ఇంట్లోనే దొంగనోట్ల ముద్రణ.. రూ.2వేలు అప్పు ఇచ్చి పట్టుబడిన ముఠా

దొంగ నోట్లను ముద్రించి వాటిని మార్కెట్ లోకి పంపుతున్న ఒక ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు.

Update: 2021-12-14 12:36 GMT

వందకు నాలుగు వందలు.. లక్షకు నాలుగు లక్షలు. ఏంటి నమ్మడం లేదా ? ఇప్పుడు బెజవాడలో ఇదే దందా సాగుతోంది. వడ్డీ వ్యాపారం అనుకునేరు. అస్సలు కాదు. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వనక్కర్లేదు కూడా.. మీరు ఒరిజినల్ నోట్ల కట్టలు ఇస్తే.. వాళ్లు నకిలీ నోట్లు నాగింతలు ఇస్తారు అంతే. ఇలా ఈజీ మనీకి అలవాటుపడిన కేటుగాళ్లు ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. కృష్ణా జిల్లా పెడనలో ఈ గ్యాంగ్ ను అరెస్ట్ చేసినట్లు మచిలీపట్నం డీఎస్పీ షేక్ మసూంబాషా తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాసా వెంకటేశ్వరరావు అనే వ్యక్తి.. ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసేలా దుకాణం తెరిచాడు. అయితే వీరికి దొంగనోట్ల ముద్రణ ఎలా తెలుసు ? అని అనుమానం రావొచ్చు. అరచేతిలో స్మార్ట్ ఫోన్ ఉందిగా.. ఏం కావాలన్నా.. ఏం నేర్చుకోవాలన్నా అది ఒక్కటి చాలు. యూట్యూబ్ లో దొంగనోట్లను ఎలా ముద్రించాలో చూశారు. మూడు నెలలపాటు క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత.. వీరభద్రపురంలోని కాసా నాగరాజు అనే వ్యక్తి ఇంట్లో ఏకంగా దొంగనోట్ల కుటీర పరిశ్రమే పెట్టేశాడు.

కమిషన్ ఇచ్చి....
ఒక స్కానర్‌, ప్రింటర్‌, పేపర్‌ కట్టర్‌లతో ముద్రణ నడిపిస్తున్నాడు. వెంకటేశ్వరరావుకి మరికొందరు జతకలిశారు. లక్ష ఒరిజినల్‌కు 4లక్షల ఫేక్ నోట్లు ఇచ్చే ఈ బిజినెస్‌లో 35 నుంచి 40శాతం కమిషన్ కూడా ఇస్తున్నాడు. ఇప్పటి వరకూ ఈ గ్యాంగ్ కొన్ని కోట్ల నోట్లను ముద్రించి, వాటిని మార్కెట్లోకి ప్రవేశపెట్టినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పెడన పట్టణంలోని దక్షిణ తెలుగుపాలెంకు చెందిన ముచ్చు శివ తన తల్లి వైద్యఖర్చుల నిమిత్తం రామలక్ష్మీవీవర్స్‌కాలనీకి చెందిన వాసా వెంకటేశ్వరరావు దగ్గర అప్పుగా రూ.2వేలు తీసుకున్నాడు. ఆ నగదుతో అమ్మకు మందులు కొనేందుకు మెడికల్ షాపుకు వెళ్లాడు. మందులు తీసుకుని ఆ నోట్లను షాపులో ఇవ్వగా.. వాటిని పరిశీలించిన షాపులోని వ్యక్తి.. అవి దొంగనోట్లని తేల్చాడు.
మందులు కొంటుండగా....
దాంతో శివ తిరిగి వెంకటేశ్వరరావు వద్దకు వెళ్లి దొంగనోట్ల గురించి ఆరా తీశాడు. కానీ.. వెంకటేశ్వరరావు అవి దొంగనోట్ల కాదని బుకాయించాడు. తనకు వీరభద్రపురంలోని కాసా నాగరాజు, అతని కుమారుడు ఇచ్చారని, అవే నీకు ఇచ్చానని నమ్మబలికాడు. అతనిపై ప్రవర్తనపై అనుమానం వచ్చిన శివ పెడన పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మొత్తం బండారం బయటపడింది. సూత్రధారి వెంకటేశ్వరరావుతో పాటు మరో 8 మందిని అరెస్ట్ చేసి, విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రజలు తమ వద్దకు వచ్చేవి అసలు నోట్లా ? లేక నకిలీ నోట్లా గమనించాలని, ఎవరికైనా దొంగనోట్లు వస్తే ఫిర్యాదు చేయాలని డీఎస్పీ మసూంబాషా విజ్ఞప్తి చేశారు.


Tags:    

Similar News