కలకలం రేపిన అక్కాచెల్లెళ్ల మృతి.. హత్యాచారం జరిగిందా ?

ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. బాలికల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల..

Update: 2022-09-15 04:56 GMT

అక్కా, చెల్లి విగతజీవులుగా చెట్టుకు వేలాడుతూ కనిపించడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. ఈ ఘటన యూపీలోని లఖింపూర్ ఖేరీలో వెలుగుచూసింది. తమ పిల్లలపై హత్యాచారం చేసి.. ఇలా చెట్టుకు వేలాడదీశారని బాధిత బాలికల కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. లఖింపూర్ ఖేరిలో నివాసం ఉంటున్న కుటుంబంలో ఇద్దరు బాలికలను గుర్తుతెలియని వ్యక్తులు బైకులపై వచ్చి కిడ్నాప్ చేశారని బాధిత బాలికల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కిడ్నాప్ కు గురైన ఇద్దరు కూతుళ్లు బుధవారం మధ్యాహ్నం చెట్టు ఉరికి వేలాడుతూ కనిపించారని, ఇది ఖచ్చితంగా హత్యాచారమేనని ఆరోపిస్తూ.. కన్నీటి పర్యంతమయ్యారు.

ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. బాలికల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు.. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం నిందితుల కోసం గాలిస్తున్నామని, వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. కాగా.. లఖింపూర్ లో జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వ వైఫల్యమే ఇద్దరు ఆడపిల్లల చావుకి కారణమని అధికార పార్టీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. నిఘాసన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు దళిత అక్కా చెల్లెళ్లను కిడ్నాప్ చేసి, హత్య చేయడం దుర్మార్గమైన చర్య అని ఎస్పీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ అన్నారు. ఈ ఘటనపై కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ట్విట్టర్ లో స్పందించారు. లఖింపూర్ లో ఇద్దరు అక్కాచెల్లెళ్లను చంపిన ఘటన హృదయ విదారకంగా ఉందన్నారు. ఆ బాలికలను పట్టపగలు కిడ్నాప్ చేశారని కుటుంబ సభ్యులు చెప్పారని, దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో శాంతిభద్రతలు సరిగా లేవని ప్రియాంక ఆరోపించారు.








Tags:    

Similar News