గుడిలో సాఫ్ట్ వేర్ ఆత్మహత్య

శ్రావణ్ కుమార్ బీటెక్ పూర్తి చేసి.. సంవత్సరం నుండి హైదరాబాద్ లోని ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా..

Update: 2023-05-26 04:39 GMT

పోలీసులు లోన్ యాప్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటున్నా.. వారి ఆగడాలు ఆగడం లేదు. బాధితులు తీసుకున్న లోన్ కంటే అధిక సొమ్ము చెల్లించినా.. ఇంకా డబ్బు కట్టాలని లేదంటే మీ పరువు తీస్తామని వారి ఫొటోలను న్యూడ్ గా మార్ఫింగ్ చేసి.. బెదిరింపులకు పాల్పడుతున్నారు. అన్నంత పనీ చేస్తే నలుగురిలో బ్రతకలేమని భావిస్తున్న బాధితులు.. చేసేది లేక.. దాని నుండి బయటపడే మార్గం కనిపించక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.

లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలయ్యాడు. అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం దయ్యాలవారిపల్లెకు చెందిన ఎస్. శ్రావణ్ కుమార్ రెడ్డి (24) వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శ్రావణ్ కుమార్ బీటెక్ పూర్తి చేసి.. సంవత్సరం నుండి హైదరాబాద్ లోని ఓ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితం ఆన్ లైన్ లోన్ యాప్ లో అత్యవసర అవసరాల నిమిత్తం అప్పు తీసుకున్నాడు. తీసుకున్న మొత్తం తిరిగి చెల్లించినా.. ఇంకా చెల్లించాలని వేధించగా.. మొత్తం రూ.3.50 లక్షల వరకూ చెల్లించాడు. లక్షల సొమ్ము చెల్లించినా.. ఇంకా వేధింపులు కొనసాగడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడు.
అప్పులు తీర్చేందుకు రూ.4 లక్షలు కావాలని తండ్రిని అడగగా.. వారంరోజులలో సర్దుబాటు చేస్తానని హామీ ఇచ్చారు. కొంతమేర సర్దుబాటు చేసి.. 26న మరికొంత సొమ్మును ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలోనే శ్రావణ్ కుమార్ హైదరాబాద్ నుంచి తన బంధువుల ఊరైన మొరంపల్లెకు వెళ్లాడు. అక్కడ పూతపల్లేశ్వరస్వామి ఆలయంలో కిటికీ కమ్మీలకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు అతని తల్లిదండ్రులు, పోలీసులకు సమాచారమిచ్చారు. లోన్ యాప్ లలో అప్పులతో పాటు, క్రికెట్ బెట్టింగులకు కూడా అప్పులు చేసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News