Cyber Crime : హైదరాబాద్ లో రెచ్చిపోయిన సైబర్ నేరగాళ్లు.. 7.31 కోట్లు స్వాహా

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు.

Update: 2026-01-03 12:04 GMT

సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నప్పటికీ సైబర్ నేరగాళ్ల వలలో పడి అమాయకులు మోసపోతున్నారు. తాజాగా డిజిటల్ అరెస్ట్ పేరుతో సైబర్ నేరగాళ్లు ఒక వృద్ధుడిని మోసం చేసి 7.31 కోట్ల రూపాయలను కొల్లగొట్టారు. నకిలీ మాదకద్రవ్యాలు, ఉగ్రవాద కేసు విచారణ అంటూ బెదిరింపులకు దిగి వారు సైబర్ నేరానికి పాల్పడ్డారు. గత ఏడాది అక్టోబరు 27వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. ముంబై నుంచి బ్యాంకాక్‌కు తన పేరుతో పంపిన కొరియర్‌ను అధికారులు అడ్డుకున్నారని చెప్పుతూ బాధితుడికి వాట్సాప్‌ కాల్‌ వచ్చింది. అందులో పలు పాస్‌పోర్టులు, ల్యాప్‌టాప్‌, మాదకద్రవ్యాలు ఉన్నాయని ఆరోపించారు.

ఇంటి నుంచి బయటకు రావద్దంటూ...
తాను ఏ తప్పు చేయలేదని బాధితుడు చెప్పడంతో కాల్‌ను ముంబై పోలీసు అధికారిగా చెప్పుకున్న మరో వ్యక్తికి కలిపారు. ఆ తర్వాత బెదిరింపులు మరింత పెంచారు. మనీలాండరింగ్‌ కేసు, ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. విచారణకు సహకరించాల్సి ఉందంటూ చట్టంలోనే లేని ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో అతడిని నిర్బంధించారు. ఇంటి నుంచి బయటకు రావద్దని, ఎప్పటికప్పుడు వీడియో కాల్‌లో ఉండాలని ఆదేశించారు. అతడి కదలికలన్నీ గమనించినట్టు సైబర్‌ విభాగం తెలిపింది. ఫెడరల్‌ ఏజెన్సీలు చేస్తున్న “ఆర్థిక పరిశీలన” పేరిట ముందుగా రూ.19.80 లక్షలు బదిలీ చేయించారు. అక్టోబర్‌ 29, 2025న కమ్యూనికేషన్‌ను సిగ్నల్‌ యాప్‌కు మార్చారు.
వ్యాపారిగా కూడబెట్టిన మొత్తాన్ని...
మ్యూచువల్‌ ఫండ్లు, ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు కూడా నగదుగా మార్చాలని ఒత్తిడి చేశారు. పరిశీలన పూర్తయ్యాక డబ్బులు తిరిగి ఇస్తామని నమ్మబలికారు. చివరకు వివిధ ఖాతాలకు మొత్తం రూ.7.31 కోట్లను బదిలీ చేయించారు. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు సైబర్ క్రైమ్ అధికారులు తెలిపారు. హైదరాబాద్ లో సోమాజిగూడలో ఉంటున్న ఈ వృద్ధుడు అంతా డబ్బులు పోయాక అసలు నిజం తెలుసుకున్నాడు. తాను మోసపోయినట్లు గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు.గతంలో వ్యాపారం చేసి కూడబెట్టుకున్న డబ్బంతా సైబర్ నేరగాళ్లకు సమర్పించుకున్నాడని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. డిజిటల్ అరెస్ట్ అంటూ ఏమీ ఉండదని పదే పదే చెబుతున్నప్పటికీ ఆ బారిన పడి మోసపోయే వారి సంఖ్య ఇంకా కనిపిస్తుండటం విడ్డూరంగా ఉందని పోలీసులు సయితం ఆశ్చర్య పోతున్నారు.







Tags:    

Similar News