పుష్ప స్ఫూర్తితో నకిలీ మందుల రవాణా.. ముఠా అరెస్ట్

నల్గొండ జిల్లాకు చెందిన బీరెలి రాఘవరెడ్డి (55) అనే వ్యక్తి ప్రస్తుతం పెద్ద అంబర్ పేట్ లో నివాసం ఉంటున్నాడు. వీరిద్దరిని..

Update: 2023-07-22 12:07 GMT

Unauthorized medicine

స్మగ్లింగ్ చేసే ముఠాలపై పుష్ప సినిమా ప్రభావం ఎంతలా ఉందో చెప్పేందుకు ఇటీవల జరుగుతున్న దందాలే కారణం. ఈ సినిమాలో హీరో గంధపు దుంగలను కొత్త పద్ధతిలో పోలీసుల కంటపడకుండా రవాణా చేసే పద్ధతి స్మగ్లర్లకు బాగా నచ్చింది. గాజుల మాటున గంజాయిని దాచిపెట్టడం.. అలాగే వాహనాల కింద రహస్యంగా బాక్సులను అమర్చి గంజాయిని తరలించడం.. కొబ్బరి బొండాల మాటున గంజాయి.. ఇలా రకరకాలుగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ పోలీసుల చేతికి చిక్కారు. ఇదే విధంగా ఓ ముఠా కూడా సరికొత్త పద్ధతిలో వినూత్న రీతిలో పోలీసులకు ఏమాత్రం అనుమానం రాకుండా నకిలీ మందులను వస్త్రాల ప్యాకెట్ లో దాచిపెట్టి కొరియర్ ద్వారా వివిధ రాష్ట్రాలకు రవాణా చేస్తూ.. సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు చిక్కింది. ఇద్దరు నిందితులను అరెస్టు చేయగా మరో నలుగురు పరారయ్యారు. అరెస్ట్ అయిన నిందితుల వద్ద నుండి రూ.29 లక్షల విలువైన నకిలీ మందులను స్వాధీనం చేసుకున్నారు.

రంగారెడ్డి జిల్లాలోని కర్మన్ ఘాట్ కు చెందిన పోకల రమేష్ అలియాస్ రాము (43) అనే వ్యక్తి డ్రైవర్ గా పని చేస్తున్నాడు. నల్గొండ జిల్లాకు చెందిన బీరెలి రాఘవరెడ్డి (55) అనే వ్యక్తి ప్రస్తుతం పెద్ద అంబర్ పేట్ లో నివాసం ఉంటున్నాడు. వీరిద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. పూర్ణచందర్, లక్ష్మణ్, నదీమ్, అరుణ్ చౌదరి ఈ నలుగురు పరారీలో ఉన్నారు. గతంలో రమేష్ మరియు రాఘవరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు కానీ అందులో భారీ నష్టం రావడంతో సులభ పద్ధతిలో డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలోనే చెల్లుబాటు అయ్యే పత్రాలు/బిల్లులు లేకుండా లైసెన్సు లేకుండా ఆల్ప్రాజోలం టాబ్లెట్లను అక్రమంగా విక్రయించడంలో ఆరితేరిన పూర్ణచందర్తో వీరికి పరిచయం ఏర్పడింది ఈ విధంగా అక్రమంగా నకిలీ మందులను సరఫరా చేసి అధిక మొత్తంలో లాభాలు గడించేందుకు మెడికల్ వ్యాపారం చేయడమే ఉత్తమం అని భావించి నకిలీ మందుల దందాకు తెరలేపారు. ఈ ఇద్దరు నిందితులతో పూర్ణచందర్, లక్ష్మణ్ అనే మరో ఇద్దరూ చేరి నకిలీ ఔషధాల సరఫరా చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ నలుగురు నిందితులకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నదీమ్, ఢిల్లీకి చెందిన అరుణ్ చౌదరిలతో పరిచయం ఏర్పడింది. కలిసి చెల్లుబాటు అయ్యే బిల్లు మరియు పత్రాలు లేకుండా నకిలీ ఔషధాలను ఏమాత్రం పోలీసులకు అనుమానం రాకుండా వినూత్న రీతిలో వస్త్రాల ప్యాకెట్లు దాచిపెట్టి వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తూ పెద్ద మొత్తంలో లాభాలు సంపాదిస్తున్నారు. 22వ తేదీన రమేష్ , రాఘవరెడ్డి ఇద్దరు కలిసి దిల్ సుఖ్ నగర్ లో గల కమల్ నగర్ లో ఉన్న హాస్పటల్ సమీపంలో నకిలీ మందులను విక్రయిస్తున్నట్లుగా సౌత్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు పక్కా సమాచారం రావడంతో.. ఘటన స్థలానికి చేరుకొని నిందితులిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వారి వద్ద నుండి రూ.29,72,850 లక్షల విలువైన వివిధ రకాల నకిలీ ఔషధాల బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు తదుపరి విచారణ నిమిత్తం అరెస్టు చేసిన వారిని స్వాధీనం చేసుకున్న వాటిని స్థానిక పోలీసులకు అప్పగించారు. టాస్క్ ఫోర్స్ అరెస్ట్ చేసిన నిందితులను వారు రిమాండ్ కు తరలించనున్నారు.


Tags:    

Similar News