మంత్రిని డామినేట్ చేస్తున్న కీలక నేత‌లు.. ఏం జ‌రుగుతోందంటే?

సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. ఈ జిల్లాలో చాలా మంది నాయ‌కులు వైఎస్సార్ సీపీలో సీనియర్లు. వారంతా కూడా పార్టీ పెట్టిన‌ప్పటి [more]

Update: 2020-07-18 03:30 GMT

సీఎం జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప రాజ‌కీయాలు ఆస‌క్తిగా మారాయి. ఈ జిల్లాలో చాలా మంది నాయ‌కులు వైఎస్సార్ సీపీలో సీనియర్లు. వారంతా కూడా పార్టీ పెట్టిన‌ప్పటి నుంచి ఉన్నారు. పార్టీ కోసం అనేక క‌ష్టాలు కూడా ప‌డ్డారు. అనేసార్లు ఎత్తుప‌ల్లాల‌ను కూడా చ‌విచూశారు. గ‌త అధికార పార్టీ టీడీపీ నుంచి అనేక ప్రలోభాల‌కు కూడా గుర‌య్యారు. చివ‌రికి టీడీపీ అనుకూల మీడియాలోనూ వ్యతిరేక ప్రచారానికి కూడా గుర‌య్యారు. కేసులు కూడా ఎదుర్కొన్నారు. అయిన‌ప్పటికీ.. వారంతా జ‌గ‌న్ వెంటే ఉన్నారు. పార్టీ కోసం క‌ష్టించారు. వీరంతా జ‌గ‌న్‌కు అత్యంత స‌న్నిహితులు కూడా. అయితే, వీరిలో ఎవ‌రికీ కూడా ఆశించిన మేర‌కు ఇప్పుడు ప్రభుత్వంలో గుర్తింపు ల‌భించ‌లేదు.

జగన్ సొంత జిల్లాలో….

క‌డ‌ప జిల్లా నుంచి సీఎంగా జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ఉండ‌గా.. క‌డ‌ప అసెంబ్లీ స్థానం నుంచి విజ‌యం సాధించిన అంజాద్ బాషా మైనారి టీ శాఖ మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయితే, సీఎం జ‌గ‌న్ రాష్ట్ర స్థాయిలో కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇక‌, మైనారిటీ మంత్రిగా ఉన్న అంజాద్ బాషా మాత్రం అటు క‌డ‌ప‌, ఇటు తాడేప‌ల్లి టూర్ చేస్తున్నారు. అయితే.. జిల్లా రాజ‌కీయాల్లో మాత్రం వైఎస్సార్ సీపీ కీల‌క నేత , ప్రభుత్వ చీఫ్ విప్ గ‌డికోట శ్రీకాంత్ రెడ్డి, మ‌రో నేత‌, రైల్వే కోడూరు ఎమ్మెల్యే విప్ కొరుముట్ల శ్రీనివాసులు, క‌డ‌ప ఎంపీ అవినాష్ రెడ్డి, రాజంపేట ఎంపీ, పార్టీ లోక్‌స‌భా ప‌క్ష నేత మిథున్‌రెడ్డి, క‌మ‌లాపురం ఎమ్మెల్యే ర‌వీంద్రనాథ్ రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే ర‌ఘురామిరెడ్డి ఇలా ఎవ‌రికి వారే జిల్లాలో చ‌క్రం తిప్పుతున్నార‌నే విమ‌ర్శలు వ‌స్తున్నాయి. అన్ని విష‌యాల‌ను వారే చూసుకుంటున్నార‌ని.. కూడా అంటున్నారు.

కీలక నేతలతోనే చర్చలు….

జిల్లాకు ఇంచార్జ్ మంత్రిగా ఉన్న విద్యాశాఖ మంత్రి ఆదిమూల‌పు సురేష్ కూడా జిల్లాకు సంబంధించిన అన్ని విష‌యాల‌ను వీరితోనే చ‌ర్చిస్తున్నార‌ట‌.ఇక రాజంపేట‌లో గెలిచిన మేడా మ‌ల్లిఖార్జున్ రెడ్డి సైతం సీనియ‌ర్ కావ‌డంతో ఆయ‌న కూడా త‌న వంతుగా చ‌క్రం తిప్పేందుకు ప్రయ‌త్నాలు చేస్తున్నార‌ట‌. నిజానికి అంజాద్ బాషా ఆది నుంచికూడా ఫుల్ సైలెంట్‌. కేవ‌లం ఆయ‌న త‌న వ‌ర్గానికి మాత్రమే ప‌రిమిత‌మైన నాయకుడిగా ఎదిగారు. దీంతో మిగిలిన సామాజిక వ‌ర్గాలు అన్నీ కూడా త‌మ క‌ష్టాలు చెప్పుకొనేందుకు, ప్రభుత్వ కార్యక్రమాలు ల‌బ్ధి పొందేందుకు అటు విప్‌ శ్రీకాంత్‌రెడ్డి, ఇటు కొరుముట్ల వ‌ద్దకు క్యూక‌డుతున్నారు. కొన్నాళ్ల కింద‌ట జ‌రిగిన జిల్లా స్థాయి బ‌దిలీలు, ఇత‌ర‌ నియామ‌కాల్లో కూడా ఈ ఇద్దరూ కీల‌కంగా వ్యవ‌హ‌రించార‌ని అప్పట్లో వార్తలు వ‌చ్చాయి.

ఆయన మాత్రం….

అంతేకాదు, ప్రస్తుతం జ‌రుగుతున్న టీచ‌ర్ల బ‌దిలీ వ్యవహారా ల్లోనూ వీరిద్దరే చ‌క్రం తిప్పుతున్నార‌ని తెలుస్తోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏ ప‌నిజ‌ర‌గాల‌న్నా కూడా ఈ ఇద్దరు నేత‌లే కీల‌కంగా ఉన్నార‌నే ప్రచారం జ‌రుగుతోంది. అయితే, దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌నే వారు కొంద‌రు ఉంటే.. మ‌రికొంద‌రు మాత్రం .. అధికారికంగా ఎలాంటి ప‌ద‌వులూ లేన‌ప్పుడు ఇలా చేయొచ్చా? మైనార్టీ మంత్రి అంజాద్ భాషాని కించ‌ప‌ర‌చ‌డం కాదా? అంటున్నారు. అయితే, ఆయా విష‌యాల‌న్నీ.. ఇంచార్జ్ మంత్రి ఆదిమూల‌పు సురేష్‌కు, సీఎం జ‌గ‌న్‌కు కూడా తెలుసున‌ని, ఇదిపెద్ద విష‌యం కాద‌ని, గ‌తంలో చంద్రబాబు హ‌యాంలోనూ మంత్రులు ఉన్నప్పటికీ.. ఆయ‌న కుమారుడు ఎలాంటి మంత్రి ప‌ద‌వి లేకుండానే చ‌క్రం తిప్పిన సంద‌ర్భాలు చాలా ఉన్నాయ‌ని.,. అంటున్నారు. మొత్తానికి అంజాద్ బాషా మాత్రం ఈ విష‌యంలో మౌనం వ‌హిస్తున్నారు.

Tags:    

Similar News