Tirumala : నేడు తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉందంటే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది
తిరుమలలో భక్తుల రద్దీ నేడు కొనసాగుతుంది. శనివారం కావడంతో భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఎక్కువ కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్నటి నుంచి ప్రారంభమయిన రద్దీ నేడు, రేపు కూడా కొనసాగనుంది. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. మొక్కులు చెల్లించుకునే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. రోజుకు అరవై వేలకు మందికి పైగానే భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు.
అన్ని ఏర్పాట్లు...
తిరుమలకు భక్తుల రాకతో శ్రీవారి హుండీ ఆదాయం కూడా గణనీయంగానే వస్తుంది. లడ్డూల విక్రయాల ద్వారా కూడా అధిక ఆదాయం వస్తుంది. అలాగే తిరుమలలో వసతి గృహాల కోసం కొంత ఇబ్బందులు పడుతున్నా అవసరమైన అన్ని చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తీసుకుంటున్నారు. వెంకటాద్రి పేరిట లాకర్లు ఉంచి అక్కడే అన్ని ఏర్పాట్లు చేశారు. గదులు అద్దెకు దొరకని వారు అక్కడికి వెళ్లి స్నానాలు చేసి కొంత విశ్రాంతి తీసుకుని స్వామి వారిని దర్శించుకునే వీలుందని టీటీడీ అధికారులు తెలిపారు.
23 కంపార్ట్ మెంట్లలో ...
నేడు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 23 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం ఏడు గంటలకు టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పన్నెండు గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. నిన్న తిరుమల శ్రీవారిని 67,085 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,832 మంది తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.78 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.