక్కీలు తిన్న పార్టీ. ఎన్ని జిమ్మిక్కులు చేయకపోతే రెండు సీట్ల నుంచి ఎగబాకి ఇప్పటికి నాలుగైదు మార్లు కేంద్రంలో అధికారంలోకి రాగలుగుతుంది. ఇక బీజేపీకి గొప్ప ఓపిక. తన పట్టును నెగ్గించుకోవడానికి ఎంతదాకా అయినా వెళ్తుంది. కేంద్రంలో అధికారం కోసం పరమపద సోఫానాలను అన్నీ అధిరోహించిన బీజేపీ చూపు ఇపుడు దక్షిణాది రాష్ట్రాల మీద ఉంది. అందులోనూ ఏపీ మీద చాలానే ఆశగా ఉంది. జగన్ ని ఓవైపు మంచి చేసుకుంటూ మరో వైపు టీడీపీకి వ్యూహాత్మక దూరం పాటిస్తోంది. జగన్ దాన్ని నమ్మి బాబు మీద ఓ రేంజిలో అటాక్ చేస్తున్నారు.

బాబే టార్గెట్ …

చంద్రబాబు కాంగ్రెస్ కలసి తనను 16 నెలల పాటు అన్యాయంగా జైలు గోడల మధ్యన ఉంచేశారనన్నది జగన్ ఆక్రోశం. ప్రజలు ఇంతటి అద్భుతమైన విజయం అందించిన తరువాత కూడా బాబు మీద హాట్ రివెంజ్ తీర్చుకోకపోతే ఈ 151 సీట్లు ఎందుకు, సీఎం పదవి ఎందుకు అన్నది కూడా జగన్ ఆలోచన కావచ్చు. బాబుని కోర్టు మెట్లు ఎక్కించాలన్నది జగన్ కసి అనుకున్నా తప్పు లేదు. ఆయన వైపు నుంచి చూసినపుడు, ఆయనలా ఆలోచినపుడు అది న్యాయమే అనిపిస్తుంది. కానీ బీజేపీ తదితర పార్టీలన్నీ ఒకే తానులో ముక్కలు. తేడా గల పార్టీ అని చెప్పుకుంటున్న బీజేపీ కూడా అధికారంలోకి రావడం కోసం, వచ్చాక కూడా ఎన్ని పిల్లి మొగ్గలు వేయాలో అన్నీ వేస్తోంది, వాటిని చూసి జనం చూసి షాక్ తింటున్నారు కూడా.

సీబీఐ విచారణతోనే ….

జగన్ ఢిల్లీ టూర్ లో అతి ముఖ్య అంశంగా సీబీఐ విచారణ ఉంటుంది అన్నది నిజం. ఆయన అమిత్ షాను కలవడమే ఇక్కడ చూడాల్సిన కీలక పరిణామం. సరే అమిత్ షా ముందు జగన్ అమరావతి రాజధాని భూముల మీద సీబీఐ విచారణ‌ డిమాండ్ పెడితే ఆయన ఓకే అంటారా. అంత తేలిగ్గా ఒప్పేసుకునే రాజకీయమా బీజేపీది. ఇక బాబు మీద సీబీఐ విచారణ జరిపిస్తే బీజేపీకి ఏంటి ఒరిగేది. రాజకీయాల్లో లాభ నష్టాలే కొలమానంగా ఉంటాయి. జగన్ కి బాబు అడ్డు, ఆయన్ని తొలగిస్తే జగన్ కి ఏపీలో ఎదురు ఉండదు, ఆయన చెలరేగిపోతారు. అపుడు ఆయన బీజేపీ చేతికి ఊరికే అందుతారా. ఇది కదా బీజేపీ అసలు వ్యూహం. అందువల్ల బీజేపీ సీబీఐ విచారణ విషయంలో మౌనాన్నే కంటిన్యూ చేస్తుంది అనుకోవాలి. నిజానికి బీజేపీకి బాబు మీద విచారణ జరిపించాలన్న కోరికే బలంగా ఉంటే ఈ ఏడాది మార్చి నెలలోనే జగన్ రాసిన లేఖకు అర్జంటుగా స్పందించి ఉండేది. నాడు అది మూలన పడేశారు అంటేనే ఏవో కొత్త ఆలోచనలు ఉన్నాయనుకోవాలి.

ఎప్పటికైనా బాబుతో…?

ఇక మరో విషయం కూడా ఉంది. బాబు ఇపుడు ఏపీలో వట్టి విపక్ష నేత మాత్రమే. పైగా ఆయన బీజేపీని శరణు కోరుతున్నాడు. అందువల్ల బీజేపీకి ఆయన నుంచి ఇప్పటికిపుడు వచ్చిన ప్రమాదం ఏదీ లేదు, ఇక బీజేపీ చూపు 2024 ఎన్నికల మీద ఉంది. వైసీపీ బీజేపీతో తెర వెనక బంధాలు తప్ప డైరెక్ట్ గా పొత్తులు ఎప్పటికీ పెట్టుకోదు, అదే బాబు అయితే సై అంటారు. ఏపీలో అరచి గీ పెట్టిన బీజేపీకి వచ్చే సీట్లు పదో పదిహేనో వస్తాయి తప్ప అధికారం లోకి సొంతంగా వచ్చేంత సీన్ లేదు. ఇక ఎంత చెడ్డా టీడీపీకి ఏపీలో గ్రౌండ్ లెవెల్లో బలం ఉంది. దాంతో ఎన్నికల ముందర అయినా బాబుతో దోస్తీ కట్టాలన్న వ్యూహం ఏదో బీజేపీకి ఉన్నట్లుంది. అందుకే బాబు విషయంలో సీబీఐ విచారణలు జరిపించేసి ఏపీలో వార్ వన్ సైడ్ చేయడానికి జగన్ కే ఎప్పటికీ సీఎం సీటు అప్పగించడానికి బీజేపీ అమాయక పార్టీ కాదుగా. అందుకే జగన్ కూడా తెలివిగానే సీబీఐ విచారణ డిమాండ్ పెట్టారు, ఇపుడు బీజేపీ నో అంటే ఆ పార్టీ డబుల్ స్టాండర్డ్, అసలు రంగు కూడా ఆయన చూసేందుకు వీలుంటుంది. మరి చూసిన తరువాత అయినా జగన్ బీజేపీతో దూరంగా ఉంటారా. ఏమో చెప్పలేం. ఇక్కడికి ఇంతే అనుకోవాలి.

Tags:    

Similar News