Tirumala : నేడు తిరుమలకు వెళితే .. దర్శనం సమయం ఎంతంటే?
తిరుమలలో భక్తుల రద్దీ నేడు పెరిగింది.
తిరుమలలో భక్తుల రద్దీ నేడు పెరిగింది. గత మూడు రోజుల నుంచి భక్తుల రద్దీ తిరుమలలో కొనసాగుతుంది. నేడు ఆదివారం కావడంతో భక్తుల రద్దీ మరింత ఎక్కువగా ఉంది. అత్యధిక సంఖ్యలో కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. శ్రీవారి దర్శనం కోసం కూడా గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితులు ఉన్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. శుక్రవారం నుంచి మొదలయిన రద్దీ రేపు కూడా కొనసాగే అవకాశముందని, భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
వివిధ రూపాల్లో వచ్చే భక్తులు...
తిరుమలకు వచ్చే భక్తుల వివిధ రూపాల్లో వస్తుంటారు. మూడు వందల రూపాయల టిక్కెట్లను ముందుగానే ఆన్ లైన్ లో బుక్ చేసుకుని ప్రత్యేక దర్శనం కోసం వచ్చే భక్తులు, ఎస్.ఎస్.డి. టోకెన్లు రోజు వారీ ఇస్తుండటంతో అప్పటికప్పుడు వచ్చి వాటిని తీసుకుని స్వామి వారిని దర్శించుకునే వారు మరికొందరు, కాలినడకన వచ్చే భక్తులు ఇంకొందరు, శ్రీవాణి టిక్కెట్లు తీసుకుని కొందరు ఇలా వస్తుండటంతో వారికి అందరికీ అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
31 కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పదిహేను నుంచి పద్దెనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు గంటలకు పైగానే సమయం పడుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 81,777 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,209 మంది భక్తుల తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.70 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.