విజయనగరం ఉగ్ర కేసు ఎన్ఐఏకి బదిలీ.. కుట్రకు ప్లాన్ చేసిన వారిపై నజర్
విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లింది
విజయనగరం బాంబు పేలుళ్ల కుట్ర కేసు ఎన్ఐఏ చేతుల్లోకి వెళ్లింది. మే 16వ తేదీన విజయనగరం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. సిరాజ్, సమీర్ లను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. న్యాయస్థానం అనుమతితో కస్టడీలోకి తీసుకుని వారికి సహకరించిన వారి గురించి కూడా ఆరా తీసింది. దేశ వ్యాప్తంగా వీరి నెట్ వర్క్ ఉన్నట్లు విచారణలో బయటపడింది. ఈ విచారణలో ఎన్ఐఏ అధికారులు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్, వరంగల్, విజయనగరం, బెంగళూరు నగరాల్లో బాంబు పేలుళ్లకు పాల్పడాలని కుట్ర చేసినట్లు విచారణలో వెల్లడయింది. వీరికి అనేక మంది ఉగ్రవాద భావాజాలంతో ఉన్న లింకులను కూడా అడిగి తెలుసుకున్నారు.
ఆర్థిక సహకారం అందించిన..
అహిం పేరుతో ఒక సంస్థ ఏర్పాటు చేసి బాంబు పేలుళ్ల కుట్రకు ప్లాన్ చేశారని దర్యాప్తుల్లో వెల్లడయింది. సమీర్ పలుమార్లు ఢిల్లీ, ముంబయివెళ్లి రావడంతోపాటు సౌదీ నుంచి నిధులు సిరాజ్ కు అందడంతో ఈ దర్యాప్తును ఎన్ఐఏ విచారిస్తేనే మరింత లోతైన విషయాలు వెలుగు చూస్తాయని భావించి కేంద్ర హోంశాఖ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్ఐఏ చేతుల్లోకి విజయనగరం కుట్ర కేసు వెళ్లిపోవడంతో దేశ వ్యాప్తంగా వీరి నెట్ వర్క్ గురించి ఆరా తీయడానికి ఎక్కువ అవకాశాలు కల్పిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఇక ఎన్ఐఏ అధికారులు సిరాజ్, సమీర్ లకు సహకరించినవారిపై ఫోకస్ పెట్టి వారిని అదుపులోకి తీసుకోవడం సులువుగా మారనుంది.
ఇప్పటికే కొందరిని...
హైదరాబాద్, చెన్నై, ముంబయి, ఢిల్లీలో కొందరిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరికి ఆర్థిక సహకారం చేసిన ఇద్దరు విదేశాల్లో ఉండంటంతో వారిని కూడా రప్పించేందుకు ఎన్ఐఏ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇతర దేశాల నుంచి ఇద్దరినీ భారత్ కు రప్పిస్తే ఇక ఉగ్రమూలాలను పూర్తిగా తెలుసుకునే అవకాశముంది. ప్రస్తుతం ఈ కేసులో సిరాజ్, సమీర్ లు విశాఖ పట్నం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇప్పుడు ఈ కేసును కేంద్ర హోం శాఖ ఎన్ఐఏకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేయడంతో బాంబు పేలుళ్ల కేసులో పురోగతి మరింత ఉంటుందని భావిస్తున్నారు. త్వరలోనే మరింత వేగంగా దర్యాప్తు ప్రారంభం కానుంది.